- ఆర్థిక క్రమశిక్షణ తప్పనిసరి.
- పేదరికం నుంచి బయటపడ్డవారు మళ్లీ వెనక్కి జారొద్దు.
- మంత్రులకు ప్రధాని మోదీ దిశానిర్దేశం.
- యువతను డ్రగ్స్ మహమ్మారి నుంచి కాపాడాలని భావోద్వేగ పిలుపు.
న్యూఢిల్లీ, మహా.
‘‘తినడం, తాగడం, విలాసంగా గడపడం భారతీయ సంస్కృతి కాదు.. పొదుపును ప్రోత్సహించే గొప్ప సంప్రదాయం మనది’’ అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. కోట్లాది మంది ప్రజలను పేదరికం నుంచి బయటకు తీసుకురావడం ఎంత ముఖ్యమో, వారు ఆర్థిక క్రమశిక్షణతో వ్యవహరించి తిరిగి పేదరికంలోకి జారిపోకుండా చూడటం కూడా అంతే ప్రధానమని మంత్రులకు స్పష్టం చేశారు. ప్రజల్లో పొదుపు అలవాట్లను పెంపొందించేందుకు ప్రభుత్వపరంగా విస్తృత కృషి జరగాలని సూచించారు. గురువారం న్యూఢిల్లీలోని ‘భారత్ మండపం’లో ప్రధాని అధ్యక్షతన కేంద్ర మంత్రిమండలి సమావేశం జరిగింది. సుమారు మూడున్నర గంటల పాటు సాగిన ఈ భేటీలో పేదరిక నిర్మూలన, సమ్మిళిత వృద్ధి, అంతర్గత భద్రత, మాదకద్రవ్యాల నియంత్రణ, నక్సలిజం నిర్మూలన తదితర కీలక అంశాలపై విస్తృతంగా చర్చించారు. గత సెప్టెంబరులో నిర్వహించిన ‘చింతన్ శిబిరం’లో మంత్రులకు అప్పగించిన బాధ్యతల పురోగతిని సమీక్షించడంతో పాటు, 11 మంది కేంద్ర కార్యదర్శులు తమ శాఖల పనితీరుపై ప్రజెంటేషన్లు ఇచ్చారు.
పేదరిక నిర్మూలనలో చరిత్రాత్మక విజయం.. నిలబెట్టుకోవడమే సవాల్
దేశంలో పేదరికం గణనీయంగా తగ్గడం జాతీయ స్థాయిలో వేడుకగా జరుపుకోవాల్సిన గొప్ప విజయమని మోదీ అభివర్ణించారు. 2026 అక్టోబరులో ప్రపంచ బ్యాంకు విడుదల చేసిన ‘ఇండియా పావర్టీ అండ్ ఈక్విటీ బ్రీఫ్’ నివేదిక ప్రకారం.. రోజుకు 4.20 డాలర్ల ఆదాయ ప్రమాణం ఆధారంగా 2011లో 57.7 శాతంగా ఉన్న పేదరికం, 2023 నాటికి 16.1 శాతానికి పడిపోయింది. ఈ కాలంలో సుమారు 49.6 కోట్ల మంది (దాదాపు 50 కోట్లు) పేదరికం నుంచి విముక్తి పొందారు. అత్యంత పేదరికం సైతం 27.1 శాతం నుంచి 2.6 శాతానికి తగ్గింది. మరోవైపు, బహుముఖ పేదరిక సూచీ (ఎంపీఐ) ఆధారంగా నీతి ఆయోగ్ 2024లో విడుదల చేసిన అంచనాల ప్రకారం.. 2013–14 నుంచి 2022–23 మధ్య 24.82 కోట్ల మంది బహుముఖ పేదరికం నుంచి బయటపడ్డారు. వేర్వేరు ప్రమాణాలతో వెలువడిన ఈ గణాంకాలు దేశ ప్రగతికి నిదర్శనమని పేర్కొన్న ప్రధాని, సాధించిన ఈ ఫలితాలు చేజారిపోకుండా నిరంతర అప్రమత్తత అవసరమని సూచించారు. ప్రత్యక్ష నగదు బదిలీ (డీబీటీ), బ్యాంకింగ్ సేవల విస్తరణ ద్వారా ప్రభుత్వ పథకాల ఫలాలు చివరి వ్యక్తి వరకు చేరేలా చూడాలని మంత్రులను ఆదేశించారు.
యువతను డ్రగ్స్ నుంచి కాపాడాలి
దేశ భవిష్యత్తు అయిన యువతను మాదకద్రవ్యాల (డ్రగ్స్) ముప్పు నుంచి కాపాడటం ప్రభుత్వ అత్యంత ప్రాధాన్య అంశమని మోదీ స్పష్టం చేశారు. డ్రగ్స్ దుర్వినియోగం, యువతపై దాని దుష్ప్రభావాల గురించి ప్రస్తావించే సమయంలో ప్రధాని తీవ్ర భావోద్వేగానికి లోనైనట్లు సమాచారం. నక్సలిజాన్ని ఎదుర్కొనేందుకు అన్ని విభాగాలు సమష్టిగా పోరాడి సత్ఫలితాలు సాధించినట్లే, మాదకద్రవ్యాల మహమ్మారిపైనా దృఢ సంకల్పంతో పనిచేస్తే విజయం తథ్యమని దిశానిర్దేశం చేశారు. దేశాన్ని డ్రగ్స్ రహితంగా మార్చేందుకు అన్ని మంత్రిత్వ శాఖలు సమన్వయంతో సమగ్ర కార్యాచరణ అమలు చేయాలని ఆదేశించారు.
నక్సలిజం మళ్లీ తలెత్తకుండా నిరంతర నిఘా
దేశంలో నక్సలిజం ప్రభావం గణనీయంగా తగ్గిన ప్రాంతాల్లో మళ్లీ హింసకు తావులేకుండా పటిష్ఠ చర్యలు తీసుకోవాలని ప్రధాని ఆదేశించారు. సాధించిన విజయాలతో సంతృప్తి చెంది ఏమాత్రం నిర్లక్ష్యం వహించవద్దని, అంతర్గత భద్రత విషయంలో నిరంతర అప్రమత్తత అవసరమని తేల్చిచెప్పారు. పేదరిక నిర్మూలన, నక్సలిజం కట్టడి, డ్రగ్స్ నిర్మూలన అంశాలను పరస్పరం అనుసంధానించి సమష్టి కృషితో ముందుకు సాగాలని మంత్రులకు సూచించారు. మహిళలు, యువత సాధికారతతో పాటు ఆర్థిక క్రమశిక్షణ, సామాజిక, అంతర్గత భద్రతలకు సమాన ప్రాధాన్యం ఇవ్వడం ద్వారానే వికసిత భారత్ లక్ష్యాన్ని చేరుకోగలమని ప్రధాని మోదీ స్పష్టం చేశారు.







