- ‘నషా ముక్త్ భారత్ యాత్ర’కు నాగార్జున మద్దతు.
- హైదరాబాద్ వాక్‌లో పాల్గొనాలని ఆహ్వానించిన కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి.
- యాత్ర ప్రచార టీ-షర్టులను కలిసి ఆవిష్కరించిన ఇరువురు నేతలు.
హైదరాబాద్, మహా.
యువత బంగారు భవిష్యత్తును చిదిమేస్తున్న మత్తుపదార్థాల మహమ్మారిని తరిమికొట్టేందుకు సినీ, రాజకీయ రంగాలు ఏకమవుతున్నాయి. కేంద్ర మంత్రి జి. కిషన్‌రెడ్డి ఆధ్వర్యంలో ఈ నెల 25, 26, 27 తేదీల్లో హైదరాబాద్ మహానగరంలో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనున్న ‘నషా ముక్త్ భారత్ యాత్ర’ (హైదరాబాద్ వాక్)కు ప్రముఖ సినీ నటుడు అక్కినేని నాగార్జున సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఈ మహా ప్రజా ఉద్యమంలో భాగస్వాములు కావాలని కోరుతూ కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి గురువారం నాగార్జున నివాసానికి వెళ్లి ప్రత్యేకంగా ఆహ్వానించారు. అనంతరం ఇరువురు కలిసి యాత్రకు సంబంధించిన ప్రచార టీ-షర్టులను ఆవిష్కరించారు.
డ్రగ్స్ నిర్మూలన మనందరి సామాజిక బాధ్యత: నాగార్జున
ఈ సందర్భంగా అక్కినేని నాగార్జున మాట్లాడుతూ.. సమాజాన్ని, ముఖ్యంగా యువత జీవితాలను నాశనం చేస్తున్న డ్రగ్స్ రక్కసిని అంతమొందించడం మనందరి సామాజిక బాధ్యత అని పేర్కొన్నారు. మత్తుపదార్థాల బారిన పడకుండా యువతలో చైతన్యం కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఆరోగ్యకరమైన, డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం కోసం జరిగే ఇలాంటి గొప్ప కార్యక్రమాలకు తన మద్దతు ఎల్లప్పుడూ ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.
2029 నాటికి డ్రగ్స్ రహిత భారత్ లక్ష్యం: కిషన్‌రెడ్డి
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన ‘నషా ముక్త్ యువా ఫర్ వికసిత్ భారత్’ పిలుపు మేరకు, 2029 నాటికి డ్రగ్స్ రహిత భారతదేశాన్ని నిర్మించాలన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా దృఢ సంకల్పంతో ఈ యాత్రను చేపడుతున్నట్లు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి వివరించారు. భావితరాల భద్రత కోసం నిర్వహిస్తున్న ఈ మహా యజ్ఞంలో యువత, తల్లిదండ్రులు, నగర ప్రజలు స్వచ్ఛందంగా భాగస్వాములై విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.








