మహిళా రిజర్వేషన్ల అమలులో కేంద్రానికి చిత్తశుద్ధి లేదని జాతీయ మహిళా కాంగ్రెస్ అధ్యక్ష్యురాలు అల్కాలాంబా మండిపడ్డారు. వెంటనే అమలు చేయాల్సిందేనని ఆమె డిమాండ్ చేశారు. సొమవారం ఆమె గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడారు. మహిళల రక్షణ కోసం కేంద్రం చర్యలు తీసుకోవాలని కోరారు. మహిళా కాంగ్రెస్ సభ్యత్వంలో దేశంలోనే తెలంగాణ నం.1 అంటూ వెల్లడించారు. దేశంలో ఐదు లక్షల మంది మహిళా కాంగ్రెస్‌లో ఆన్‌లైన్ ద్వారా రిజిస్టర్ చేసుకున్నారని, అందులో తెలంగాణ నుంచే లక్షమంది ఉన్నారని చెప్పారు. ఇప్పటివరకూ లక్షా 4 వేల మంది తెలంగాణ మహిళా కాంగ్రెస్‌లో సభ్యత్వం తీసుకోవడంతో దేశంలోనే తెలంగాణ నంబర్ .1 గా ఉందని హర్షం వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో రేవంత్ పాలన భేష్..
తెలంగాణలో రేవంత్ పాలన అద్భుతంగా ఉందని ఆమె అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి సగం మహిళల పాత్ర కూడా ఉందని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వ ఆధ్వర్యంలో దేశంలో రూ. 500 సిలిండర్ కేవలం తెలంగాణలోనే లభిస్తుందన్నారు. తెలంగాణలో ఇప్పటికే మహిళలకు మూడు హామీలు నెరవేర్చామని వెల్లడించారు. త్వరలో నాలుగో హామీ కూడా ఇంప్లిమెంట్ చేస్తామని పేర్కొన్నారు. దేశంలో మహిళా పెట్రోల్ బంక్ ఎక్కడా లేదని, తెలంగాణలోనే మొదటిసారిగా మహిళా పెట్రోల్ బంక్ ఏర్పాటు అయిందని కొనియాడారు. కమిటీల్లో తెలంగాణలో ప్రతి పోలింగ్ కేంద్రంలో ముగ్గురు మహిళలను నియమించడానికి మహిళా కాంగ్రెస్ సిద్ధమవుతోందని తెలిపారు. నిన్న మహిళా కాంగ్రెస్ పూర్తిస్థాయిలో కార్యవర్గం ప్రకటించిందని, అందులో అన్ని జిల్లా అధ్యక్ష్యులు ఉన్నారని తెలిపారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున దేశవ్యాప్తంగా, తెలంగాణ నుంచి మహిళలను ఢిల్లీలో ప్రియాంక గాంధీ సత్కరిస్తారని చెప్పారు. ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్లో చిక్కుకున్న వారి క్షేమం కోసం మహిళా కాంగ్రెస్ ప్రార్థిస్తుందోని తెలిపారు. తెలంగాణలో మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో లక్ష సభ్యత్వం పూర్తి కావడంతో జాతీయ మహిళా కాంగ్రెస్ ద్వారా సీఎం రేవంత్ రెడ్డికి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, సునీతా రావు కి అల్కా లాంబా శుభాకాంక్షలు తెలిపారు.








