“తమ్ముడూ కో-ఆపరేటివ్ ఆఫీసులో తెలిసిన వారెవరైనా ఉన్నారేమో చూడు, అక్కడ చిన్న పనుంది” అన్నాన్నేను ఒకరోజు నాకు బాగా తెలిసిన మిత్రుడు తో!
“ఏంటన్న, అక్కడ పనేంటి? ” అనడిగాడా మిత్రుడు.
“ఏమీ లేదు, చిన్నపనే; కోఆపరేటివ్ సొసైటీ ఒకటి రిజిస్టర్ చేయాలి, అందుకోసం కాస్త అసిస్టెన్స్ కావాలి.”
“అవునా? ఒకాయన ఉన్నారు. ఆయన కాంటాక్ట్ పంపిస్తానన్న; మీరాయనకొకసారి ఫోన్ చేయండి”.
“ఓకే తమ్ముడు. పంపించు. Thank you” అని చెప్పి ఫోన్ పెట్టేసాను. రెండు నిముషాల వ్యవధి లోపే ఆ మిత్రుని నుండి ఒక ఫోన్ నెంబర్ వచ్చింది SMS ద్వారా!
***
శరత్ వద్ద నుండి ఫోన్ నెంబర్ తీసుకొన్న రెండు మూడ్రోజులకు…..
“హల్లో…. సర్, మీరు…?” అర్థోక్తిగా ఫోన్లో నేను.
“అవును, నేనే! చెప్పండి.” అవతలి నుండాయన.
“జైభీం సర్! నన్ను రాజేంద్రన్ అంటారు.. మీ నంబర్ శరత్ దగ్గర తీసుకొన్నాను” అని నేను.
“అవునా, మంచిది, విషయమేమిటో చెప్పండి!” అనునయంగా ఆయన.
“ఏమీ లేదు సర్, ‘మాక్స్’ గా కోఆపరేటివ్ సొసైటీ ఒకటి రిజిస్టర్ చేయాలి; అమలాపురం ఆఫీసులో మీకు తెలిసినవారెవరైనా ఉంటే కాస్త చెప్పగలరా? మీ రిఫరెన్స్ తో వాళ్ళనక్కడ కలుస్తాను” అని విషయం చెప్పాను.
“ఓకే రాజేంద్ర గారు, శరత్, పృధ్వీ లు మీ గూర్చి, మీ యాక్టివిటీస్ గూర్చి చెప్పారు. మీరు అమలాపురం ఆఫీసుకు వెళ్లాలనుకొన్నప్పుడు ఒక్కరోజు ముందుగా నాకు చెప్పండి. నేనక్కడికి వస్తా” అన్నారాయన.
***
‘ఆయన’తో ఫోన్లో నేనిలా మాట్లాడిన ఒక వారం రోజుల తర్వాత నేను అమలాపురం ఆఫీసుకు ఫలానా రోజున, ఫలానా టైం కు వస్తున్నానని చెప్పి, అదేరోజు అదే ‘టైం’కు వెళ్ళాను. ‘ఆయన’ గూర్చి నేను, నా సిబ్బందిలో ఒకరు వేచి చూస్తూ ఉన్నామక్కడ.
“ఈయన వస్తారా, రారా?” అనుమానం స్టార్ట్ అయ్యింది. మాటిచ్చి, తప్పేవారే ఎక్కువున్న సమాజంలో ఉన్నాం కదా?, అందుకే ఎక్కడో అనుమానం!
“సరే, ఓ అరగంట వెయిట్ చేద్దాం” సంభాళించుకొన్నాన్నేను.
ఒకే ఒక్క పావుగంట వ్యవధిలోనే……
చేతి కర్ర సాయంతో నడవాల్సిన వయస్సున్న ఓ వ్యక్తి ‘ఊతకర్ర’ నొకదాన్ని ఆసరాగా చేసుకొని; అడుగు తీసి అడుగేస్తూ భారంగా నడుచుకొంటూ…..ఆఫీస్ వెైపు రావటం సడెన్ గా చూసాము. ఆయన్ను గూర్చిన గుర్తులు శరత్ ముందుగానే చెప్పి ఉండటం వల్ల – ‘ఆయనే మనం ఎదురు చూసే వ్యక్తి’ అయి ఉంటారని నిర్ధారించుకొని, ఎదురెళ్లి….,
“సర్, మీరు…..?” అంటూ పేరడిగాను.
