నిజం నిప్పులాంటిదైతే ఆ నిప్పును కప్పేసిన నివురే అధికారం ధరించిన పవరు. అధికారానికి మాయ చెయ్యడం తెలుసు. మత్తులో ముంచడం తెలుసు. పదేళ్ళ అధికారంలో కారుపార్టీ తప్పిదాలపై ఒక్కో విచారణ, వాటి వెనుక కేసులు పడుతున్నాయి. తప్పో ఒప్పో రాజకీయమో.. రాజ్యతంత్రమో. నీకు ఈడి కేసుంది.. నాకు ఈడి కేసుంది. నీకు ఎసిబి ఉంది. నాకు ఎసిబి ఉంది. కేసులు సేమ్, దర్యాప్తు సంస్థల క్వశ్చన్ పేపర్ సేమ్ అని కేసులు ఎదుర్కొంటున్న మాజీ మంత్రి చేస్తున్న ప్రకటనలు విచారణ ఎదుర్కొంటున్నట్లుగా లేవు. విచారణ చేసి వస్తున్నట్లుగా ఉన్నాయన్న మాటలు వినబడుతున్నవి. మారిన సీఎం రేవంత్, మారని కేసీఆర్ భవిష్యత్ వ్యూహాలు కాచివడపోస్తున్నారు. కేటీఆర్ దూకుడు, కేటీఆర్ స్ఫూర్తిగా పాడి కౌశిక్ రెడ్డి లాంటి ఎమ్మెల్యేల దూకుడు బిఆర్ఎస్ పార్టీకి ఏమేరకు ప్రయోజనాలు కలిగిస్తాయో ముందుముందు తెలుస్తుంది.
తాజా రాజకీయ పరిణామాలపై ఎఎన్ఎన్ సిఈవో, జర్నలిస్ట్ కంది రామచంద్రారెడ్డి వీకెండ్ అనాలసిస్
……………….
ఫార్ములా ఈ-కారు రేసు కేసులో ఎ1గా ఉన్న కేటీఆర్ ఇప్పటికే ఎసిబి, తర్వాత ఈడి విచారణకు హాజరయ్యారు. ఈ రెండు విచారణల తర్వాత కేటీఆర్ బయటకు వచ్చి సుదీర్ఘ ప్రెస్ మీట్ లు పెట్టారు. విచారణ అంశాలన్నీ.. కూలంకషంగా చెప్పేశారు. అరపైసా అవినీతి జరగలేదని సమర్ధించుకున్నారు. అనేక సందర్భాలు.. అనేక మీడియా సమావేశాల్లో చెప్పారు. ఇపుడు విచారణ జరుగుతున్న సమయంలో విచారణను ప్రభావితం చేసేలా కాదు.. తానే ఎసిబిని ఫలానా ప్రశ్న అడిగానని, తానే ఈడిని ఇది అడిగానని చెబుతున్నారు. దీంతో అసలు విచారణ చేస్తున్నది కేటీఆరో, లేక ఏసీబీ, ఈడిలో అర్ధంకాని స్థితి నెలకొందని సోషల్ మీడియాలో గులాబీసైనికులే కామెంట్లు పెడుతున్నారు. రాజ్యాగబద్దంగా ఏర్పడిన దర్యాప్తుసంస్థల గౌరవం దెబ్బతినేలా ప్రభుత్వంలో కీలక బాధ్యతలు నిర్వర్తించిన వారు వ్యవహరించడం సరికాదు. కేటీఆర్ నిజాయితీపరుడు కావొచ్చు.. తప్పులేదని ఆయన భావించొచ్చు. నేరం నిరూపణ అయ్యేవరకు ఎవరైనా నిందితులే కానీ.. నేరస్థులు కాదు. కానీ విచారణ జరిగే సమయంలో ఇలాంటి ప్రవర్తన విచారణ సంస్థలను ప్రభావితం చేయడం కాదా? అన్నది ఆలోచించాలి. కేటీఆర్ రెండుసార్లు విచారణకు హాజరైన సమయంలోనూ.. ఎమ్మెల్యేలు, నేతలతో భారీ బలప్రదర్శనగా వచ్చారు. ఈడి విచారణకు హాజరయ్యే సమయంలో నేతలను అదుపు చేయడానికి పోలీసులు ఇబ్బందులు పడాల్సివస్తుంది. విచారణకు హాజరయ్యే సమయంలో ఇంత హైప్, హైటెన్షన్ ఏర్పరచడం వల్ల లాభమెవరికి? బిఆర్ఎస్ కోణంలోనే మాట్లాడాల్సి వస్తే ప్రభుత్వ వైఫల్యాలను దారి మళ్ళిస్తున్నది ఎవరు? ఇలాంటి హంగామా కాదా? అని ఆ పార్టీ ముఖ్యుల్లోనే చర్చ ఉంది.
