Mahaa Daily Exclusive

  తెలంగాణలో అధికారంలోకి వచ్చేది బీజేపీ ప్రభుత్వమే.

Share

  • ఎన్. రాంచందర్ రావు.

హైదరాబాద్, మహా.

తెలంగాణలో రాబోయే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అధికారంలోకి రావడం ఖాయమని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు ధీమా వ్యక్తం చేశారు. మంగళవారం హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కరీంనగర్ వేదికగా జరిగిన బీజేపీ మహా పాదయాత్ర అత్యంత విజయవంతంగా జరిగిందని, నిన్నటి సభలో జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ వేలాది మంది కార్యకర్తల సమక్షంలో తెలంగాణలో బీజేపీ ప్రభుత్వ ఏర్పాటుపై స్పష్టమైన సందేశం ఇచ్చారని తెలిపారు. అంతకుముందు హైదరాబాద్‌లో అమిత్ షా ఆధ్వర్యంలో జరిగిన మహా పాదయాత్ర, నిర్మల్ జిల్లాలో భారీ వర్షాన్ని సైతం లెక్కచేయకుండా జరిగిన యాత్రలకు ప్రజల నుంచి విశేష స్పందన లభించిందని పేర్కొన్నారు.

బీజేపీ కార్యక్రమాలకు వస్తున్న ప్రజాదరణ చూసి కాంగ్రెస్ నాయకుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని రాంచందర్ రావు ఎద్దేవా చేశారు. 90 సీట్లు గెలుస్తామని సీఎం రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ నేతలు చెబుతున్నప్పటికీ, రాబోయే ఎన్నికల్లో 90 స్థానాల్లో కాంగ్రెస్‌కు డిపాజిట్లు గల్లంతవుతాయనే భయం వారిని వెంటాడుతోందని విమర్శించారు. జాతీయ నాయకులు రాష్ట్రానికి వచ్చినప్పుడల్లా కాంగ్రెస్ నేతలు అసహనం, అసహనాన్ని బయటపెట్టుకుంటున్నారని మండిపడ్డారు. బీజేపీ ఎదుగుదలను అడ్డుకోవడానికి కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ఒక్కటై కుట్రలు పన్నుతున్నాయని ఆరోపించారు. గతంలో ‘మోసగాడు’లా బీఆర్ఎస్ పరిపాలిస్తే, నేడు ‘మోసగాళ్లకు మోసగాడు’ సినిమా తరహాలో కాంగ్రెస్ పాలన సాగిస్తోందని వ్యాఖ్యానించారు. ఈ రెండు పార్టీల ఆట కట్టించి, పూర్తి అవినీతి రహిత పరిపాలనను కేవలం బీజేపీ మాత్రమే అందిస్తుందని స్పష్టం చేశారు.

కృష్ణా జలాల అంశంపై మాట్లాడుతూ, 512 టీఎంసీల నీటి వాటా రావాల్సి ఉండగా గత బీఆర్ఎస్ ప్రభుత్వం కేవలం 299 టీఎంసీలకు ఎందుకు సంతకాలు పెట్టిందో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. నీటి సమస్యలపై బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు తెలంగాణ సెంటిమెంట్ పేరుతో ప్రజలను మరోసారి మోసం చేసేందుకు యత్నిస్తున్నాయని అన్నారు. కేంద్రం రాష్ట్రానికి ఏమి ఇచ్చిందంటూ గతంలో బీఆర్ఎస్ అబద్ధపు ప్రచారం చేసి ఫామ్‌హౌస్‌కు పరిమితమైందని, ఇప్పుడు అదే ప్రశ్న అడుగుతున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా అదే గతి పడుతుందని హెచ్చరించారు.

నరేంద్ర మోదీ ప్రభుత్వం తెలంగాణకు ఇప్పటివరకు సుమారు రూ.13 లక్షల కోట్ల నిధులు అందించిందని, పేదలకు ఉచిత బియ్యం అందజేస్తోందని రాంచందర్ రావు వివరించారు. మూడు గంటల ప్రయాణాన్ని గంటలో పూర్తి చేసేలా జాతీయ రహదారులు నిర్మించామని తెలిపారు. కాంగ్రెస్ హయాంలో పక్క రాష్ట్రానికి తరలిపోయిన వరంగల్ కోచ్ ఫ్యాక్టరీని మోదీ ప్రభుత్వం పునరుద్ధరించిందని, వరంగల్ ఎయిర్‌పోర్ట్‌తో పాటు ఆదిలాబాద్‌లో డిఫెన్స్ ఎయిర్‌పోర్ట్ మంజూరు చేసిందని గుర్తుచేశారు. ములుగులో గిరిజన సెంట్రల్ యూనివర్సిటీ, బీబీనగర్ ఎయిమ్స్, జహీరాబాద్ నిమ్జ్, వరంగల్ పీఎం మిత్ర టెక్స్‌టైల్ పార్క్, 3,000 మెగావాట్ల సౌర విద్యుత్ అనుమతులు, రామగుండం ఎరువుల కర్మాగారం పునరుద్ధరణ వంటి ఎన్నో ప్రాజెక్టులను కేంద్రం చేపట్టిందని పేర్కొన్నారు.

కేంద్రాన్ని ప్రశ్నించే నైతిక హక్కు కాంగ్రెస్‌కు లేదని, రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గానికి ఏమి చేశారో మంత్రులు ముందుగా సమాధానం చెప్పాలని నిలదీశారు. రాష్ట్ర నిధులన్నీ కొడంగల్ నియోజకవర్గానికే వెళ్తున్నాయని స్వయంగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలే ఆరోపిస్తున్నారని తెలిపారు. పెద్ద నోట్ల రద్దు వల్ల విదేశాల నుంచి ఆయుధాలు అందక నక్సలిజం బలహీనపడిందని, ఉగ్రవాదం అణిచివేయబడిందని లొంగిపోయిన నక్సలైట్లే చెబుతున్నారని అన్నారు. బంగారం కొనుగోళ్లు తగ్గించి ఈవీ వాహనాలు వాడాలన్న ప్రధాని సూచనను అప్పట్లో ఎగతాళి చేసినా, దానివల్ల దిగుమతులు తగ్గి ఆర్థిక వ్యవస్థ బలోపేతమైందని చెప్పారు. ఐఎంఎఫ్, వరల్డ్ బ్యాంక్ వంటి సంస్థలు భారత్‌ను వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా కొనియాడుతున్నాయని, అమెరికాలో రాహుల్ గాంధీ విమర్శలకు భిన్నంగా డొనాల్డ్ ట్రంప్ సైతం భారత వృద్ధిని ప్రశంసించారని అన్నారు. రాహుల్ గాంధీని ప్రధాని చేస్తామంటున్న రేవంత్ రెడ్డికి ముందుగా తెలంగాణతో పాటు కర్ణాటకలోనూ కాంగ్రెస్ అధికారం కోల్పోయే పరిస్థితి ఎదురవుతుందని రాంచందర్ రావు జోస్యం చెప్పారు.