Mahaa Daily Exclusive

  మమ్మల్ని అడిగి హామీలు ఇచ్చారా? – కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

Share

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మమ్మల్ని అడిగి హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారా? ప్రధానమంత్రి నరేంద్రమోదీ, బీజేపీ ప్రభుత్వం డబ్బులు ఇస్తేనే అభివృద్ధి పనులు చేస్తానని చెప్పాడా ? ప్రాజెక్టులకు రూపకల్పన చేశాడా? రాష్ట్రాలు ఇలా బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేయడం ఎంతవరకు సబబు అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఢిల్లీలో తన మంత్రిత్వ శాఖ గనులపై సమీక్ష నిర్వహించిన కిషన్ రెడ్డి ఆ తర్వాత తనను కలిసిన మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ, రేవంత్ రెడ్డి బుధవారం చేసిన వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు. లేనిది ఉన్నట్టుగా చెప్పడం సీఎం రేవంత్ రెడ్డికి అలవాటైందని దుయ్యబట్టారు. రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించి అనేక ప్రాజెక్టులను ఎప్పటికప్పుడు వివిధ విభాగాలతో మాట్లాడి, ఉత్తరాలు రాస్తూ అభివృద్ధి పనులు జరిగేలా చూస్తున్నాననని చెప్పారు. బెదిరింపు రాజకీయాలు చేస్తే ఎవరు భయపడేవారు లేరన్నారు. రేవంత్ రెడ్డి మాటలను నమ్మేవారు ఎవరూ లేరని, అసెంబ్లీ ఎన్నికల్లో రేవంత్ రెడ్డిని నమ్మిన వారే ఇపుడు ఆయన ఎలాంటి గాలి మాటలు మాట్లాడుతారో అర్థం చేసుకుంటున్నారన్నారు. నేనేం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ దయాదాక్షిణ్యాలతో పార్లమెంట్ లోకి రాలేదన్నారు. నేను తెలంగాణ ప్రజలకు మాత్రమే జవాబుదారిని, రేవంత్ మాటలకు నేను జవాబుదారి కాదన్నారు. రేవంత్ రెడ్డికి నిజంగా దమన్మూ, ధైర్యం ఉంటే నేను ఒక్క ప్రాజెక్టును అడ్డుకున్నట్టు నిరూపించాలని సవాలు చేశారు. చేతకాని ముఖ్యమంత్రి, దమ్ము లేని ముఖ్యమంత్రి, మాటలు చెప్పి చేతులు దులుపుకొనే ప్రయత్నం చేస్తున్నారని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రాజెక్టులకు రూపకల్పన చేస్తే ఎలాంటి ఆర్థిక ప్రణాళికతో చేస్తారో కూడా ఓ కార్యాచరణ లేదన్నారు. మెట్రో ప్రాజెక్టుకు సంబంధించి ఎలా డబ్బులు తెచుకుంటారో కూడా రేవంత్ రెడ్డికి స్పష్టత లేదన్నారు. ఇటీవలే మెట్రో ప్రాజెక్టు వివరాలను కేంద్రానికి పంపారు, అది అన్ని మినిస్ట్రీలకు సర్క్యులేట్ చేయాల్సి ఉంటుందన్నారు. ఏదో ఇలా పంపగానే అలా అయిపోదని, దానికో సిస్టం ఉంటుందన్నారు. ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఎలాంటి అవగాహన లేకుండా దుందుడుకుగా మాట్లాడుతున్నారని కిషన్ రెడ్డి విరుచుకు పడ్డారు.