Mahaa Daily Exclusive

  ఉద్యోగ, ఉపాధ్యాయ పెన్షనర్లను రోడ్డున పడేస్తారా? సీఎం రేవంత్‌కు కిషన్‌రెడ్డి బహిరంగ లేఖ…!

Share

రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి బహిరంగ లేఖ రాశారు. కాంగ్రెస్ ప్రభుత్వం 14 నెలల పాలనపై కిషన్‌కెడ్డి లేఖ రాశారు. 14 నెలల మీ పాలన అసంతృప్తిగా ఉందని, డీఏలు, జీపీఎఫ్, పెండింగ్ బకాయిలు చెల్లించకుండా ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లను రోడ్డున పడేస్తారా? అని ప్రశ్నించారు. రిటైర్మెంట్‌ బెన్ ఫిట్స్ కూడా చెల్లించకుండా మానసిక క్షోభకు గురిచేయడం ఎంత వరకు న్యాయమని అన్నారు. ఉద్యోగులకు రోటీన్ గా చెల్లించాల్సిన బిల్లుల్లో కూడా సీలింగ్ పెట్టడం సిగ్గు చేటన్నారు. నిజాయితీగా పనిచేసే ఉద్యోగులకు మీరు ఏ సందేశం ఇస్తున్నట్లు? అని అన్నారు. కళాశాలల యాజమాన్యాలపట్ల మీ తీరు దుర్మార్గం, ఏళ్ల తరబడి ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు చెల్లించకుండా వేధిస్తున్నారని మండిపడ్డారు. ‘ఏప్రిల్, మే నెలలో బకాయిలు చెల్లిస్తామని కాలేజీ యాజమాన్యాలను మళ్లీ మభ్యపెట్టడం ఎంత వరకు కరెక్ట్?, ఎమ్మెల్సీ ఎన్నికల్లో గట్టెక్కేందుకు మళ్లీ మోసపూరిత హామీలకు సిద్ధమవడం సిగ్గు చేటు, నిరుద్యోగ భృతి ఆశ చూపి 14 నెలలుగా రూ.56 వేల బకాయిపడి యువతను దగా చేశారు. మీలో ఏమాత్రం నిజాయితీ ఉన్నా యుద్ద ప్రాతిపదికన బకాయిలు విడుదల చేయండి. ఈరోజే రూ.7500 కోట్ల ఫీజు రీయింబర్స్ మెంట్ సొమ్మును కాలేజీ యాజమాన్యాల ఖాతాల్లో జమ చేయండి’ అంటూ కిషన్‌రెడ్డి లేఖలో పేర్కొన్నారు.