గత కొద్ది రోజుల నుంచి టీమిండియా క్రికెటర్ యుజ్వేంద్ర చహల్ తన భార్య ధనశ్రీతో విడిపోతున్నట్లుగా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ విషయమై సోషల్ మీడియా కోడై కూస్తోంది. అంతేకాదు.. ప్రస్తుతం ఈ క్రికెటర్ ఓ ఆర్‌జే ప్రేమలో మునిగితేలుతున్నట్లుగా కూడా వార్తలు వచ్చాయి. ఆర్‌జే మహ్వాష్‌తో పార్టీ చేసుకుంటున్న ఫొటోలు బయటకు రావడంతో వారిద్దరూ డేటింగ్‌లో ఉన్నారంటూ నెటిజన్స్ చర్చించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో, ఆర్‌జే మహ్వాష్ స్పందించింది. ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదని పేర్కొంది. ఈ మేరకు ఆమె సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది. కొన్ని కథనాలు, ఊహాగానాలు ఇంటర్నెట్‌లో వ్యాపిస్తున్నాయని.. అవన్నీ కూడా ఊహాజనిత వార్తలని.. వాటిని చూస్తుంటే తనకు ఫన్నీగా ఉందంటూ అందులో పేర్కొంది. ఏ ఇద్దరు కలిసి కనిపిస్తే డేటింగ్ చేస్తున్నట్లేనా..? ప్రస్తుతం మనమంతా ఏ సంవత్సరంలో ఉన్నాం..? అంటూ ప్రశ్నించింది. ఓ అమ్మాయి, అబ్బాయి కనిపిస్తే డేటింగ్ ఊహాగానాలు ఎందుకు దారి తీస్తున్నాయన్నయంటూ ఆమె అసంతృప్తిని వ్యక్తం చేసింది. కాగా, ఈ విషయమై గత రెండు మూడు రోజులుగా తాను ఓపికతో ఉన్నానని, ఇకముందు తనను అనవసరంగా బ్లేమ్ చేస్తే ఊరుకునేది లేదంటూ ఆమె హెచ్చరించారు.
ఇదిలా ఉండగా.. ఇటీవల యుజ్వేంద్ర చహల్, ధనశ్రీ జంట తమ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్లలో ఒకరికొకరు అన్ ఫాలో అయ్యారు. ఇద్దరి ఫొటోలను తొలగించారు. ఈ క్రమంలో ఆ ఇద్దరు విడిపోతున్నట్లుగా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. విడాకులపై చహల్ స్పందించాడు. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం తన దృష్టికి వచ్చిందని.. అయితే అవి నిజం కావచ్చు, కాకపోవచ్చునని.. ఇలాంటి ఊహానాలను పట్టించుకోవద్దని.. అభిమానులకు ఇదే నా రిక్వెస్ట్ అంటూ చహల్ ఆ పోస్ట్ లో పేర్కొన్న విషయం తెలిసిందే. అంతకుముందు ధనశ్రీ కూడా స్పందిస్తూ విడాకులపై వస్తున్న వార్తలతో తాను మానసిక వేదనకు గురవుతున్నానని.. నిజానిజాలు తెలుసుకోకుండా అసత్యాలు ప్రచారం చేస్తున్నారంటూ ఆమె వాపోయిన విషయం తెలిసిందే.