“అవును నేనే! మరి మీరేనా రాజేంద్ర అంటే?”
“అవును సర్, నేనే మీకు ఫోన్ చేసింది” అనంటూనే, “ఏంటి సర్, మీరిలా సరిగ్గా నడవలేని పరిస్థితిలో ఉన్నారని తెలిస్తే, నేనే వచ్చి మిమ్మల్ని పికప్ చేసుకొని ఉండేవాడ్ని కదా?” అంటూ – ఆయనంత రిస్క్ తీసుకుని రావటంతో ఏదో చిన్న అపరాధ భావంతో అడిగాను.
“మరేం ఫర్వాలేదు. నేను మోపెడ్ పై వచ్చాను; ఆ చెట్ల నీడన పార్క్ చేశాను” అని కూల్ గానే చెబుతూ; “సరే, రండి.” అని చొరవగా ఆఫీసు లోపలికి తీసుకపోయి, ఆయనకు బాగా తెలిసిన సంబంధిత సిబ్బందికి పరిచయం చేసి; నా వైపు తిరిగి, “సరే రాజేంద్ర గారు, వీళ్ళు మీ పని చక్కబెడతారు; ఇంకేదైనా అవసరం ఉంటే కాల్ చేయండి; నే వెళ్ళొస్తా, కోర్టు దగ్గర కొంతమంది ఎదురు చూస్తుంటారు నా గురించి” అంటూ వెనుదిరిగారు.
“సర్, ఒక్క రెండు నిముషాలుండండి, టీ తాగి వెళ్ళిపోదురు” అనడుగుతున్నా; “పర్వాలేదు, నా కలవాటు లేదు, మళ్ళీ కలుద్దాం” ‘ అని చెప్పి, చక్కా వెనుదిరిగిపోయారు.
అప్పటి నుండి – నా ఫోన్ కాంటాక్ట్ లిస్ట్ లో ఆయన పేరు – ‘కోపరేటివ్’ బాబ్జీ!
ఆయన అసలు పేరు ‘పచ్చిమాల బాబ్జీ’! ఆయన స్వగ్రామం వన్నెచింతలపూడి అనే కుగ్రామం. వృత్తి రీత్యా ఉద్యోగి! ప్రవృత్తి రీత్యా పరోపకారి!!
ఆయన పేరు కరపత్రాల్లో ఎక్కడా కనబడదు!
నాయకులమని చెప్పుక తిరిగేవారి సరసన ఆయన ఉనికి ఎక్కడా కానరాదు!
(వి)నాయకులమని విర్రవీగే వారి పేర్ల జాబితాలో ఆయన పేరెక్కడా సాక్షాత్కరించదు.
ప్రసంగాల పులుల్లా ఆయన స్వరం ఏ సభల్లోనూ వినబడదు!
సామాజికమాధ్యమ ప్రచార మత్తులో జోగిన జాడ ఆయనకేనాడూ లేదు!
మరింకెక్కడుంటారీయన? ఏం చేస్తుంటారీయన?
ఆయన – ఉంటే, ఇంట్లో! లేకుంటే – పేదోని పెరట్లో!
అందుకేనేమో ఆయన పేరు, ఆయన వ్యాపకం నాక్కూడా చాలా కాలం వరకూ పరిచయం కాలేదు.
***
బాబ్జీ గారు వృత్తి రీత్యా, జీవన భృతి రీత్యా ప్రైమరీ అగ్రికల్చర్ కొఆపరేటివ్ సొసైటీ (పీఏసీఎస్)లో కార్యదర్శిగా కొనసాగారు. కొంతకాలం తర్వాత జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (డీసీసీబీ)లోకి ప్రమోషన్ పై వెళ్ళినా, ఆయనక్కడ కొంతకాలమే కొనసాగి, ఏవో సాంకేతిక కారణాల వల్ల తిరిగి తన పాత ఉద్యోగానికే తిరిగి వచ్చేసి; 2009లో తాను ఉద్యోగ విరమణ చేసేంత వరకూ దాన్లోనే కొనసాగారు.
వృత్తిలో కొనసాగినప్పుడు ఆయనేం చేశారో , ఎంత చేశారో నాకు తెలియదు. కారణం – ఆయనప్పటికి నాకు పరిచయం లేదు. ఇప్పుడు ఆరా తీద్దామన్నా – ఆయన లేరు, ఆ సమాచారం అందుబాటులోకి రాలేదు.
