సాధారణంగా, రైతుల సమస్యలు అధికార మేడల్లోని గదుల్లో, సమావేశాల్లో, దూరంగా గల పత్రాల ద్వారా మాత్రమే తెలుసుకుంటారు. కానీ, నిజమైన సమస్యలను అర్థం చేసుకోవాలంటే, రైతుల మధ్య నేరుగా వెళ్లి మాట్లాడాలి, వారి పొలాల్లో నడవాలి, మట్టిని తాకాలి. రైతు బతుకు మట్టి బతుకే. ఆయన ఆకాశంలో విహరించడు, ఆయన కష్టం పొలాల్లో కనిపించాలి. ఖమ్మం జిల్లా కలెక్టర్ ఈ నిజాన్ని అర్థం చేసుకున్నారు.
రైతుల సమస్యలను స్వయంగా అర్థం చేసుకోవాలనే తపనతో, కలెక్టర్ స్వయంగా పొలం గట్లపై నడుచుకుంటూ సాగునీటి లభ్యతను పరిశీలించారు. వ్యవసాయ భూములను ప్రత్యక్షంగా పరిశీలిస్తూ, సాగర్ జలాలు చివరి ఆయకట్టుకు చేరుతున్నాయా? అన్న ప్రశ్నకు ప్రత్యక్ష సమాధానం తెలుసుకునేందుకు ముందుకు వచ్చారు. మండుటెండను లెక్కచేయకుండా, మట్టిలోకి దిగి రైతులతో మమేకమయ్యారు. “మీరు ఏమంటున్నారు? సాగు పరిస్థితి ఎలా ఉంది? నీళ్లు అందుతున్నాయా? ఎరువుల కొరత ఉందా? మార్కెట్లో సరైన ధర వస్తోందా?” అంటూ ఒక్కొక్కరు దగ్గరకు వెళ్లి మాట్లాడారు.
ఇది కేవలం ఒక అధికారిక పర్యటన కాదు. ఇది రైతుల పట్ల చూపిన నిస్వార్థమైన మానవీయ కోణం. ఇది రైతుల గుండెల్లో నాటిన ఒక భరోసా. “రైతును అర్థం చేసుకోవాలంటే, మట్టి తాకాలి. ఆయన కష్టాన్ని నేరుగా చూడాలి” అనే తత్వాన్ని అవలంబించిన కలెక్టర్, నిజమైన ప్రజాసేవకుడిగా నిలిచారు.
సోమవారం జిల్లా కలెక్టర్ పెనుబల్లి మండలం టేకులపల్లి గ్రామంలో పర్యటించి వ్యవసాయ పొలాల వెంబడి రెండు కిలోమీటర్ల వరకు నడుస్తూ రైతులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా
రైతుల పంట పొలాలకు సాగు నీటి విడుదల సమయంలో చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ సాగు నీటి విడుదల షెడ్యూల్ ను సంబంధిత ఆయకట్టు రైతులకు ముందుగానే సమాచారం అందించాలని అధికారులకు తెలిపారు. టెయిల్ ఎండ్ విధానంలో సాగునీరు సరఫరా జరగాలని ముందుగా చివరి ఆయకట్టు ప్రాంతాలకు నీరు విడుదల కావాలని అన్నారు.
మండలంలో రైతులకు అవసరమైన మేర యూరియా నిలువలు అందుబాటులో ఉన్నాయని, ప్రతి సహకార సంఘం వద్ద యూరియా నిల్వలు ఉండాలని, ఎప్పటి కప్పుడు నిల్వలను పరిశీలిస్తూ స్టాక్ విషయమై పర్యవేక్షణ చేస్తున్నట్లు తెలిపారు.
గ్రామంలో పెద్ద రైతులతో ఇతర రైతులకు సాగు పద్ధతులు, వ్యవసాయ అధికారులతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలో అమలు అవుతున్న పథకాలపై రైతులకు అవగాహన కల్పించాలని అన్నారు. రైతులు లాభసాటి పంట సాగు చేయాలని అన్నారు. వ్యవసాయంతో పాటు పాడి పశువులు పెంచుకుంటే మనకు ఆదాయం లభిస్తుందని కలెక్టర్ సూచించారు.
రైతుల పిల్లలు ఎక్కడ చదువుతున్నారు, గ్రామంలో త్రాగునీటి సరఫరా, పాఠశాల, ఆసుపత్రి పనితీరు ఎలా ఉన్నది మొదలగు వివరాలను తెలుసుకున్నారు.
ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ ఎస్ఇ వాసంతి, వ్యవసాయ శాఖ ఏడి శ్రీనివాస రెడ్డి, పెనుబల్లి మండల తహసీల్దార్ జి. సుధీర్, ఎంపిడిఓ డి. అన్నపూర్ణ, మండల వ్యవసాయ అధికారి ప్రసాద్, శ్రీనివాస్, ఇర్రిగేషన్ ఏఇ ఖాదర్, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.







