రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ లేనటువంటి ఉమ్మడి మహబూబ్నగర్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాన్ని ప్రారంభించాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క హౌసింగ్ అధికారుల కు సూచించారు. శనివారం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో రెవిన్యూ, హౌసింగ్, సమాచార, పౌర సంబంధాల శాఖ ఉన్నతాధికారులతో 2025-26 సంవత్సర బడ్జెట్ ప్రతిపాదనల పై మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి లతో కలిసి సమీక్షించారు. ఈ సమావేశానికి ఫైనాన్స్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు, రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రెటరీ నవీన్ మిట్టల్, రెవిన్యూ సెక్రటరీ జ్యోతి బుద్ధ ప్రకాష్, హౌసింగ్ ఎండి గౌతమ్. ఐ అండ్పీఆర్ కమిషనర్ హరీష్ తదితరులు హాజరయ్యారు. ఈ క్రమంలో వారినుద్దేశించి డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఇండ్లు లేని పేదలకు కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ఇండ్లు నిర్మించి ఇవ్వడానికి ఈ ఏడు ప్రతి నియోజకవర్గంలో 3500 ఇండ్ల చొప్పున బడ్జెట్‌లో నిధులు కేటాయించిందన్నారు. ప్రభుత్వం అమలు చేసే ఆరు గ్యారంటీల అమలులో భాగమే ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణమని భట్టి విక్రమార్క అన్నారు. సమావేశంలో ఎంపీ చామల కిరణ్, ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ తదితరులు పాల్గొన్నారు.