వృత్తికన్నా, ప్రావృత్తిక జీవనానికే ప్రాధాన్యం:
“””””””””””””””””””””””””””””
ఉద్యోగ విరమణ అనంతరం ఆయన చేపట్టిన అనేక కార్యక్రమాలపై నాకున్న అవగాహన మేరకు, నేనొచ్చిన నిర్ధారణ ప్రకారం – బాబ్జీ గారి వృత్తి జీవనం కన్నా, ప్రావృత్తిక జీవనమే విలువైనదిగా గడిచిందనుకొంటాను. వృత్తి నిర్వహణలో ఓ జాబ్ చార్టు; దానిలో – ఒకటి, రెండు, మూడు, నాలుగు అంటూ కొన్ని నిర్దుష్ట విధులు మాత్రం ఉంటాయి. అవి ఇష్టమున్నా , లేకున్నా; కష్టమైనా నష్టమైనా ‘బలవంతాన చేసి తీరాలి’.
ప్రావృత్తిక జీవనం అలా కాదు కదా?! తనకు నచ్చిన ప్రతి కార్యక్రమాన్నీ చేపట్టవచ్చు; చేపట్టిన ప్రతి కార్యక్రమాన్నీ అదెంత కష్టమైనా ఇష్టపూర్వకంగా కొనసాగించొచ్చు! అందుకే బాబ్జీ గారి లాంటి కొంతమంది ప్రత్యేక వ్యక్తులు తమ వృత్తి విధి కన్నా ప్రావృత్తిక విధినే సమర్ధవంతంగా నిర్వర్తిస్తూంటారు. పచ్చిమాల అలియాస్ కోఆపరేటివ్ బాబ్జీ గారు ఆ కోవకు చెందిన వారే అనుకొంటాను.
నేటికి పదహారు సంవత్సరాల క్రితం తన అరవయ్యో ఏట 2009లో ఆయన ఉద్యోగ విరమణ చేశారు. చాలా మంది ఉద్యోగులు తమ ఉద్యోగ విరమణతో పాటు ‘జీవన విరమణ’ కూడా అయిపోయినట్టు నిర్ధారణకొస్తారు, వైద్ధాంతిక ధోరణికి పోతారు. బాబ్జీ గారు అలా అనుకోలేదు. ‘ఇక ముందు చేసేదే అసలు సిసలు జీవనం అనుకొన్నారు!’. ప్రజాజీవనమే తన జీవనమనుకొన్నారు! ‘తన ఉద్యోగ ధర్మం వల్ల బాబాసాహెబ్ చూపిన ఉద్యమ బాటలో తను ఫుల్ టైమర్ గా పనిచేయలేక పోయానే’ అనే గిల్టీ ఎక్కడో ఉండిందో ఏమో; తన శేష జీవనమంతా బాబాసాహెబ్ కు అంకితమిచ్చారు! బాబాసాహెబ్ పట్ల ఎంతో అచంచల ప్రేమ, విశ్వాసం లేకుండా, ఎవరూ ఆ ఆరుపదుల వయస్సులో అంత తపోదీక్ష బూనరు.
‘చనిపోయిన వాని కళ్ళు చారడేసి’ అనే మూస లోకోక్తి మేరకు భజన పంథాలో నేనీ మాటలు చెప్పటం లేదు. నేను కూడా ఓ సామాజిక కార్యకర్తగా అనేకమంది ఉద్యోగుల్ని, ఆయా వృత్తుల్లో ఉన్న కొంతమందిని చూస్తూ ఉంటాను. “ఉద్యోగ విరమణానంతరం నేను కూడా మీ కార్యక్రమాల్లో తప్పక పాల్గొంటాను” అంటుంటారు చాలా మంది నాతో! తీరా, ఆ సమయమొచ్చేసరికి తప్పించుకునేందుకు ఏవేవో సాకులు చెవుతూ ఉంటారు. బాబ్జీ గార్ని ఎవరో బ్రతిమలాడితేనో, బలవంతం చేస్తేనో; ఎవరి మెప్పుకోసమో, ఎవరి ఒప్పుకోసమో ఈ సామాజిక సేవా కార్యక్రమాలకు పూనుకోలేదు; ‘బాబాసాహెబ్ బిడ్డగా ఇదో భాధ్యత’ అనుకొని కఠినమైన మరియు ఏ మాత్రం లాభసాటి కాని సేవారంగంలోకి దిగారు. మరాయన దీక్షాదక్షతల్ని పొగడకుండా ఎలా ఉండగలం?
పలు పాత్రల్లోకి పరకాయ ప్రవేశం:
“””””””””””””””””””””””””””””
ప్రజా ప్రతినిధిగా పోటీ లో…:
“”””””””””””””””””””’
ప్రజాసమస్యల పరిష్కారంలో ప్రజాప్రతినిధుల పాత్ర అద్వితీయమైనదని ఏనాడో గ్రహించిన బాబ్జీ గారు – తాను రిటైర్ అయిన తరువాత జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో వన్నె చింతలపూడి సర్పంచ్ పదవికి పోటీ పడ్డారు. నాకు గుర్తుండీ, ఆయన ఆ ఎన్నికల్లో తాను గమనించిన గ్రామ సమస్యలన్నింటితో ఓ పట్టిక తయారు చేసి, వాటిని నిర్దుష్ట కాలంలో పరిష్కరిస్తానని; అట్లు చేయనిచో తనపై క్రిమినల్ చర్యలకు ఆ గ్రామం పాల్పడవచ్చునని ఓ మేనిఫెస్టో తయారు చేసి విడుదల చేసినట్టు గుర్తు. కానీ; చివరికేం జరిగింది? మనకు తెలియనిదేముంది? యధావిధిగానే ఆ ఎన్నికల్లో కూడా మద్యం, మనీ ముందు నీతి, నిజాయితీ ఘోరంగా ఓడిపోయాయి. గ్రామాభివృద్ధి పట్ల స్పష్టమైన దార్శనికత ఉన్న ఓ మంచి నాయకుడ్ని వన్నె చింతలపూడి కోల్పోయింది.
సామాన్య సామాజిక కార్యకర్తగా:
“”””””””””””””””””””””””””””
కంఫర్టబుల్ గా ఇంట్లో కూర్చొని, కన్వీనియెంట్ టైం చూసుకుని, మెత్తని పరుపున్న మంచం పై పడుకొని, గాల్లో గొడ్డలి తిప్పుతూ వాట్సాప్ వార్స్, ఫేస్బుక్ ఫైట్స్ చేస్తూ; ‘ఇదే తాను చేస్తున్న మహా ప్రజా ఉద్యమ’మని భ్రమిస్తూ, ఇతరుల్ని భ్రమింపజేస్తు దశాబ్దాలు గడిపేస్తున్న కాలమిది.
సమస్యలకు పరిష్కారాలు సెల్ ఫోన్లో దొరకవని గ్రహించిన ఈ మహా పురుషుడు ఈ తరహా “మిథ్యా ఉద్యమానికి” కొన్ని మైళ్ళ దూరం జరిగిపోయి; గోచీ బిగించి నేరుగా ప్రజాపొలంలోకి దిగిపోయి; “సమస్య – స్మార్ట్ ఫోన్ల ద్వారా గానీ, సామాజికమాధ్యమాల వల్ల గానీ పరిష్కరించబడదు; సామాజిక శ్రేణులతో నేరుగా సంబంధాలు పెట్టుకుంటేనే సమస్యలు పరిష్కారమవుతాయ” నే విషయాన్ని ప్రాక్టికల్ గా చేసి చూపించాడాయన!
ఎన్నికల్లో తాను పొందిన ఓటమి తనను కుంగదీయలేదు. బాబ్జీ గారిప్పుడో స్వేచ్ఛా జీవి! స్వచ్చ ప్రజా జీవి!! ఇక ఆయనిప్పుడు పరిసర గ్రామాలన్నీ తిరగటం మొదలెట్టారు. ప్రజా సమస్యలు అడిగి మరీ తెలుసుకొంటున్నారు. సమస్యల పరిష్కారానికి సంబంధిత అధికారులతో ‘సలహా సంప్రదింపుల విధానం (లాబీ అండ్ అడ్వకసీ)’ తో పనిజేస్తున్నారు. దీర్ఘకాలిక, జటిల సమస్యల మీద దృష్టిపెడుతున్నారు. సమస్యకు – రాజకీయ, సామాజిక, న్యాయ దృక్కోణాలలో పరిష్కారాన్ని కనుగొంటున్నారు.
