Mahaa Daily Exclusive

  నోట్‌బందీ.. ఓట్‌బందీ ఒకే నాణేనికి రెండు పార్శ్వాలు.

Share

• మోదీ, అమిత్‌షా ప్రజాస్వామ్యాన్ని బలహీనపరుస్తున్నారు.

• ఓట్ల చోరీతో ప్రజల ప్రశ్నించే గొంతుకను అణచివేస్తున్నారు

• జైరాం రమేష్‌ ధ్వజం.

న్యూఢిల్లీ, మహా.

నోట్ల రద్దు (నోట్‌బందీ), ఓటర్ల జాబితా నుంచి పేర్ల తొలగింపు (ఓట్‌బందీ) ఒకే నాణేనికి ఉన్న రెండు పార్శ్వాలని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జైరాం రమేష్‌ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. గతంలో నోట్ల రద్దుతో సామాన్యుల సంపాదన, జీవనోపాధిపై దెబ్బకొట్టిన కేంద్ర ప్రభుత్వం.. ఇప్పుడు ‘ఓట్ల చోరీ’ పేరుతో పౌరుల ఓటు హక్కును, ప్రభుత్వాన్ని ప్రశ్నించే గొంతుకను అణచివేస్తోందని ఆరోపించారు. గురువారం సామాజిక మాధ్యమం ‘ఎక్స్‌’ వేదికగా ఆయన కేంద్ర ప్రభుత్వ తీరుపై విమర్శలు గుప్పించారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా కలిసి ఎన్నికల ప్రక్రియ ద్వారా ప్రభుత్వాన్ని జవాబుదారీగా నిలదీసే ప్రజల శక్తిని బలహీనపరుస్తున్నారని జైరాం రమేష్‌ మండిపడ్డారు. పేదలు, కార్మికులు, రైతులు, వెనుకబడిన వర్గాలు, యువత, మధ్యతరగతి ప్రజల చేతిలో ఉన్న అత్యంత శక్తివంతమైన ఆయుధం ఓటు మాత్రమేనని గుర్తుచేశారు. ఎన్నికల్లో ఓడిపోతామనే భయం ఉన్నప్పుడే ప్రభుత్వాలు ప్రజల సమస్యలను ఆలకించి, తమ విధానాలకు జవాబుదారీగా ఉంటాయని అభిప్రాయపడ్డారు. అయితే, ప్రజాతీర్పుతో సంబంధం లేకుండానే అధికారంలో కొనసాగవచ్చనే ధీమాతో ప్రస్తుత ప్రభుత్వం వ్యవహరిస్తోందని దుయ్యబట్టారు.

12 ఏళ్ల పాలనలో సామాన్యుడికి కష్టాలే..

ఓటర్ల జాబితాల నుంచి పేర్లను తొలగించడం ద్వారా ప్రజలు తమకు నచ్చిన ప్రభుత్వాన్ని ఎన్నుకునే ప్రాథమిక హక్కును కోల్పోతున్నారని జైరాం రమేష్‌ ఆందోళన వ్యక్తం చేశారు. మోదీ ప్రభుత్వ 12 ఏళ్ల పాలనలో పెరిగిన ద్రవ్యోల్బణం సామాన్యుల కుటుంబ బడ్జెట్‌ను చిన్నాభిన్నం చేసిందని, నిరుద్యోగం యువత భవిష్యత్తును ప్రశ్నార్థకం చేసిందని విమర్శించారు. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎంజీఎన్‌ఆర్‌ఈజీఏ)లో చేసిన మార్పులు గ్రామీణ కార్మికుల హక్కులను బలహీనపరిచాయని ఆరోపించారు.

కొద్దిమంది కార్పొరేట్ల ప్రయోజనాలకు పెద్దపీట వేస్తూ విధానాలు రూపొందిస్తున్న కేంద్రం, సామాన్యుల కష్టాలను పూర్తిగా విస్మరిస్తోందని జైరాం రమేష్‌ విమర్శించారు. ఓటు హక్కు బలహీనపడితే ప్రభుత్వ జవాబుదారీతనం నశించి, అధికార అహంకారం పెరుగుతుందని హెచ్చరించారు. తమ పోరాటం కేవలం ఓటును కాపాడుకోవడానికి మాత్రమే కాదని, ప్రతి పౌరుడి రాజ్యాంగబద్ధ హక్కులను పరిరక్షించుకోవడానికని స్పష్టం చేశారు. ‘ఓట్‌ చోర్‌.. గద్దీ ఛోడ్‌’ అనే నినాదంతో ఆయన తన పోస్టును ముగించారు.