Mahaa Daily Exclusive

  పంచాయతీ ఎన్నికలకు 46,080 మంది పోలీసులతో బందోబస్తు!

Share

  •  తొలి విడతతోపాటు మలి విడత ఎన్నికలకూ పటిష్ట భద్రత.
  •  విజయోత్సవ ర్యాలీలపై నిషేధం.
  •  డీజీపీ హరీష్‌ కుమార్‌ గుప్తా.

అమరావతి, మహా:

ఆంధ్రప్రదేశ్‌లో జరగనున్న తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలతోపాటు మలి విడత స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు డీజీపీ హరీష్‌ కుమార్‌ గుప్తా వెల్లడించారు. ప్రశాంతమైన, స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్రవ్యాప్తంగా 46,080 మంది పోలీసులతో భద్రతా ఏర్పాట్లు చేపడుతున్నట్లు తెలిపారు. మంగళవారం అమరావతిలో ఆయన మాట్లాడుతూ.. సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయడంతోపాటు అవసరమైన చోట అదనపు బలగాలను మోహరిస్తామని చెప్పారు.

ఓటర్లు ఎలాంటి భయం, ఒత్తిళ్లకు గురికాకుండా స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని డీజీపీ సూచించారు. ఎన్నికల సమయంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు పాల్పడితే కఠినంగా వ్యవహరిస్తామని స్పష్టం చేశారు. ఎన్నికల అనంతరం విజయోత్సవ ర్యాలీలపై నిషేధం విధించినట్లు ప్రకటించారు.

రాష్ట్రంలో మూడు విడతలుగా నవంబర్‌ 26, 29, డిసెంబర్‌ 2 తేదీల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం 123 స్థానిక సంస్థల్లో గతంలో 100 స్థానిక సంస్థలకు తొలి దశలోనే ఎన్నికలు నిర్వహించారు. మిగిలిన 23 స్థానిక సంస్థలకు సంబంధించి న్యాయస్థానాల్లో కేసులు పెండింగ్‌లో ఉండటంతో ఎన్నికలు వాయిదా పడ్డాయి. ఇటీవల ఆ కేసులు పరిష్కారం కావడంతో ఆయా స్థానిక సంస్థలకు నవంబర్‌ 26న పోలింగ్‌ నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ఎన్నికలకు సంబంధించిన ప్రచారం మంగళవారం సాయంత్రం 5 గంటలకు ముగిసింది. పోలింగ్‌ ప్రశాంతంగా జరిగేలా పోలీసు యంత్రాంగం ముందస్తు భద్రతా చర్యలు చేపట్టింది.