మొదట్లో జనం వద్దకు ఆయన వెళ్ళేవారు. ఆయన కార్యశీలతపై ప్రాచుర్యం; ఆ దరిమిలా నమ్మకం పెరిగిన తర్వాత జనం తండోపతండాలు గా ఈయన్ను వెతుక్కొంటూ రావటం మొదలెట్టారు. ఈ క్రమంలోనే ఎన్నో అత్యాచార కేసులు, మహిళలపై దౌర్జన్యం కేసులు, కుల అంతర్గత సమస్యలు, కులాంతర సమస్యలు ఇత్యాది వందలాది కేసులకు అధికార్ల ద్వారా పరిష్కారాన్ని చూపెట్టారు. 2009లో ప్రారంభమైన ఈ క్రమం 2016 వరకూ ఏడేళ్ల పాటు అప్రతిహతంగా నడుస్తూనే వచ్చింది.
ఏడేళ్ల తర్వాత: న్యాయవాది పాత్రలో:
“”””””””””””””””””””’
తాను చేపట్టిన సామాజిక కార్యక్రమాల ఒరవడిలో – ప్రజాఉద్యమ విజయానికి ప్రజా చైతన్యమొక్కటే కాక, న్యాయ విజ్ఞానం కూడా అవసరమౌతుందని గ్రహించిన బాబ్జీ గారు
అనుకున్నదే తడవు న్యాయవిద్యనభ్యసించటం మొదలెట్టారు. 2013 నాటికి బీ. ఎల్. నూ; 2016 నాటికి ఎల్.ఎల్.ఎం కూడా పూర్తి చేసేసారు.
ఆయా వ్యక్తులు ఆయా ఉద్యోగాల్లో ఉండగా ఇన్క్రిమెంట్ల కోసం, పదవోన్నతుల కోసం, తద్వారా తమ ఆర్థిక మెరుగుదల కోసం తమ తమ వృత్తి నైపుణ్యాలను పెంచుకోవటాన్ని చాలామంది ఉద్యోగుల విషయంలో చూస్తూ ఉంటాము. కానీ, బాబ్జీ గారిది ఒక వైభిన్న వ్యక్తిత్వం కాబట్టి తన కుటుంబానికి కూడు పెట్టే ఉద్యోగం చేస్తూన్నప్పుడు ఇంక్రిమెంట్ల కోసం డిగ్రీలను తన పేరెనక తగిలించుకోవాలని అనుకోలేదు. ఏది చేసినా అంకిత భావంతో చిత్తశుద్ధితో చేయాలన్న విశిష్ట గుణమున్న వాడు కాబట్టి – ‘పరోపకారం లేదా సామాజిక సేవ అనే ప్రవృత్తిని ప్రావీణ్యంతోనే’ చేయాలనుకొన్నారు, వృద్ధాప్యం కల్పించే ఆటంకాలను కూడా పక్కకు నెట్టి, తన అరవై ఐదో ఏట ఎల్ ఎల్ ఎం పూర్తి చేయగలిగారంటే – ఎంతో కృషి, పట్టుదల ఉంటేనే గానీ సాధ్యం అలాంటివి సాధ్యం కావు. కృషితో సాధ్యం కాని పనులు కూడా ‘కసి’ తో సాధ్యమౌతాయి. సమాజ వివక్ష పట్ల ఆయనకున్న కసి – ఆయన్ను బీ.ఎల్. తోనే ఆపకుండా ఎల్ ఎల్ ఎం కూడా చదివింపజేసిందనుకొంటాను. ప్రజా ఉద్యమ విజయాల పట్ల తనకున్న తపన అలాంటిది మరి!
వీలువెంబడి – న్యాయపోరాటానికుక్కుకవచంలా నుపయోగపడు న్యాయవాద వృత్తిని కూడా చేపట్టారు. ఈ న్యాయపోరాట క్రమంలోనే ఆయన సాధించిన రెండు ప్రధానమైన కేసుల్ని మనం గుర్తు చేసుకోవాలి.
