సామాన్యులకు ఇబ్బంది వద్దు.
* ఆగాల్సి వస్తే నేనే ఆగుతా!
* ప్రజల సౌకర్యానికే పెద్దపీట వేస్తున్న ప్రధాని మోదీ.
* నీట్ విద్యార్థుల కోసం దిల్లీ విమానాశ్రయంలోనే ప్రధాని నిరీక్షణ.
*గతంలో వారణాసి, చండీగఢ్ పర్యటనల్లోనూ ఇదే ఆదర్శం.
ఢిల్లీ, మహా.
దేశంలో వీఐపీల పర్యటనలంటే ముందుగా గుర్తొచ్చేది ట్రాఫిక్ ఆంక్షలు, సామాన్యుల అవస్థలు. కానీ, దేశ ప్రధాని నరేంద్ర మోదీ మాత్రం దశాబ్దాలుగా పాతుకుపోయిన వీఐపీ సంస్కృతికి స్వస్తి పలుకుతూ, సామాన్య ప్రజల సౌకర్యానికే పెద్దపీట వేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. తన కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల వల్ల సాధారణ పౌరులకు దైనందిన జీవితంలో ఎలాంటి అసౌకర్యం కలగకూడదనే ఉద్దేశంతో ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు సర్వత్రా ప్రశంసలు అందుకుంటున్నాయి. తాజాగా నీట్-యూజీ పరీక్ష రాసే లక్షలాది మంది విద్యార్థుల కోసం ఆయన తన ప్రయాణాన్ని కొద్దిసేపు ఆపుకుని విమానాశ్రయంలోనే వేచి ఉండటం ఆయన విధానాలకు సజీవ సాక్ష్యంగా నిలుస్తోంది. దేశవ్యాప్తంగా ఆదివారం నీట్-యూజీ పునఃపరీక్ష జరిగిన విషయం తెలిసిందే. పశ్చిమ బెంగాల్ పర్యటన ముగించుకుని కోల్‌కతా నుంచి దిల్లీ విమానాశ్రయానికి చేరుకున్న ప్రధాని మోదీ.. ఆ సమయంలో తన కాన్వాయ్ బయలుదేరితే పరీక్షా కేంద్రాలకు వెళ్లే విద్యార్థులకు ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తుతాయని భావించారు. ఎంతో ముఖ్యమైన కెరీర్ నిర్ణయాత్మక పరీక్షకు వెళ్తున్న విద్యార్థులు ట్రాఫిక్ లో చిక్కుకోకూడదనే సదుద్దేశంతో ప్రధాని మోదీ నేరుగా తన నివాసానికి వెళ్లకుండా, పరీక్ష ప్రారంభమై విద్యార్థులంతా కేంద్రాలకు చేరుకునే సమయం వరకు విమానాశ్రయంలోని లాంజ్‌లోనే ఉండిపోయారు.
ప్రధాని మోదీ ఇలా సామాన్యుల కోసం తన పర్యటనలను, కార్యక్రమాలను మార్చుకోవడం ఇదే తొలిసారి కాదు. కొన్నేళ్ల క్రితం ఆయన తన సొంత నియోజకవర్గం వారణాసిలో పర్యటించినప్పుడు సైతం ఇలాంటి ఆదర్శప్రాయమైన నిర్ణయమే తీసుకున్నారు. పగటిపూట తాను పర్యటిస్తే ప్రజలకు, ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలుగుతుందని భావించిన ప్రధాని.. అర్ధరాత్రి ఒంటి గంటకు నగరమంతా ప్రశాంతంగా నిద్రపోతున్న సమయంలో వారణాసి వీధుల్లో, రైల్వే స్టేషన్‌లో కలియతిరుగుతూ అభివృద్ధి పనులను స్వయంగా పర్యవేక్షించారు. తన భద్రతా సిబ్బంది వల్ల సామాన్యులకు ఎలాంటి అసౌకర్యం కలగకూడదన్నదే ఆయన ప్రధాన ఉద్దేశం.
గతంలో చండీగఢ్‌లో జరిగిన మరో ఘటన మోదీ ఆలోచనా విధానానికి అద్దం పడుతుంది. ఒక విశ్వవిద్యాలయ స్నాతకోత్సవంలో పాల్గొనేందుకు ప్రధాని అక్కడికి వెళ్లినప్పుడు, భద్రతా కారణాల దృష్ట్యా స్థానిక యంత్రాంగం పాఠశాలలకు సెలవు ప్రకటించింది. ఈ విషయం తెలుసుకున్న మోదీ అధికారుల తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. నా పర్యటన వల్ల పాఠశాలలకు సెలవు ప్రకటించారా? అని అధికారులను నిలదీశారు. ప్రధాని పర్యటన వల్ల విద్యార్థులు ఒక్కరోజు చదువు కూడా నష్టపోకూడదని అప్పటి హర్యానా గవర్నర్ కప్తాన్ సింగ్ సోలంకితో ఆయన స్పష్టం చేశారు. ఒక సామాన్య పౌరుడి రాకను ఎలా పరిగణిస్తారో, ప్రధాని పర్యటనను కూడా అలాగే చూడాలని అధికారులకు తేల్చిచెప్పారు. ఎవరైనా వేచి ఉండాల్సి వస్తే, అది నేనే కావాలి.. ప్రజలు కాదు అని ఆయన ఇచ్చిన స్పష్టమైన ఆదేశాలు వీఐపీ సంస్కృతిపై ఆయనకున్న వ్యతిరేకతను చాటిచెబుతున్నాయి. నేటి నీట్ విద్యార్థుల కోసం ఆయన చేసిన నిరీక్షణ కూడా.. చూడటానికి చిన్నదే అయినప్పటికీ అత్యంత శక్తిమంతమైన ప్రజాస్వామ్య సూత్రాన్ని, ‘ప్రజలే ప్రథమం’ అనే గొప్ప సందేశాన్ని యావత్ దేశానికి చాటిచెబుతోంది.








