Mahaa Daily Exclusive

  శాంతి సౌభ్రాతృత్వం పెంపొందించేవే పండుగలు జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ ఛైర్మన్ సత్తు వెంకటరమణారెడ్డి

Share

ప్రజల మధ్యన ప్రేమ, శాంతి, సౌభ్రాతృత్వం పెంపొందించడానికి పండుగలు దోహదం చేస్తాయని జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ ఛైర్మన్ సత్తు వెంకటరమణారెడ్డి అన్నారు. ఇబ్రహీంపట్నం మండలం తులేకలాన్ గ్రామంలో మదార్ సావుల దర్గా పునరుద్ధరణ చేసి ఐదేండ్లు పూర్తయిన సందర్భంగా ఉర్సు ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ముక్కోటి ఏకాదశి సందర్భంగా భక్తాంజనేయ దేవాలయంలో ఉత్తర ద్వార దర్శనం అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ధర్గా ఉర్సు ఉత్సవాలు, ముక్కోటి ఏకాదశి వేడుకలు ఒకేరోజు గ్రామస్థులంతా కలిసి వైభవంగా నిర్వహించడంతో గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా ముఖ్యఅతిథిగా హాజరైన వెంకట రమణారెడ్డి మాట్లాడుతూ గ్రామంలో అందరూ కలిసి మెలిసి గుడి, ధర్గా, చర్చి నిర్మించుకొని మంచి వాతావరణాన్ని తయారుచేసి ఆదర్శంగా నిలిచారని కొనియాడారు. గతంలో రాజకీయ కక్షలతో అట్టుడికిన గ్రామం నేడు సామరస్యానికి ప్రతీకగా నిలిచి, అభివృద్ధిలో అగ్రగామిగా ఎదిగిందని చెప్పారు. గ్రామం నుండి ఉన్నత స్థాయికి ఎదిగిన ఇంటలిజెన్స్ డీజీపీ బత్తుల శివధర్ రెడ్డి ఆదర్శంగా యువత అభివృద్ధిలో పాలుపంచుకుంటున్నారని అన్నారు. గ్రామంలో వందల సంవత్సరాల చరిత్ర కలిగిన భక్తాంజనేయ దేవాలయం, పోచమ్మ గుడి, మదార్ సావుల ధర్గాలను పునర్నిర్మాణం చేసుకోవడమేగాక, నూతనంగా శివాలయం, చర్చిల నిర్మాణం కూడా జరిగిందని ఆయన వివరించారు. వీటితో పాటు రోడ్లు, ట్యాంకులు, డ్రైనేజీలు, పచ్చదనం , స్మశాన వాటికల నిర్మాణాలు తదితర అభివృద్ధి పనులు పూర్తయినట్లు చెప్పారు. ఎన్నికలప్పుడు మాత్రమే రాజకీయలు, మిగతా సమయాల్లో అభివృద్ధి అనే మంత్రం యువతకు బోదపడితే గ్రామాల్లో అభివృద్ధి మరింత వేగవంతం అవుతుందని అన్నారు. గ్రామంలో ఊరేగింపు నిర్వహించిన అనంతరం ధర్గా కమిటీ ఆధ్వర్యంలో పెద్దఎత్తున అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల బీఆర్ఎస్ అధ్యక్షుడు చిలుకల బుగ్గరాములు, మాజీ సర్పంచులు యాదగిరి, బీరప్ప, జయమ్మ, మాజీ ఎంపిటిసిలు నాగటి నాగమణి, బండ ఎంకమ్మ , సొసైటీ వైస్ చైర్మన్ సామ రవీందర్ రెడ్డి, ఉపసర్పంచ్ బాసాని రాజిరెడ్డి, పోలీస్ రామచంద్రా రెడ్డి, యెర్నాగి రవీందర్, గుజ్జ యాదగిరి, కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు.