Mahaa Daily Exclusive

  2070 నాటికీ భారత్‌ హిందూ మెజారిటీ దేశమే.

Share

• ప్రపంచ ముస్లిం జనాభాలో రెండో స్థానానికి భారత్‌.

• ప్యూ రీసెర్చ్‌ సెంటర్‌ తాజా అధ్యయనం.

న్యూఢిల్లీ, మహా.

ప్రపంచవ్యాప్తంగా మతాలవారీగా జనాభా స్వరూపం, రానున్న ఐదు దశాబ్దాల్లో చోటుచేసుకోనున్న మార్పులపై ప్రఖ్యాత ‘ప్యూ రీసెర్చ్‌ సెంటర్‌’ కీలక నివేదికను విడుదల చేసింది. ప్రస్తుత జనాభా ధోరణులు ఇలాగే కొనసాగితే 2070 నాటికి కూడా భారత్‌ హిందూ మెజారిటీ దేశంగానే విరాజిల్లనుందని ఈ అధ్యయనం స్పష్టం చేసింది. అయితే, ప్రపంచంలో అత్యధిక ముస్లిం జనాభా కలిగిన దేశాల జాబితాలో 2070 నాటికి పాకిస్థాన్‌ తర్వాత భారత్‌ రెండో స్థానానికి చేరుకుంటుందని అంచనా వేసింది. మరోవైపు 2035 నాటికి క్రైస్తవులను అధిగమించి ముస్లింలు ప్రపంచంలోనే అతిపెద్ద మత సమూహంగా అవతరిస్తారని నివేదిక పేర్కొంది.

భారత్‌లోనే అధిక శాతం హిందువులు..

2020 గణాంకాల ప్రకారం భారత్‌లో 100 కోట్లకు పైగా హిందువులు నివసిస్తుండగా, ఇతర దేశాల్లో సుమారు 6.5 కోట్ల మంది ఉన్నారు. వీరిలో అత్యధికులు నేపాల్‌, బంగ్లాదేశ్‌లోనే ఉన్నారు. 2070 నాటికి భారత్‌లో హిందువుల జనాభా 111 కోట్ల నుంచి 129 కోట్లకు పెరుగుతుందని, ఇదే సమయంలో ముస్లింల సంఖ్య 21.3 కోట్ల నుంచి 33.4 కోట్లకు చేరుతుందని ప్యూ రీసెర్చ్‌ అంచనా వేసింది. దేశ మొత్తం జనాభాలో హిందువుల వాటా 2020లో 79 శాతం ఉండగా, 2070 నాటికి 76 శాతానికి తగ్గనుంది. ముస్లింల వాటా 15 శాతం నుంచి 20 శాతానికి పెరగనుంది. ప్రపంచవ్యాప్తంగా హిందువుల జనాభా 2020లో 120 కోట్లు ఉండగా, 2070 నాటికి మరో 19.9 కోట్లు పెరిగి దాదాపు 140 కోట్లకు చేరుతుందని నివేదిక తెలిపింది. అయితే ఇతర మతాల వృద్ధి వేగం ఎక్కువగా ఉండటంతో ప్రపంచ జనాభాలో హిందువుల వాటా 15 శాతం నుంచి 14 శాతానికి స్వల్పంగా తగ్గనుంది.

అగ్రస్థానాల్లో మార్పులు చేర్పులు

ప్రపంచంలోని మొత్తం హిందువుల్లో దాదాపు 95 శాతం మంది భారత్‌లోనే ఉన్నారు. భారత్‌ తర్వాత నేపాల్‌ (2.4 కోట్లు), బంగ్లాదేశ్‌ (1.3 కోట్లు), పాకిస్థాన్‌ (50 లక్షలు), ఇండోనేషియా (40 లక్షలు) తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నాయి. 2070 నాటికి ఈ జాబితాలో కీలక మార్పులు చోటుచేసుకోనున్నాయి. అమెరికా ప్రపంచంలో ఐదో అతిపెద్ద హిందూ జనాభా కలిగిన దేశంగా అవతరించనుండగా, సుమారు 30 లక్షల మంది హిందువులతో ఆస్ట్రేలియా మొదటి పది దేశాల జాబితాలో చేరనుంది. పాకిస్థాన్‌లో హిందువుల జనాభా రెట్టింపై కోటి మందికి చేరుతుందని అంచనా వేసిన నివేదిక, మారిషస్‌, ఫిజీ, సురినామ్‌ దేశాల్లో మాత్రం హిందువుల వాటా తగ్గవచ్చని పేర్కొంది.

మతమార్పిడుల ప్రభావం నామమాత్రమే

ప్రపంచ హిందూ జనాభాపై మతమార్పిడుల ప్రభావం అత్యంత స్వల్పంగా ఉందని అధ్యయనం తేల్చిచెప్పింది. చిన్నతనంలో హిందువులుగా పెరిగిన వారిలో 99 శాతం మంది పెద్దయ్యాక కూడా అదే మతంలో కొనసాగుతున్నారు. ముస్లింలలోనూ ఇదే స్థాయి కొనసాగింపు ఉండగా, క్రైస్తవుల్లో 85 శాతం, బౌద్ధుల్లో 83 శాతం మంది తమ మతాన్ని అంటిపెట్టుకుని ఉంటున్నారు. 2020–2070 మధ్య మతమార్పిడుల వల్ల ప్రపంచ హిందూ జనాభా నికరంగా 10 లక్షల మేర తగ్గే అవకాశం ఉంది. మరోవైపు వలసల కారణంగా ఉత్తర అమెరికా, యూరప్‌, మధ్యప్రాచ్యం, ఉత్తర ఆఫ్రికా దేశాల్లో 2070 నాటికి అదనంగా 80 లక్షలకు పైగా హిందువులు పెరగనున్నారు. ప్రపంచ హిందువుల్లో 52 శాతం మంది 30 ఏళ్లలోపు యువతే ఉండటం గమనార్హం.

తగ్గుతున్న సంతానోత్పత్తి రేటు

2020–2025 మధ్య ప్రపంచ హిందువుల సంతానోత్పత్తి రేటు ప్రతి మహిళకు సగటున 1.9 మంది పిల్లలుగా నమోదైంది. ఇతర మతాల సగటు సంతానోత్పత్తి రేటు 2.3గా ఉంది. ఆసియా దేశాలైన నేపాల్‌లో 2.0, భారత్‌, బంగ్లాదేశ్‌లలో 1.9 చొప్పున హిందువుల సంతానోత్పత్తి రేటు కొనసాగుతోంది. భారత్‌లో మూడు దశాబ్దాల క్రితం హిందూ మహిళల సగటు సంతానోత్పత్తి రేటు 3.3గా ఉండగా, ప్రస్తుతం అది 1.9కి గణనీయంగా తగ్గిందని ప్యూ రీసెర్చ్‌ సెంటర్‌ వివరించింది.