పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో ఆదివాసీలకు ఒరిగిందేమీలేదని, మాయమాటలతో మభ్యపెట్టి మోసగించారని, ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని మాజీ ఎంపీ సోయం బాపురావు ధ్వజమెత్తారు. కానీ, సీఎం రేవంత్‌రెడ్డి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదివాసీ గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారంపై సానుకూలంగా స్పందించడం హర్షణీయమన్నారు. కంది శ్రీనివాసరెడ్డి క్యాంపు కార్యాలయం ప్రజాసేవా భవన్‌లో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి, ప్రభుత్వానికి ఆదివాసీ సమాజం తరపున ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఎన్నో ఏండ్లుగా ఆదివాసులు తమ హక్కుల కోసం, సమస్యల పరిష్కారం కోసం సుధీర్ఘమైన పోరాటం, ఉద్యమం చేస్తున్నారని అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఏనాడు ఏ ప్రభుత్వం, ఏ ముఖ్యమంత్రి పట్టించుకున్న పాపానపోలేదన్నారు. మొదటిసారిగా సీఎం రేవంత్‌రెడ్డి ఆదివాసీ సంఘాల ప్రతినిధులు, ఆదివాసీ పెద్దలతో సమావేశమై అభిప్రాయాలు సేకరించడం, అనేక సమస్యలపై చర్చించడం నిజంగా అభినందనీయమని అన్నారు. ఆదివాసీలను అన్నిరంగాల్లో అభివృద్ధిపరచాలనే ఆలోచనతో కంకణం కట్టుకుని ఆ దిశగా చర్యలు తీసుకుంటామని చెప్పడం సంతోషకరమన్నారు. గత ప్రభుత్వం అనేక మాయమాటలు చెప్పి ఏ ఒక్క ఆదివాసీకి న్యాయం చేయలేదని విమర్శించారు. మళ్లీ ప్రతిపక్ష హోదాలోనూ బీఆర్ఎస్ అదే విధానాన్ని అవలంభిస్తోందని మండిపడ్డారు. ఆనాడు సమస్యలపై పోరాటం చేసిన ఉద్యమ నాయకులపై ఎన్నో కేసులు పెట్టారన్నారు. ఆదివాసీల ఉసురుతగిలే రాష్ట్రంలో బీఆర్ఎస్ అధికారం కోల్పోయిందన్నారు. నాటి నుండి నేటి వరరకు ఆదివాసులు విద్య, ఉద్యోగావకాశాలు, రోడ్లు, రవాణా, సాగు, తాగునీటి వంటి పలు సమస్యలు ఎదుర్కొంటున్నారన్నారు. ఆదివాసీ రాయి సెంటర్లకు భవనాలు లేక సమావేశాలు పెట్టుకోవడానికి ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు. అలాగే వ్యవసాయ భూములు ఉన్నప్పటికీ బోర్లు లేక సాగునీరందని పరిస్థితి ఉందన్నారు. వీటిన్నింటిపై కులంకశంగా చర్చించిన సీఎం రేవంత్‌రెడ్డి వాటి పరిష్కారంపై సానుకూలంగా స్పందించారన్నారు. అంతేకాకుండా ఉద్యమాల్లో ఆదివాసీలపై పెట్టిన కేసులను తొలగించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారన్నారు. కొమురంభీం వర్ధంతి, జయంతిలను అధికారికంగా జరుపుకోవాలని నిర్ణయించడాన్ని స్వాగతిస్తున్నామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆదివాసీల పట్ల సానుకూల ధోరణితో ఉందని తెలిపారు. సీఎంగా రేవంత్‌రెడ్డి ఒక గొప్ప నాయకుడని, ఆయన తెలంగాణ ముఖ్యమంత్రిగా దొరకడం అదృష్ట్యంగా భావిస్తున్నామని తెలియజేశారు. ఈ మీడియా సమావేశంలో మాజీ జడ్పీటీసీలు గోక గణేష్ రెడ్డి, బొల్లారం బాబన్న, నాయకులు లోక ప్రవీణ్ రెడ్డి, మహిళా నాయకురాలు శ్రీలేఖ ఆదివాసీ, నాయకులు పెందూర్ మోహన్, తానాజీ, సోయం అవినాష్, సోము, అల్చెట్టి నాగన్న, దాసరి ఆశన్న, రతన్, దీపక్ రావు, మహమూద్, సోమా ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.