నేను మారిపోయానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెబుతున్నారు. నడతలో.. మాటలో మార్పులు స్పష్టంగా కనబడుతున్నాయి. వివాదాలు విమర్శలకు, ఉద్వేగాలకు దూరంగా ఉంటూ పూర్తి సమయం పాలనకే వెచ్చిస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ ఏడాది జనవరి 1 నుండి మారిపోయానని పార్టీ ముఖ్యులకు, ఎమ్మెల్యేలకు స్పష్టమైన సంకేతాలిచ్చారు. తన పనితీరులోనూ ఆ మార్పును చూపిస్తున్నారు. ఈ ఏడాది ఇప్పటిదాకా కేసీఆర్ ను, కేటీఆర్ ను పరుషంగా దూషించలేదు. వీలైనంత వరకు వారి ప్రస్తావన లేకుండా పూర్తిగా పరిపాలన, ప్రజలకు అందాల్సిన సంక్షేమ కార్యక్రమాలపైనే ఫోకస్ పెట్టారు. ఈనెల 26 నుండి మూడు కీలక పథకాల అమలుకు లక్ష్యాన్ని పెట్టుకున్నారు. దశాబ్దకాలంగా ఎదురుచూస్తున్న రేషన్ కార్డుల జారీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ను ప్రకటించారు. ఈ మూడు పథకాలను రుణమాఫీ సమయంలో ఎదురైన ఆటంకాలు ఎదురుకాకుండా జాగ్రత్తగా పట్టాలెక్కించాల్సి ఉంది. ప్రభుత్వయంత్రాంగం కసరత్తు చేసి అర్హులైన ప్రతీ ఒక్కరికీ పథకం చేరేలా ప్రణాళిక రూపొందించుకుని ముందుకెళితేనే ప్రభుత్వానికి మైలేజీ వస్తుంది. ఇంకా రేషన్ కార్డులు ఇవ్వకముందే లబ్దిదారుల జాబితాలపై గ్రామాల్లో అలజడి మొదలైంది. ప్రభుత్వం ఎంతమందికైనా ఇచ్చేందుకు సిద్దంగా ఉన్నా.. ఇలాంటి చర్చలు జరగడం క్షేత్రస్ధాయి అధికారుల వైఫల్యమే. బ్రిజేష్ ట్రిబ్యునల్ ముందు బలమైన వాదనలు వినిపించి క్రిష్ణాజలాల్లో తెలంగాణ వాటాపై చర్చను సాధించడం పదేళ్ళతెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హయాంలో సాధించిన విజయం. క్రిష్ణాజలాల్లో తెలంగాణ, ఎపి మధ్య వాటాల వివాదాలు ఉండగా, గత ప్రభుత్వం వివాదాలు కొని తెచ్చుకోవడం తప్ప ఇలాంటి వాటాలు సాధించలేకపోయింది. కేసీఆర్ నీటిపారుదల రంగంపై ఎంతో శ్రద్ద పెట్టినట్లు కనిపించినా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా నీటివాటాల పరిస్థితి ఉండేది. ఇపుడు హంగూ, ఆర్భాటం లేకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నీటిపారుదల శాఖా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నీటిపారుదల రంగ నిపుణులతో చర్చించి.. బలమైన వాదనలతో బ్రిజేష్ ట్రిబ్యునల్ ను ఒప్పించారు. దీని ప్రభావం ఎంతలా ఉందంటే.. గతంలో నీటిపారుదల శాఖా మంత్రిగా పనిచేసిన హరీష్ రావు కూడా 13నెలల కాంగ్రెస్ పాలన తర్వాత కూడా ఇది కేసీఆర్ విజయమే అంటూ ప్రకటించుకునేంత పురోగతిని కాంగ్రెస్ ప్రభుత్వం సాధించింది.
