Mahaa Daily Exclusive

  నిరుపేదలకు రూ.5 లక్షల జీవిత బీమా.

Share

  •  ఖమ్మంలో అభివృద్ధి పనులకు మంత్రి పొంగులేటి శ్రీకారం.

ఖమ్మం,మహా.

అభివృద్ధి, సంక్షేమాలకు సమాన ప్రాధాన్యత ఇస్తూ ప్రజా ప్రభుత్వం ముందుకు సాగుతోందని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. నిరుపేద కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించేందుకు రూ.5 లక్షల రక్షణతో ‘ఇందిరమ్మ జీవిత బీమా’ పథకాన్ని అమలు చేస్తున్నట్లు వెల్లడించారు. మంగళవారం ఖమ్మం నగరంతో పాటు ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలో పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపనలు చేశారు.

ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 60వ డివిజన్ రామన్నపేటలో రూ.90 లక్షల వ్యయంతో నిర్మించనున్న సైడ్ డ్రెయిన్ల పనులకు జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్., మున్సిపల్ కమిషనర్ అభిషేక్ అగస్త్యతో కలిసి మంత్రి శంకుస్థాపన చేశారు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క 60వ డివిజన్‌లోనే రూ.21.70 కోట్లతో వివిధ అభివృద్ధి పనులు చేపట్టామని, రానున్న రోజుల్లో ప్రతి వీధిలోనూ రోడ్లు, డ్రెయిన్లు పూర్తి చేసి నాణ్యమైన సీసీ రోడ్లు నిర్మిస్తామని హామీ ఇచ్చారు. ఇళ్ల స్థలాలు, ఇందిరమ్మ ఇళ్ల కోసం ఎదురుచూస్తున్న అర్హులైన పేద కుటుంబాలకు విడతల వారీగా ఇళ్లు మంజూరు చేస్తామని, అర్హత, నిజాయితీ ప్రాతిపదికన ఇళ్ల స్థలాల వివరాలను పరిశీలించి న్యాయం చేయాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు.

గతంలో భూమి ఉన్న రైతులు, చేనేత, మత్స్య, గీత కార్మికులకు మాత్రమే కొన్ని బీమా సదుపాయాలు ఉండేవని, భూమి లేని నిరుపేదలు, కులవృత్తులు లేని కుటుంబాల పెద్దలకు అనుకోని ప్రమాదం జరిగితే ఆ కుటుంబాలు ఆర్థికంగా ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇందిరమ్మ జీవిత బీమా పథకాన్ని ప్రారంభించారని మంత్రి వివరించారు. రూ.5 లక్షల బీమా రక్షణ కల్పించే ఈ పథకానికి దరఖాస్తులు స్వీకరిస్తున్నామని, అర్హులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఇప్పటికే 200 యూనిట్ల ఉచిత విద్యుత్, సన్నబియ్యం పంపిణీ, కొత్త రేషన్ కార్డులు, మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణంతో పాటు 74 వేల ఉద్యోగాలను భర్తీ చేశామని, పాలేరు నియోజకవర్గంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను కొనసాగిస్తామని పేర్కొన్నారు.

అనంతరం ఏదులాపురం మున్సిపాలిటీలోని 25, 26వ వార్డుల్లో రూ.2.49 కోట్ల వ్యయంతో చేపట్టనున్న అంతర్గత సీసీ రోడ్ల నిర్మాణ పనులకు, ఖమ్మం రూరల్ మండలంలోని గుర్రాలపాడు–కోట నారాయణపురం రోడ్డు నుంచి ఆబౌండ్షిప్ వరకు రూ.2.70 కోట్లతో నిర్మించనున్న రహదారి పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఆశించిన స్థాయిలో లేకపోయినా పేదల సంక్షేమం, మౌలిక సదుపాయాల కల్పనలో వెనుకడుగు వేయడం లేదని, ప్రభుత్వ కార్యక్రమాలను జీర్ణించుకోలేకే ప్రతిపక్షాలు విషప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు.

కృష్ణా, గోదావరి జలాల అంశంపై మాట్లాడుతూ, కృష్ణాలో తెలంగాణకు 570 టీఎంసీలు రావాల్సి ఉండగా గత పాలకులు 299 టీఎంసీలకే అంగీకరించారని విమర్శించారు. నాగార్జునసాగర్ నుంచి పల్నాడుకు నీటి తరలింపు జీవో, పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంపు సమయంలో గత ప్రభుత్వం ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. తుమ్మిడిహెట్టి వద్ద 148 మీటర్ల ఎత్తుకే ఒప్పందాలు చేసుకోవడం వల్ల గ్రావిటీ ద్వారా గోదావరి జలాలను వాడుకునే అవకాశాన్ని కోల్పోయామని అన్నారు. పాత ఒప్పందాల పునఃపరిశీలన కోసం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కేంద్రం, మహారాష్ట్రతో చర్చలు జరుపుతున్నారని, తెలంగాణ నీటి వాటాను ఎట్టి పరిస్థితుల్లోనూ తాకట్టు పెట్టబోమని స్పష్టం చేశారు.

జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. మాట్లాడుతూ గత 45 రోజుల్లో ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలో సుమారు రూ.40 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశామని, పనులను నిర్ణీత గడువులోగా నాణ్యతతో పూర్తి చేస్తామని తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల మంజూరులో ఎల్-3 నుంచి ఎల్-1 సమస్యలను మార్గదర్శకాల ప్రకారం త్వరలోనే పరిష్కరిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమాల్లో ఆర్డీవో ఎన్. శ్రీనివాస్, హౌసింగ్ పీడీ భూక్యా శ్రీనివాస్, మున్సిపల్ చైర్‌పర్సన్ పోకబత్తిని అనిత, కమిషనర్ ఏ. శ్రీనివాసరెడ్డి, ఇతర అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.