ఎస్ఎల్బీసీ టన్నెల్లో మృతదేహాలు లభించాయనేది అవాస్తవన్న నాగర్ కర్నూల్ కలెక్టర్ సంతోష్ తప్పుడు వార్తలు ఎవరూ నమ్మొద్దని తెలిపారు. గల్లంతైనవారి కోసం గాలింపు చర్యలు జరుగుతున్నాయని, ఏదైనా సమాచారం ఉంటే తాము వెల్లడిస్తామని అన్నారు. శ్రీశైలం ఎడమ గట్టు కాలువ సొరంగం (ఎస్ఎల్బీసీ)లో చిక్కుకున్న వారి కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ సహాయక చర్యల్లో కీలక పురోగతి కనిపించింది. ఎస్ఎల్బీసీ టన్నెల్లో చిక్కుకున్న వారి ఆచూకీని గుర్తించేందుకు అధికారులు పలు విధాలా గాలింపు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా గ్రౌండ్ పెనిట్రేటింగ్ రాడార్ టెక్నాలజీ ద్వారా సొరంగం స్కానింగ్ చేస్తుండగా 5 చోట్ల మెత్తని భాగాలు ఉన్నట్లు స్కానింగ్‌లో గుర్తించారు. టీబీఎం ముందు భాగం, దెబ్బతిన్న భాగంలో 5 మెత్తని భాగాలను గుర్తించారు. దీంతో చిక్కుకుపోయిన వారు అక్కడే ఉన్నట్లుగా సహాయక సిబ్బంది అనుకుంటున్నారు. అయితే అది అవాస్తవమని కలెక్టర్ ప్రకటించారు. సహాయకచర్యలకు మరికొన్నిరోజులు సమయం పడుతుందన్నారు.








