Mahaa Daily Exclusive

  శేఖర్‌ మాస్టర్‌కు గాయాలు…

Share

  • శేఖర్‌ మాస్టర్‌కు గాయాలు
  • శంషాబాద్‌ సమీపంలో రెండు కార్లు ఢీ
  • స్వల్ప గాయాలతో బయటపడిన కొరియోగ్రాఫర్‌

హైదరాబాద్‌, మహా : శంషాబాద్, ఆంధ్రప్రభ : ప్రముఖ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ ప్రయాణిస్తున్న కారు రోడ్డు ప్రమాదానికి గురైంది. శంషాబాద్ మండల పరిధిలోని ముచ్చింతల్‌లో చిరంజీవి సినిమా షూటింగ్ ముగించుకుని హైదరాబాద్‌కు తిరిగి వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. గురువారం ఉదయం 6 గంటల సమయంలో ముచ్చింతల్ సమీపంలోని నాలుగు రోడ్ల కూడలి వద్ద శేఖర్ మాస్టర్ కారును ఓ వ్యాన్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు తీవ్రంగా దెబ్బతిన్నప్పటికీ, శేఖర్ మాస్టర్‌తో పాటు కారులో ఉన్న వారంతా సురక్షితంగా బయటపడ్డారు. ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని శేఖర్ మాస్టర్ బృందం వెల్లడించింది.

అయ్యప్ప దయ వల్ల అందరం క్షేమంగా ఉన్నాం: శేఖర్ మాస్టర్

ఈ ప్రమాదంపై శేఖర్ మాస్టర్ ఒక వీడియో సందేశం ద్వారా స్పందిస్తూ… “కాకా సాంగ్ షూటింగ్ ని ముగించుకొని తిరిగి వస్తుంటే తెల్లవారుజామున 6 గంటలకు కారు యాక్సిడెంట్ కి గురైంది. కారు వెనక భాగం పూర్తిగా దెబ్బతింది. ఆ సమయంలో కారులో మేము నలుగురం ఉన్నాం.. అయ్యప్ప దయ వల్లే మాకు ఏమీ జరగలేదు. అందరూ నాకు ఏమైందో అని మెసేజ్ లు చేస్తున్నారు. నేను క్షేమంగా ఉన్నాను. మాతో పాటు ఉన్నవారు కూడా క్షేమంగా ఉన్నారు. ఈరోజు రాత్రికి కూడా షూటింగ్ ఉంది. దానికి బయల్దేరుతున్నాను” అని తెలిపారు. ఇటీవలే అయ్యప్ప స్వామి మాల ధరించిన శేఖర్ మాస్టర్.. స్వామివారి ఆశీస్సుల వల్లే ఇంతటి ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డామని భావోద్వేగంతో వెల్లడించారు. తామంతా క్షేమంగా ఉన్నామని చెప్పడంతో అభిమానులు, సినీ ప్రముఖులు ఊపిరి పీల్చుకున్నారు.