ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులో ఎలాంటి తారతమ్యాలు లేకుండా అర్హులైన ప్రతిఒక్క పేద వారికి లబ్ధిచేకూరే విధంగా లబ్ధిదారుల ఎంపిక జరగాలని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మరియు జిల్లా ఇన్చార్జి మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు అన్నారు. శనివారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ భవనంలోని సమావేశం మందిరంలో
రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇండ్ల వంటి సంక్షేమ పథకాల అమలుపై ఏర్పాటు చేసిన ఉమ్మడి రంగారెడ్డి జిల్లా అవగాహన సదస్సులో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ప్రాతినిధ్యం వహిస్తున్న శాసన సభ్యులు, పార్లమెంటు సభ్యుల సూచనలను, అభిప్రాయాలను అధికారులు పరిగణలోకి తీసుకోవాలన్నారు. జనవరి 26 గణతంత్ర దినోత్సవం నుంచి అమలు చేసే రైతు భరోసా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్ల పథకాలను ఎంపిక చేయుటలో ప్రణాళిక బద్ధకంగా అమలు చేయాలన్నారు. ఈ నాలుగు పథకాల అమలుపై గ్రామస్థాయిలో మున్సిపల్ స్థాయిలో గ్రామసభలు నిర్వహించి లబ్ధిదారుల ఎంపికకు సంబంధించి లిస్టులను వార్డు వద్ద ఉండే విధంగా చూడాలన్నారు. ఈ సమావేశంలో చేవెళ్ల పార్లమెంటు సభ్యులు కొండా విశ్వేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్సీ బొగారపు దయానంద్, శాసన సభ్యులు మల్ రెడ్డి రంగారెడ్డి, కాలే యాదయ్య, అరికె పూడి గాంధీ, ప్రకాష్ గౌడ్, వీర్లపల్లి శంకర్, ఫ్లాగ్ షిప్ ప్రాజెక్ట్స్ కమీషనర్ కె.శశంక, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ గౌతమ్ పొట్రు, వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ ప్రతిమా సింగ్, మేడ్చల్ జిల్లా అదనపు కలెక్టర్ విజేందర్ రెడ్డి, వికారాబాద్ జిల్లా అదనపు కలెక్టర్ లింగ్యా నాయక్, మూడు జిల్లాల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.







