Mahaa Daily Exclusive

  పాకిస్థాన్‌లో ఉగ్రవాదుల భీకర దాడి…

Share

  • పాకిస్థాన్‌లో ఉగ్రవాదుల భీకర దాడి
  • పోలీసు కాన్వాయ్‌పై ఉగ్రవాదుల మెరుపుదాడి
  • కాల్పుల్లో 10 మంది పోలీసులు, 18 మంది ఉగ్రవాదులు మృతి
  • దాడికి పాల్పడింది తామేనని ప్రకటించిన టీటీపీ
  • రెండు పోలీస్ వాహనాలకు నిప్పు, మరికొన్ని వాహనాలు గల్లంతు
  • ఉగ్రవాదంపై పోరాటం ఆగదని స్పష్టం చేసిన పాకిస్థాన్ ప్రభుత్వం

ఇంటర్నెట్ డెస్క్, మహా : పాకిస్థాన్‌లో మరోసారి ఉగ్రవాదులు రెచ్చిపోయారు. దేశ వాయవ్య ప్రాంతంలోని ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లో పోలీసు కాన్వాయ్‌ను లక్ష్యంగా చేసుకుని భీకర దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో 10 మంది పోలీసులు వీరమరణం పొందగా, ఎదురుకాల్పుల్లో 18 మంది ఉగ్రవాదులు హతమయ్యారని ప్రావిన్షియల్ అధికారులు వెల్లడించారు. ఈ దాడిలో మరో 12 మంది పోలీసు సిబ్బందికి తీవ్ర గాయాలయ్యాయి. కోహట్ జిల్లాలోని గుంబత్ ప్రాంతంలో అక్రమ బంగారం మైనింగ్‌కు వ్యతిరేకంగా చేపట్టిన ఆపరేషన్ ముగించుకుని తిరిగి వస్తుండగా ఈ దాడి జరిగింది. పోలీసు కాన్వాయ్ ప్రయాణిస్తున్న సమయంలో ఉగ్రవాదులు ఒక్కసారిగా కాల్పులకు తెగబడినట్లు ఖైబర్ పఖ్తుంఖ్వా పోలీసులు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ దాడిలో ఉగ్రవాదులు రెండు పోలీసు వాహనాలకు నిప్పు పెట్టారు. మరో రెండు పోలీసు వాహనాలు, ఒక ప్రైవేట్ వాహనం గల్లంతైనట్లు అధికారులు పేర్కొన్నారు.

ఈ దాడికి తామే బాధ్యత వహిస్తున్నట్లు నిషేధిత ఉగ్రవాద సంస్థ తెహ్రీక్-ఏ-తాలిబన్ పాకిస్థాన్ (టీటీపీ) ప్రకటించుకుంది. ఇదిలా ఉండగా.. కోహట్ జిల్లాలోని ఒరక్‌జాయ్ ప్రాంతంలో భద్రతా దళాలు జరిపిన మరో ఆపరేషన్‌లో 10 మంది టీటీపీ ఉగ్రవాదులను మట్టుబెట్టినట్లు అధికారులు తెలిపారు. వారి నుంచి భారీగా ఆయుధాలు, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. పోలీసులపై జరిగిన ఈ దాడిని పాకిస్థాన్ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ, విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ తీవ్రంగా ఖండించారు. ఉగ్రవాదంపై తమ దేశ పోరాటం ఆగదని, ఇలాంటి పిరికిపంద చర్యలకు భయపడేది లేదని వారు తెలిపారు. పోలీసుల ప్రాణత్యాగం వృథా కాదని, దేశంలో శాంతిభద్రతలను కాపాడేందుకు ఉగ్రవాదాన్ని తుదముట్టించే వరకు పోరాడుతామని వారు స్పష్టం చేశారు.