Mahaa Daily Exclusive

  22-ఎ దరఖాస్తులను యుద్ధప్రాతిపదికన పరిష్కరించాలి….

Share

  • 22-ఎ దరఖాస్తులను యుద్ధప్రాతిపదికన పరిష్కరించాలి
  • ఒక్క దరఖాస్తు కూడా పెండింగ్‌లో ఉండటానికి వీల్లేదు
  • పరిష్కారంలో జాప్యానికి తావివ్వొద్దు- కలెక్టర్లు ప్రత్యేక చొరవ చూపాలి
  • కలెక్టర్ల బాధ్యతాయుతమైన పర్యవేక్షణతోనే సామాన్యులకు నిజమైన ప్రయోజనం
  • జిల్లా కలెక్టర్లు, జిల్లా రిజిస్ట్రార్లకు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదేశం

హైదరాబాద్, మహా : ఏళ్ల తరబడి అపరిష్కృతంగా ఉన్న 22-ఎ భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని, ఈ దిశగా ప్ర‌జా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను వేగవంతంగా, క్షేత్రస్థాయిలో పకడ్బందీగా అమలు చేసి దరఖాస్తుదారులకు ఉపశమనం కల్పించాలని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. 22-ఎ సమస్యల పరిష్కారానికి ఇటీవల కాలంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు క్షేత్రస్థాయిలో అమలు ప‌రిష్కారంలో ఎదుర‌వుతున్న స‌మ‌స్య‌లు తదితర అంశాలపై గురువారం సచివాలయంలోని తన కార్యాలయంలో హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాల కలెక్టర్లు, జిల్లా రిజిస్ట్రార్లతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, 22-ఎ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలన్న సంకల్పంతో గౌరవ ముఖ్యమంత్రి శాసనసభలో ఇచ్చిన హామీల‌కు అనుగుణంగా జీవో 118, జీవో 76లకు సంబంధించి మెమోలు, 22-ఎ జాబితాలో ఉన్నప్పటికీ జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ, డీటీసీపీ, మున్సిపల్ అనుమతులు కలిగిన ఇళ్లు, ప్లాట్లు, ఫ్లాట్ల రిజిస్ట్రేషన్లకు అనుమతులు, యూఎల్‌సీ దరఖాస్తుల పరిష్కారం, నాలా ప్రక్రియ పూర్తికాని పట్టా భూముల సమస్యల పరిష్కారం, జీవో 59 అమలు తదితర అంశాలకు సంబంధించి ప్రభుత్వం స్పష్టమైన ఉత్తర్వులు జారీ చేసిందన్నారు.

ఈ అంశాలకు సంబంధించి ఇప్పటివరకు వ‌చ్చిన దరఖాస్తులన్నింటినీ యుద్ధప్రాతిపదికన పరిష్కరించాలని, ఏ ఒక్క దరఖాస్తు కూడా పెండింగ్‌లో ఉండటానికి వీల్లేదని మంత్రి స్పష్టం చేశారు. ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను పకడ్బందీగా అమలు చేయాల్సిన బాధ్యత కలెక్టర్లదేనని పేర్కొన్నారు. ప్రతి వారం జిల్లా స్థాయిలో కలెక్టర్, జిల్లా రిజిస్ట్రార్, ఇతర సంబంధిత అధికారులు సమావేశమై 22-ఎ సమస్యల పరిష్కారంపై సమీక్షించుకోవాలని సూచించారు. జిల్లా స్థాయిలో పరిష్కరించడానికి వీలుకాని అంశాలను రెవెన్యూ శాఖ కార్యదర్శి డి.ఎస్. లోకేష్‌కుమార్ నాయకత్వంలోని ఉన్నతస్థాయి కమిటీకి సిఫార్సు చేయాలని సూచించారు. ప్రభుత్వం తీసుకుంటున్న విధానపరమైన నిర్ణయాలు, జారీ చేస్తున్న జీవోలు, మెమోలు కేవలం ప్రభుత్వ ఉత్తర్వులకే పరిమితం కాకూడదని, వాటి అసలు ఉద్దేశం క్షేత్రస్థాయిలో అమలైనప్పుడే ప్రజలకు నిజమైన మేలు జరుగుతుందని మంత్రి అన్నారు. ముఖ్యంగా కలెక్టర్లు ఈ అంశంపై ప్రత్యేక దృష్టి సారించి, ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలను క్షుణ్ణంగా పరిశీలించి, వాటి ప్రకారం అర్హులైన వారికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

యూఎల్ సికి సంబంధించి వివిధ కోర్టులు వెలువరించిన తుది తీర్పులు, ప్రభుత్వం తరఫున స్పెషల్ లీవ్ పిటిషన్లు (ఎస్‌ఎల్‌పీలు) దాఖలు చేసే అంశాలు, ఎస్‌ఎల్‌పీలు దాఖలు చేయడానికి అవకాశం లేని ఇతర అంశాలన్నింటిపై వారం రోజుల్లోగా ఉన్నతస్థాయి కమిటీ సమగ్ర నివేదిక అందించాలని మంత్రి సూచించారు. ఈ నివేదికపై ముఖ్యమంత్రితో చర్చించి రెగ్యులరైజేషన్‌పై తగిన నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. 22-ఎ జాబితాలో ఉన్న ప్రతి భూమికి సంబంధించిన రెవెన్యూ రికార్డులు, రిజిస్ట్రేషన్ వివరాలు, సంబంధిత ఆధారాలను సమగ్రంగా పరిశీలించాలని అధికారులకు సూచించారు. క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితులను నిర్ధారించిన తర్వాతే తగిన నిర్ణయాలు తీసుకోవాలని స్పష్టం చేశారు. నిజమైన యజమానులు తమ భూములపై హక్కులు పొందేందుకు అనవసరమైన జాప్యం జరగకుండా, కార్యాలయాల చుట్టూ తిరిగే పరిస్థితులు లేకుండా చూడాలన్నారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను అమలు చేయడంలో అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, అర్హులకు న్యాయం చేసే క్రమంలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావివ్వకూడదని మంత్రి స్పష్టం చేశారు. అదే సమయంలో ప్రభుత్వ భూములు, ప్రజా ప్రయోజనాలకు సంబంధించిన భూముల విషయంలో నిబంధనలను కచ్చితంగా పాటించాలని సూచించారు