- జమ్మూ కశ్మీర్ లో మరో ఘోరం
- అడవిలో విగతజీవులుగా ఇద్దరు పోలీసు ఆఫీసర్లు
- సర్వీస్ రివాల్వర్లు మాయం
- ఉగ్రకోణంపై దర్యాప్తు
శ్రీనగర్, మహా : జమ్మూకశ్మీర్‌లోని కిశ్త్‌వాడ్ జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. విధుల్లో ఉండి, అదృశ్యమైన ఇద్దరు స్పెషల్ పోలీసు ఆఫీసర్లు అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం భద్రతా వర్గాల్లో కలకలం రేపింది. గురువారం ఉదయం అటవీ ప్రాంతంలో వీరి మృతదేహాలు లభ్యమయ్యాయి. మృతుల శరీరంపై బుల్లెట్ గాయాలు ఉండటం, వారి సర్వీసు తుపాకులు మాయమవడం పలు అనుమానాలకు తావిస్తోంది.
అసలేం జరిగింది?
స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ కు చెందిన బాబీ చాంద్ (57), రశ్పాల్ కుమార్ (45) బుధవారం మధ్యాహ్నం తమ క్యాంప్ నుంచి ధర్నా-మర్వా ప్రాంతంలోని ఆర్మీ పోస్ట్‌కు బయల్దేరారు. మధ్యాహ్నం 3.30 గంటల సమయంలో మార్గమధ్యంలోని దచన్ అటవీ ప్రాంతం నుంచి అనుమానాస్పద శబ్దాలు వినిపించడంతో, తనిఖీ చేసేందుకు వీరిద్దరూ అడవిలోకి వెళ్లారు. ఆ తర్వాత వారి నుంచి ఎలాంటి సమాచారం రాలేదు. సరిగ్గా అదే సమయంలో ఆ ప్రాంతంలో మొబైల్ నెట్వర్క్ సేవలు కూడా నిలిచిపోవడంతో అధికారుల్లో ఆందోళన మొదలైంది.
ముమ్మర గాలింపు.. మృతదేహాల లభ్యం
పోలీసు ఆఫీసర్లు అదృశ్యమైనట్లు నిర్ధారించుకున్న ఆర్మీ, భద్రతా బలగాలు దచన్ అటవీ ప్రాంతంలో రాత్రంతా ముమ్మర గాలింపు చర్యలు చేపట్టాయి. ఈ క్రమంలో గురువారం ఉదయం అడవిలో బాబీ చాంద్, రశ్పాల్ కుమార్ విగతజీవులుగా పడి ఉండటాన్ని భద్రతా సిబ్బంది గుర్తించారు.
ఉగ్రవాదుల పనేనా?
ఘటనాస్థలంలో మృతి చెందిన పోలీసుల వద్ద ఉండాల్సిన సర్వీసు తుపాకులు కనిపించకపోవడం గమనార్హం. ఉగ్రవాదులే వీరిని కిడ్నాప్ చేసి, కాల్చి చంపి ఆయుధాలను ఎత్తుకెళ్లి ఉండొచ్చని ఉన్నతాధికారులు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. ప్రస్తుతం ఆ ప్రాంతమంతా భద్రతా బలగాలు దిగ్బంధించి, ఉగ్రవాదుల కోసం నిర్బంధ తనిఖీలు నిర్వహిస్తున్నాయి.
కుల్గామ్ ఉగ్రదాడితో సంబంధం ఉందా?
మరోవైపు, బుధవారం మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలోనే జమ్మూకశ్మీర్‌లోని కుల్గామ్ జిల్లాలో ఉన్న సీఆర్పీఎఫ్ శిబిరంపై ఉగ్రదాడి జరిగింది. బైకులపై వచ్చిన ఇద్దరు ఉగ్రవాదులు చెక్‌పోస్ట్ వద్ద ఉన్న జవాన్లపై కాల్పులు జరిపి పరారయ్యారు. దాదాపు ఒకే సమయంలో కుల్గామ్ దాడి, కిశ్త్‌వాడ్‌లో పోలీసుల మిస్సింగ్ హత్య జరగడంతో ఈ రెండు ఘటనల వెనుక ఒకే ఉగ్రముఠా హస్తం ఉందా అనే కోణంలో పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.







