- – బీసీలకు మీ నాయకత్వం అవసరం లేదు
- రిజర్వేషన్లు సాధించుకునే సత్తా మాకు ఉంది
- ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
హైదరాబాద్, మహా: బీసీలపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కపట ప్రేమ చూపిస్తున్నారని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ వ్యాఖ్యానించారు. బీసీ రిజర్వేషన్లపై హడావుడీ చేస్తున్న కవితకు బీసీలతో ఏం సంబంధమని ప్రశ్నించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కవితపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీలపై కవిత మొసలి కన్నీరు కారుస్తున్నారన్నారు. బీసీల రిజర్వేషన్ల గురించి మాట్లాడే కవిత ఇప్పుడు మాట్లాడుతున్నారు కానీ, బీఆర్ఎస్ హయాంలో ఎందుకు పట్టించుకోలేదని ప్రశ్నించారు. గిరిజనులు, మైనార్టీలకు 12 శాతం రిజర్వేషన్లు ఇస్తామంటూ కేసీఆర్ ప్రకటించినప్పుడు కవిత ఎందుకు బీసీల గురించి ప్రస్తావించలేదన్నారు. బీసీల అభివృద్ధి కోసం ఎందుకు చర్యలు తీసుకోలేదన్నారు. బీసీల గురించి ఆమె పోరాడాల్సిన అవసరం ఏముందని, బీసీలు తమ హక్కులు, రిజర్వేషన్ల కోసం పోరాడే పటిమ బీసీ నాయకులకు ఉందని తేల్చి చెప్పారు. బీసీ సహా రాష్ట్రంలో అన్ని కార్పొరేషన్లను బీఆర్ఎస్ హయాంలో నిర్వీర్యం అయ్యాయన్నారు. ఎన్నికల సమయంలో బీసీల ఓట్ల బీసీ బంధు అంటూ డ్రామా ఆడారన్నారు.
బీసీల లెక్కలు తేల్చేందుకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సూచనలతో సీఎం రేవంత్ రెడ్డి కులగణన చేపట్టారన్నారు. కులగణనతో దేశానికి తెలంగాణ రోల్ మోడల్ గా మారిందన్నారు. సర్వేలో బీఆర్ఎస్ నాయకులు ఎందుకు పాల్గొనలేదని నిలదీశారు. బీసీల కోసం వచ్చే నెల 3న ధర్నా చేస్తామంటున్న కవిత నాయకత్వం బీసీలకు అవసరంలేదన్నారు. తమ సమస్యలు తాము పరిష్కరించుకునే శక్తి తమ బీసీలకు ఉందన్నారు. కుల గణన లెక్కలు తేలిన తరువాత సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో బీసీలకు చేయాల్సిన న్యాయం చేస్తామని ఆయన అన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించే విషయమై కసరత్తు జరుగుతుందన్నారు. కవిత కేవలం లిక్కర్ కేసు నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే బీసీ ఉద్యమాలతో నాటకాలు వేస్తున్నారన్నారు. గతంలో కూడా ఆమె వచ్చాకే బతుకమ్మ వచ్చినట్లుగా ప్రజలను మభ్యపెట్టిన సంగతిని మరువరాదన్నారు. కొంతమంది బీసీ నాయకులను పక్కన పెట్టుకుని బీసీ జపం చేసినంత మాత్రాన కవితను బీసీలు నమ్మరన్నారు. కవిత నాయకత్వంలో బీసీ ఉద్యమాల్లో ఏ బీసీలు పాల్గొనబోరన్నారు.