మారనంటున్న కేసీఆర్
అధికారమైనా.. ప్రతిపక్షమైనా అదే దారి
మారని కోటరీ.. అదే థియరీ
అవిగో ఉప ఎన్నికలు అంటూ తరచూ ప్రకటనలివ్వడం, ఢిల్లీలో కేసులు వేసినట్లు, కేసులు వేస్తున్నట్లు మాట్లాడుతూ ప్రస్తుత బిఆర్ఎప్ ఎమ్మెల్యేలను, క్యాడర్ ను ఆశావహ పరిస్థితుల్లో ఉంచేందుకు బిఆర్ఎస్ నాయకత్వం ప్రయత్నిస్తోంది. భారీ ఓటమి తర్వాత కూడా గులాబీదళపతి కేసీఆర్ జిల్లాల వారీగా సమీక్షలు గానీ, వివిధ రంగాల నిపుణులను గానీ కలిసి సమీక్ష చేసేందుకు ఇష్టపడడం లేదు. ఓడగొడితే నా వ్యవసాయక్షేత్రంలో కూసొని రెస్ట్ తీసుకుంటా అని ప్రకటించిన కేసీఆర్ అదే పని చేస్తున్నాడని గులాబీ కార్యకర్తలు అంటున్నారు. దేశంలో ఏ రాజకీయనాయకుడూ ఇలా విలక్షణ వ్యవహారశైలి లేదు. ప్రజలకు దూరంగా ఉండి ప్రతిపక్ష పార్టీ రాజకీయం చేయగలదా? ప్రధానంగా ప్రతిపక్ష నేత ప్రజలకు దూరంగా ఉంటే ఆ పార్టీ భవిష్యత్తు అనేది ఖచ్చితంగా ఇబ్బందికరమే. పరిపాలనలో, రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవం ఉండవచ్చు. కానీ పడిపోయారు కదా.. పడగొట్టారు కదా. లేవాలంటే నమ్మకం కోల్పోయిన రంగాల్లో తిరిగి విశ్వాసం కల్పించాలి కదా అని ప్రజాస్వామిక వాదులు అంటున్న మాట. ప్రజలు ఎక్కడున్నారని తమ కోసం టార్చ్ లైట్ వేసుకుని వస్తారన్న ప్రకటనల ఆశల్లోనే అధినేత ఉన్నారా? లేక అప్రకటిత విరమణకు సిద్దపడ్డారా? ఏమైనా పాలకపక్షం, ప్రతిపక్షం కలగలిసి అంశాలపై పోరాటాలు, చర్చలు జరిగితేనే ప్రజాస్వామ్యస్ఫూర్తి కనిపిస్తుంది. ప్రజలకు మేలు కలుగుతుంది.
కాంగ్రెస్ లో దానం రాగంపై చర్చ సాగుతోంది. దానం ఆగమవుతారా? దానాన్నే ఆగం చేస్తారా? అన్న చర్చలు కాంగ్రెస్ పార్టీలు సాగుతున్నాయి. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఇటీవల కాలంలో చేసిన వ్యాఖ్యలు బూమరాంగ్ అయ్యాయి. అధిష్టానానికి జలక్ ఇవ్వాలనుకుని కేసీఆర్, కేటీఆర్ లపై పొగడ్తల జల్లు కురిపించారని, కానీ ఇపుడు ఉన్న కాంగ్రెస్ పార్టీలో పూర్వపు పాచికలు పనిచేయవని నేతలు గుర్తుచేస్తున్నారు. దానం నాగేందర్ మంత్రి పదవి కోరుకుంటున్నారని, ప్రాధాన్యం ఆశిస్తున్నారన్న ప్రచారాలున్నాయి. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టిన కేసుపై విరుద్ద ప్రకటన చేయడంపై ప్రభుత్వవర్గాలు ఆగ్రహంగా ఉన్నాయి. దీని ప్రభావం ఉప ఎన్నికకు దారితీసినా ఆశ్చర్యంలేదన్న చర్చ కాంగ్రెస్ వర్గాల్లో ఉంది. మొత్తంగా తెలంగాణ పాలిటిక్స్ లో రాజకీయం ఆసక్తికర మలుపులు తిరుగుతోంది. త్వరలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనుండగా, ఈ ఎంపిక కాంగ్రెస్ కు కత్తిమీద సామే. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరిగిన తొలి బైపోల్ కంటోన్మెంట్ లో కాంగ్రెస్ విజయం సాధించగా, త్వరలో మరిన్ని బైపోల్స్ జరిగే అవకాశాలు కనబడుతున్నాయి.








