సింధు జలాలు ఆపితే యుద్ధమే.
* భారత్‌కు పాక్ హెచ్చరిక.
* ఉగ్రవాదాన్ని ఆపకుంటే ఒప్పందం పునరుద్ధరించేది లేదని తేల్చిచెప్పిన భారత్.
• పహల్గామ్ దాడి నేపథ్యంలో నిలిచిపోయిన సింధు జలాల అమలు.
• పరిమిత హక్కులతో చీనాబ్, జీలం నదులపై ప్రాజెక్టులు నిర్మిస్తున్న న్యూఢిల్లీ.
ఢిల్లీ, మహా.
సింధు జలాల ఒప్పందం విషయంలో వెనక్కి తగ్గేదే లేదని భారత్ స్పష్టం చేసిన నేపథ్యంలో, పాకిస్థాన్ మరోసారి తన ఉగ్రరూపాన్ని, రెచ్చగొట్టే ధోరణిని బయటపెట్టుకుంది. భారత్ తీసుకుంటున్న చర్యలు తమ దేశ నీటి సరఫరాకు తీవ్ర ముప్పు కలిగిస్తున్నాయని, తమ నీటి హక్కుల రక్షణ కోసం అవసరమైతే భారత్‌పై యుద్ధానికి వెళ్లేందుకు కూడా సిద్ధంగా ఉన్నామంటూ పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవలి పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం భారత్ ఈ సింధు జలాల ఒప్పంద అమలును నిలిపివేసిన సంగతి తెలిసిందే. ఉగ్రవాదానికి పాక్ పూర్తిగా, నమ్మదగిన రీతిలో అడ్డుకట్ట వేయనంత వరకు ఈ ఒప్పందాన్ని పునరుద్ధరించే ప్రసక్తే లేదని భారత్ ఇదివరకే తేల్చిచెప్పింది. ఈ నేపథ్యంలో పాక్‌కు వచ్చే నీటి ప్రవాహాన్ని తగ్గించే లేదా అడ్డుకునే ప్రయత్నాలు జరిగితే, దాన్ని తాము జాతీయ భద్రతా సమస్యగా పరిగణిస్తామని ఖవాజా ఆసిఫ్ పేర్కొన్నారు.
పాకిస్థాన్ ఆర్థిక వ్యవస్థతో పాటు అక్కడి కోట్లాది మంది ప్రజల జీవనాధారం పూర్తిగా సింధు నదీ వ్యవస్థపైనే ఆధారపడి ఉందని పాక్ రక్షణ మంత్రి గుర్తుచేశారు. ఈ విపత్కర పరిస్థితుల్లో తమ దేశ నీటి హక్కులను కాపాడుకునేందుకు అన్ని మార్గాలనూ ఉపయోగిస్తామని, అవసరమైతే యుద్ధం వరకు వెళ్లడానికి కూడా వెనుకాడబోమని హెచ్చరించారు. కాగా, ఇరు దేశాల మధ్య సింధు జలాల ఒప్పందం 1960లో కుదిరింది. ఈ అంతర్జాతీయ ఒప్పందం ప్రకారం సింధు నదీ వ్యవస్థలోని ఆరు నదులను భారత్, పాకిస్థాన్‌లకు కేటాయించారు. ఇందులో రావి, బియాస్, సట్లెజ్ నదులపై భారత్‌కు పూర్తి హక్కులు ఉండగా.. సింధు, జీలం, చీనాబ్ నదులపై పాకిస్థాన్‌కు హక్కులు కల్పించారు. అయితే, పాకిస్థాన్‌కు కేటాయించిన ఆ మూడు నదులపై కూడా భారత్‌కు కొన్ని పరిమిత హక్కులు ఉన్నాయి. ఆ నదులపై భారత్ జలవిద్యుత్ ప్రాజెక్టులు నిర్మించుకోవచ్చు. అలాగే తాగునీరు, గృహ అవసరాలకు, పరిమిత స్థాయిలో సాగునీటికి కూడా ఆ నీటిని ఉపయోగించుకునే వెసులుబాటు ఉంది. అయితే నదుల సహజ ప్రవాహాన్ని పూర్తిగా అడ్డుకునే హక్కు మాత్రం భారత్‌కు లేదు.
కానీ, సరిహద్దుల్లో పాక్ ప్రేరేపిత ఉగ్రవాద ఘటనలు మితిమీరిపోవడంతో భారత్ తన పంథాను మార్చింది. ఉగ్రవాదానికి మద్దతు ఇస్తూ ఒప్పందాలు కొనసాగించడం సాధ్యం కాదని స్పష్టం చేస్తూ, ఇటీవలి కాలంలో చీనాబ్, జీలం నదులపై కొన్ని నూతన ప్రాజెక్టుల నిర్మాణాన్ని భారత్ చేపట్టింది. ఈ నిర్మాణాలపై పాకిస్థాన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. అయినప్పటికీ, ఉగ్రవాదంపై పాక్ వైఖరి మారనంత వరకు తాము వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని భారత్ స్పష్టం చేయడంతో పాక్ పాలకుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది.






