ఎన్నికల సమయంలో ఇంటింటికీ తాయిలాలు పంపటం పరిపాటి. ఒటర్లను ఆకర్షించేందుకు ఇళ్ల వద్దకే వారికి కావాల్సిన నిత్యావసరాలను పంపడమూ మామూలే. అయితే సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రతి ఇంటికీ క్యారేజీ పంపారో బీఆర్ఎస్ నేత. కనుమ పండుగ సందర్భంగా ప్రతి ఇంటికీ స్టీల్ బాక్స్ పంపించారు. స్టీల్ బాక్స్ లో మటన్ పెట్టి ఇంటింటికీ పంపిణీ చేశారు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. కొండాపూర్ మండలం గుంతపల్లి గ్రామానికి బీఆర్ఎస్ యూత్ లీడర్ పడమటి అనంతరెడ్డి తాజాగా కనుమ పండుగను పురస్కరించుకుని గ్రామంలో సుమారుగా 440 కుటుంబాలు ఉండగా, దాదాపు 400 కుటుంబాలకు మాంసం పంపిణీ చేశారు. మిగతా కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. గతంలోనూ కొవిడ్ వచ్చిన సమయంలో అనంతరెడ్డి ఇలాగే స్పందించారు. లాక్ డౌన్ సమయంలో ప్రజలు నిత్యావసరాల కోసం ఇబ్బందులు పడుతున్న సందర్భంలో నిత్యావసరాలను, సరుకులు ఇంటి వద్దకే పంపిణీ చేసి మంచి పేరు తెచ్చుకున్నారు.








