తిరుపతి, మహా
తెలుగు ప్రజలంతా కలియుగ ప్రత్యక్ష దైవంగా కొలిచే తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం.. త్వరలోనే సిద్దిపేట లో కొలువు దీరనుందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు తెలిపారు. మంగళవారం తిరుపతి వెళ్లిన హరీశ్ రావు టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడిని కలిశారు. సిద్దిపేట పట్టణంలోని కోమటి చెరువు ప్రాంతంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర దేవాలయ నిర్మాణం చేపట్టాలని కోరారు. వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణం కోసం కోమటి చెరువు ప్రాంతంలో ఇప్పటికే.. 5 ఎకరాల 10 గుంటల స్థలాన్ని మంజూరు చేశామని టీటీడీ ఛైర్మన్‌తో హరీశ్‌రావు తెలిపారు.
గతంలోనే టీటీడీకి చెందిన ఇంజనీరింగ్ అధికారులు కోమటి చెరువు ప్రాంతంలో పర్యటించి ఆలయ నిర్మాణానికి కేటాయించిన స్థలాన్ని పరిశీలించారని బీఆర్ నాయుడికి తెలిపారు. అందులు అనుగుణంగానే ఆలయ నిర్మాణ నమునా, డిజైన్లను కూడా రూపొందించారని వివరించారు. తిరుపతి వెంకటేశ్వర స్వామిని తెలుగు ప్రజలంతా ఎంతో ఇష్టంగా కొలుస్తారని.. ఇలవేల్పుగా భావిస్తారని తెలిపారు. అలాంటి శ్రీవారి ఆలయం సిద్దిపేటలో నిర్మించడం గొప్ప అదృష్టమని హరీశ్‌రావు చెప్పుకొచ్చారు.