Mahaa Daily Exclusive

  రహదారుల నిర్మాణంలో నాణ్యతపై రాజీ వద్దు.

Share

• ప్రమాదాలకు మనమే బాధ్యులం.
• ఇంజినీర్లకు కేంద్ర మంత్రి గడ్కరీ చురకలు.
• తెలంగాణ అభివృద్ధికి కేంద్రం నుంచి పూర్తి సహకారం అందిస్తామని భరోసా.

హైదరాబాద్‌, మహా.
రహదారుల నిర్మాణంలో నాణ్యత, భద్రత, మన్నిక విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడొద్దని కేంద్ర రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ ఇంజినీర్లకు స్పష్టం చేశారు. కాంట్రాక్టర్లు, కన్సల్టెంట్లు, ఇంజినీర్లు తమ పనికి పూర్తి బాధ్యత వహిస్తూ అత్యున్నత ప్రమాణాలతో నిర్మాణాలను పూర్తి చేయాలని సూచించారు. గురువారం హైదరాబాద్‌లో 85వ ‘ఇండియన్‌ రోడ్స్‌ కాంగ్రెస్‌’ సదస్సును ప్రారంభించిన సందర్భంగా కేంద్ర మంత్రి ప్రసంగిస్తూ.. రహదారుల రూపకల్పన, నిర్మాణంలో ఇంజినీర్ల నిర్లక్ష్య వైఖరిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
ఇంజినీర్లలో బాధ్యతాయుతమైన ధోరణి రావాలి
ఫ్లైఓవర్లు నిర్మించాల్సిన చోట నిర్మించడం లేదని, అండర్‌పాస్‌లు ఏర్పాటు చేయాల్సిన చోట పట్టించుకోవడం లేదని నితిన్‌ గడ్కరీ ఆక్షేపించారు. జంక్షన్ల రూపకల్పనలోనూ తగిన శ్రద్ధ చూపడం లేదని వ్యాఖ్యానించారు. దేశంలో రహదారులపై జరుగుతున్న ప్రమాదాలకు మనమే బాధ్యులమని ఆయన స్పష్టం చేశారు. ఈ విషయంలో ఇంజినీర్ల ఆలోచనా విధానం మారి, కచ్చితంగా బాధ్యతాయుతమైన ధోరణి రావాలని హితవు పలికారు. తన మాటలు కొంత కఠినంగా అనిపిస్తే క్షమించాలని కోరుతూనే.. దేశ ప్రజల ప్రాణాలను కాపాడేందుకు ఇండియన్‌ రోడ్స్‌ కాంగ్రెస్‌లోని ప్రతి ఇంజినీర్‌ నిబద్ధతతో, జవాబుదారీతనంతో పనిచేయాలని గడ్కరీ పిలుపునిచ్చారు.
తెలంగాణకు పూర్తి సహకారం అందిస్తాం
తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం నుంచి తన వంతు పూర్తి సహకారం అందిస్తానని నితిన్‌ గడ్కరీ భరోసా ఇచ్చారు. రాష్ట్రానికి ఎంత మేర సహాయం చేయగలనో అంతా చేస్తానని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రభుత్వానికి ఈ సందర్భంగా ఆయన హామీ ఇచ్చారు.