మొదటిది – అమలాపురం, అల్లవరం, ఉప్పలగుప్తం పరిసర ప్రాంతాల్లో గల జనం ఎదుర్కొంటున్న కాలుష్య మరియు తాగు నీటి సమస్య! ఈ సమస్యనెదుర్కొంటున్న ఆ ఊళ్లన్నీ కలసి ఒకసారి ఈయన వద్దకు రావటం తటస్థించింది. సాగు భూములన్నింటినీ రొయ్యల చెరువులుగా మార్చుట వల్ల; ఆ రొయ్యల సాగుకు ఉపయోగించు మేత వల్ల భూ ఉపరితలం మాత్రమే కాక, భూ లోపలి పొరలు కూడా విషతుల్యమై తాగునీరు కలుషితమై ప్రజారోగ్యం దెబ్బ తింటున్న సమస్యయది. అంతేకాక, అదే సమస్య కొబ్బరి పంటపై కూడా తీవ్ర దుష్ప్రభావం చూపిస్తోంది. వాస్తవానికి ఈ సమస్యా కొత్తదేమీ కాదు; ఈ సమస్యపై పోరాటమూ కొత్తదేమీ కాదు. అనేక ప్రజాసంఘాల ద్వారా అనేక సంవత్సరాలు ప్రజాపోరు నడిచింది. ఇదంతా తెలుసుకొన్న బాబ్జీ గారు చివరికి దానికి – న్యాయ జోక్యం (legal intervention) ద్వారా పరిష్కారాన్ని కనుగొన్నారు. కార్తికేయ మిశ్రా గారు జిల్లా కలెక్టర్ గా ఉన్న ఆ సమయంలో కోర్టు అజ్ఞలు పాటిస్తూ, అట్టి విషతుల్యమైన చెరువులనన్నింటినీ వందల సంఖ్యలో పూడ్చివేయటం జరిగింది. ఈ కథ నడుస్తున్న మధ్య కాలంలో – చెరువుల వల్ల నష్టపోనున్న రైతులు ఒక దశలో కోట్లాది రూపాయిల డబ్బు ఆశ చూపి, మరో దశలో భయపెట్టి బాబ్జీ గార్ని రాజీకి ఒప్పించే ప్రయత్నం చేసినా, తానెన్నడూ ఆశకు గానీ, భయానికి గానీ తలొగ్గింది లేదు.
ఇక -మరో ముఖ్య సమస్య – గోడి గ్రామంలో, బాలుర ఆశ్రమ పాఠశాలలో వసతుల లేమి సమస్య. అల్లవరం మండలం గోడి అనే గ్రామంలో దాదాపు పది, పన్నెండు సంవత్సరాల క్రితం షెడ్యూల్డ్ కులాల బాల బాలికలకు ఆశ్రమ పాఠశాలలు నెలకొల్పబడిన విషయం చాలా మందికి తెలిసిందే! కానీ, అతి తక్కువ మందికే తెలుసు – ఆ పాఠశాలల్లో కనీసం నీటి వసతి కూడా లేదని! ఎవరు ఒప్పుకున్నా లేకున్నా; ఆయా ప్రభుత్వాలు ఎస్సీల ‘సంక్షేమ పథకాల ప్రచారం’ పై చేసే ఖర్చులో ‘సగం’ కూడా అట్టి ‘సంక్షేమ పథకాల అమలు’ కోసం ఖర్చుపెట్టదు.
ప్రాణికి ప్రధాన జీవనాధారం నీరు. నీరు తర్వాతనే మిగతావన్నీను! ఇది విశ్వవ్యాప్త ప్రాకృతిక సూత్రం. షుమారు ఏడు వందల మంది విద్యార్థులు చదువుతున్న గోడి బాలుర ఆశ్రమ పాఠశాలకు దాదాపు ఒక అర్ధ దశాబ్దం పాటు సవ్యమైన నీటి సదుపాయం లేదంటే ఎవరైనా నమ్ముతారా? తిన్నది విసర్జించేందుకు తగు టాయిలెట్స్ లేవంటే నమ్ముతారా? టాయిలెట్లే లేవంటే డ్రైనేజీ వ్యవస్థ ఉంటుందని నమ్మటానికి సిద్ధపడగలమా? కానీ…ఇవన్నీ నమ్మాల్సిందే! మిగతా వసతులు పక్కన బెట్టి, కనీస వసతులైన తాగునీరు, టాయిలెట్లు, డ్రైనేజీ, అంతర్గత రోడ్లు కోసం కొన్ని సంవత్సరాల పాటు హాస్టల్ యాజమాన్యం ప్రతిపాదనలు చేస్తూనే ఉంది, ప్రజాసంఘాలు పోరాటాలు చేస్తూనే ఉన్నాయి.
