Mahaa Daily Exclusive

  బొగ్గు గని నుంచి మరో 3 మృతదేహాలు వెలికితీత…!

Share

వరదలు ముంచెత్తిన అస్సాంలోని బొగ్గు గని వద్ద రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. అందులో నుంచి మరో మూడు మృతదేహాలను వెలికితీశారు. దీంతో ఆ బొగ్గు గనిలో చిక్కుకున్న కార్మికుల్లో మరణించిన వారి సంఖ్య నాలుగుకు చేరింది. కాగా, జనవరి 6న దిమా హసావో జిల్లా ఉమ్రాంగ్సోలోని బొగ్గు గనిలోకి అకస్మాత్తుగా వరద నీరు వచ్చి చేరింది. అస్సాం-మేఘాలయ సరిహద్దు సమీపంలోని పాడుబడిన 340 అడుగుల లోతైన ఈ గనిలో 9 మంది కార్మికులు చిక్కుకున్నారు. వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. గత ఆరు రోజుల నుంచి రెస్క్యూ బృందం, ఆర్మీ డైవర్లు కలిసి వారిని రక్షించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. శనివారం ఉదయం తొలుత ఒక మృతదేహాన్ని వెలికితీశారు. కలమతి గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. ఆ తరువాత మరో రెండు మృతదేహాలను ఆ గనిలో నుంచి బయటకు తీశారు. దీంతో బొగ్గు గనిలో చిక్కుకున్న 9 మంది కార్మికుల్లో ఇప్పటి వరకు నలుగురు మృతిచెందారు. మరో ఐదుగురు కార్మికుల కోసం రెస్క్యూ ఆపరేషన్‌ కొనసాగుతోంది. నీటిని తోడితేగానీ పూర్తిస్థాయిలో సహాయక చర్యలు సాధ్యం కావని అధికారులు చెబుతున్నారు. 12 ఏళ్ల కిందట వదిలేసిన ఈ బొగ్గు గనిలో అక్రమ తవ్వకాలకు సంబంధించి ఇద్దరు వ్యక్తులను స్థానిక పోలీసులు అరెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే.

Latest