Mahaa Daily Exclusive

  ఢిల్లీ మాజీ సీఎంకు బిష్ణోయ్​ గ్యాంగ్​ వార్నింగ్​…

Share

  • ఢిల్లీ మాజీ సీఎంకు బిష్ణోయ్​ గ్యాంగ్​ వార్నింగ్​
  • రూ.7 కోట్లు ఇవ్వకుంటే కేజ్రీవాల్​ను చంపేస్తామని హెచ్చరిక
  • ఢిల్లీ పోలీసులకు ఆప్ ఎమ్మెల్యే ఫిర్యాదు

న్యూఢిల్లీ, మహా : ఆమ్ఆద్మీ పార్టీ (ఆప్) జాతీయ కన్వీనర్, దిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్​ కేజ్రీవాల్​కు బెదిరింపు కాల్స్​ రావడం కలకలం రేపింది. రూ. 7 కోట్లు ఇవ్వాలని లేకుంటే కేజ్రీవాల్​ను ఆయన కుమార్తెను చంపేస్తామని బెదిరించారు. అయితే, ఆ ఘటనకు పాల్పడింది లారెన్స్​ బిష్ణోయ్​ గ్యాంగ్​ అని పంజాబ్​ పోలీసులు పేర్కొన్నారు. దిల్లీలోని తిలక్‌ నగర్‌ ఎమ్మెల్యే జర్నైల్‌ సింగ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులకు దర్యాప్తు చేపట్టారు. లారెన్స్‌ బిష్ణోయ్‌ ముఠా సభ్యుడినంటూ ఇటీవల తనకు ఓ వ్యక్తి ఫోన్‌ చేశారని జర్నైల్​ సింగ్​ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఫోన్​ కాల్​ అనంతరం వాట్సప్‌ సందేశాలు కూడా పంపినట్లు ఆయన తెలిపారు.

ఎమ్మెల్యే ఫిర్యాదు ప్రకారం,

“నేను లారెన్స్ బిష్ణోయ్ ముఠా నుంచి మాట్లాడుతున్నా. రూ. 7 కోట్లు ఇవ్వాలని అరవింద్ కేజ్రీవాల్‌కు చెప్పు. లేదంటే కేజ్రీవాల్‌ను, ఆయన కుమార్తె హర్షిత కేజ్రీవాల్‌ను చంపేస్తా” అని నిందితుడు బెదిరించినట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు. మరోవైపు, అరవింద్ కేజ్రీవాల్ ఒక ప్రముఖ వ్యక్తి కావడంతో, ఈ బెదిరింపు జాతీయ, ప్రజా భద్రతకు ముప్పుగా మారిందని జర్నైల్‌ సింగ్ ఆందోళన వ్యక్తం చేశారు. ఏదైనా అవాంఛనీయ సంఘటన జరగకముందే నిందితుడిని పట్టుకోవాలని పోలీసులను కోరారు. ఇందుకోసం కాల్ డీటెయిల్ రికార్డులు, ఐపీ లాగ్‌లు, లొకేషన్​ గుర్తించి సమగ్ర విచారణ చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. అలాగే, కేజ్రీవాల్​కు పూర్తి రక్షణ కల్పించేందుకు భద్రతా విభాగాలతో సమన్వయం చేసుకోవాలని అన్నారు. ఎమ్మెల్యే ఫిర్యాదు మేరకు, మొహాలీ పోలీసులు భారతీయ న్యాయ సంహితలోని పలు సెక్షన్లు (దోపిడీ/వసూలు చేయడం, భయపెట్టడం, ఐటీ చట్టం) వంటి పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.