ఎంఎన్‌ఎస్ అధ్యక్షుడు రాజ్ థాక్రే తనకు అత్యంత సన్నిహుతుడని, శివసేన (యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ థాక్రే తనకు శత్రువు కాదు.. మిత్రుడని మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ తాజాగా పేర్కొన్నారు. రాష్ట్ర రాజకీయాల్లో కీలకమైన ఠాక్రేలతో బీజేపీ సంబంధం గురించి శనివారం ఆయన మాట్లాడారు. గతంలో ఉద్ధవ్ థాక్రే హితుడు. ఇప్పుడు రాజ్ థాక్రే ఒక స్నేహితుడు. కానీ ఉద్ధవ్ థాక్రే శత్రువు కాదు అంటూ ఆయన పేర్కొన్నారు. అదేవిధంగా, ఇటీవలే జరిగిన అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఉద్ధవ్ థాక్రేను కలసినదానిపై కూడా ఆయన వివరణ ఇచ్చారు. ప్రతీకార రాజకీయాలకు తాను ఎప్పుడూ పాల్పడబోనని అన్నారు. నాయకులందరితోనూ సానుకూలంగా వ్యవహరిస్తానని ఆయన పేర్కొన్నారు. ఇదిలా ఉంటే… ఎన్సీపీ (ఎస్పీ) అధినేత శరద్ పవార్ కూడా ఇటీవల ఆర్‌ఎస్‌ఎస్‌ను ప్రశంసించిన అంశంపై కూడా ఫడ్నవీస్ స్పందించారు. శరద్ పవార్ అత్యంత తెలివైనవారని ప్రశంసించారు. శరద్ పవార్, అజిత్ పవార్ తిరిగి కలుస్తారన్న ఊహాగానాలపై కూడా ఆయన స్పందించారు. రాజకీయాల్లో ఏదైనా జరగొచ్చు అంటూ ఆయన పేర్కొన్నారు.







