• సొంత బిడ్డలుగానే గుర్తించాలి.
• కేరళ హైకోర్టు కీలక తీర్పు.
తిరువనంతపురం, మహా.
అధికారిక ప్రభుత్వ పత్రాల్లో దత్తత తీసుకున్న పిల్లలను ‘దత్తపుత్రుడు’, ‘దత్తపుత్రిక’గా పేర్కొనే విధానానికి తక్షణమే స్వస్తి పలకాలని కేరళ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. దత్తత పొందిన పిల్లలను వారి తల్లిదండ్రుల సొంత కుమారుడు లేదా కుమార్తెగానే గుర్తించాలని జస్టిస్ పీవీ కున్హికృష్ణన్ స్పష్టం చేశారు. ప్రభుత్వ ధ్రువీకరణ పత్రాల్లో ‘దత్తత’ అనే పదాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించాల్సిన అవసరం లేదని తేల్చిచెప్పారు. తండ్రి మరణానంతరం రెవెన్యూ అధికారులు జారీ చేసిన వారసత్వ ధ్రువీకరణ పత్రంలో తనను ‘దత్తపుత్రిక’గా పేర్కొనడాన్ని సవాలు చేస్తూ ఓ మహిళ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన న్యాయస్థానం ఈ మేరకు చరిత్రాత్మక తీర్పు వెలువరించింది.
చట్టప్రకారం వారు సొంత పిల్లలే..
హిందూ దత్తత, మనోవర్తి చట్టం-1956లోని సెక్షన్ 12 ప్రకారం.. దత్తత తీసుకున్న క్షణం నుంచే ఆ చిన్నారి, దత్తత తల్లిదండ్రుల సొంత బిడ్డగా పరిగణించబడతారని న్యాయమూర్తి గుర్తుచేశారు. సమాజం సైతం దత్తత పిల్లలను సొంత బిడ్డలుగానే ఆదరిస్తున్నప్పుడు, ప్రభుత్వ రికార్డుల్లో ప్రత్యేకంగా ఆ విషయాన్ని ప్రస్తావించడం అనవసరమని అభిప్రాయపడ్డారు. ‘దత్తత’ అనే పదం అవమానకరమైనది కాకపోయినప్పటికీ, అధికారిక పత్రాల్లో దానిని ఉపయోగించకుండా ఉండటమే సముచితమని స్పష్టం చేశారు.
అసలేం జరిగిందంటే..
పిటిషనర్‌ను 1990లో నెల రోజుల పసికందుగా ఉన్నప్పుడు ఓ దంపతులు న్యాయస్థానం ద్వారా చట్టబద్ధంగా దత్తత తీసుకున్నారు. అప్పటి నుంచి పాస్‌పోర్టు, రేషన్‌కార్డు, పాన్‌కార్డు, పదో తరగతి ధ్రువపత్రం సహా అన్ని అధికారిక పత్రాల్లోనూ వారి కుమార్తెగానే నమోదయ్యారు. 2023లో తల్లి మరణించినప్పుడు జారీ చేసిన వారసత్వ ధ్రువీకరణ పత్రంలోనూ ఆమెను ‘కుమార్తె’గానే పేర్కొన్నారు. అయితే, 2024లో తండ్రి మరణానంతరం తహసీల్దార్ జారీ చేసిన ధ్రువపత్రంలో ‘దత్తపుత్రిక’ అని నమోదు చేయడంతో ఆమె హైకోర్టును ఆశ్రయించారు.
నెల రోజుల్లో పోర్టల్‌లో మార్పులు చేయాలి
ఈ-డిస్ట్రిక్ట్ పోర్టల్‌లోని సాంకేతిక నిబంధనల ప్రకారమే అలా పేర్కొన్నామని ప్రభుత్వం చేసిన వాదనను హైకోర్టు తోసిపుచ్చింది. పిటిషనర్‌కు రెండు వారాల్లోగా ‘కుమార్తె’ అని మాత్రమే పేర్కొంటూ కొత్త వారసత్వ ధ్రువీకరణ పత్రాన్ని జారీ చేయాలని త్రిసూర్ తహసీల్దార్‌ను ఆదేశించింది. అంతేకాకుండా, నెల రోజుల్లోగా ఈ-డిస్ట్రిక్ట్ పోర్టల్ నుంచి ‘దత్తపుత్రుడు’, ‘దత్తపుత్రిక’ అనే ఎంపికలను పూర్తిగా తొలగించి, అందుకు అనుగుణంగా నిబంధనలను సవరించాలని రాష్ట్ర ప్రభుత్వానికి తేల్చిచెప్పింది.