విషయం బాబ్జీ గారి వద్దకు వెళ్లిన తర్వాత ఆయన కూడా తన టీం సభ్యులైన బుడితి శరత్, సఖిలే పృధ్వీరాజ్, పెయ్యల పరశురామ్ తదితరులతో కలసి సంబంధిత అధికార్లను, ప్రజాప్రతినిధులను సంప్రదించి సమస్య పరిష్కారానికి కృషి చేసారు. పరిష్కారం దొరకలేదు.
ఇక్కడ ఒక వైరుధ్యాన్ని గుర్తు చేసుకుందాం. తూ.గో.జిల్లా ఉమ్మడిగా ఉన్నప్పుడు గానీ; నేడు డా. బీ.ఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లాగా ఏ(వే)ర్పాటు అయిన తర్వాత గానీ ఈ జిల్లాకు ముగ్గురు ‘యస్సీ’ ఎంఎల్ఏ లు, ఒక ‘యస్సీ’ ఎంపీ ప్రజాప్రతినిధులుగా ఉన్నారు. అయినప్పటికీ వీరు ఏనాడూ ‘ఎస్సీలకు’ ప్రతినిధులుగా ఉండలేకపోతున్నందునే ‘ఎస్సీల’ ఏ సమస్యలూ పరిష్కారం కావటం లేదు. రాజకీయరంగంలో అనాదిగా నడుస్తున్న ఓ విచిత్ర వైరుధ్య, వైకల్య స్థితి.
బాబ్జీ గారు చొరవ తీసుకొని సమస్యనిక కోర్టు గుమ్మమెక్కించాల్సి వచ్చింది. ఆయన -రాష్ట్ర ఉన్నత న్యాయస్థానంలో ప్రజాహిత వ్యాజ్యాన్ని ఫైలు చేశారు. ‘తోలు మందం’ రాజకీయనాయకుల చెవికెక్కని సమస్య కోర్టును మాత్రం కదిలించింది. సమస్యకున్న తీవ్రత దృష్ట్యా కోర్టు వెంటనే స్పందించింది. పరిస్థితిని కళ్ళారా చూడ్డానికి స్వయానా జడ్జి గారు గోడి బాలుర హాస్టల్ ను సందర్శించారంటే పరిస్థితి తీవ్రతను మనం అర్థం చేసుకోవచ్చు. జడ్జి గారు సందర్శించిన తర్వాత, కోర్టు సంబధిత అధికార్లకు మొట్టికాయలు వేస్తూ; 2022 లో నిర్దుష్టమైన ఆదేశాలిచ్చింది. కోర్టు దృష్టికి తీసుకొచ్చిన సమస్యలన్నింటినీ పరిష్కరించేందుకు తగు కాలవ్యవధిని కూడా తానే నిర్ణయించి చెప్పుటయే కాక; ఈ సమస్యకు సంబంధించి ప్రభుత్వం చేపట్టిన ఈ అభివృద్ధి పనులను స్థానిక జిల్లా కోర్టు పర్యవేక్షణలో చేయాలని ఆదేశాలను జారీ చేసింది. ఇది నిజంగా కోర్టు చూపిన అతిగొప్ప చొరవ. అంతే కాదు, “ఈ ఆదేశాలు మేమిచ్చిన కాల వ్యవధిలో పూర్తి చేయకుంటే సంబధిత అధికార్లపై కఠిన చర్యలుంటాయని ” కూడా కటువుగానే చెప్పింది. దీని ఫలితంగా ప్రభుత్వం – ఈ సమస్యలను పరిష్కరించేందుకు ఆగమేఘాల మీద 90లక్షల రూపాయిలు మంజూరు చేయటం, ఆ పనులను కోర్టు సిబ్బంది పర్యవేక్షణలో పూర్తి చేయటం శరవేగంగా జరిగిపోయింది. ఇది ప్రజన్యాయ పోరాట చరిత్రలో అతిగొప్ప, వినూత్న విజయం. ఈ విజయం ఘనతంతా బాబ్జీ గారికి చెందాల్సిందే!
పాఠశాలల అభివృద్ధిలో బాబ్జీ గారి పాత్ర:
“””””””””””””””””””'””””””””””””””
సంవత్సరాల వారీగా విషయాల్ని మననం చేసుకొంటూ వచ్చినందున పై అంశాలన్నీ ముందుగా మాట్లాడుకున్నాం గానీ; వీటన్నింటి కన్నా ముందుగా గుర్తు చేసుకోవాల్సిన ప్రధాన అంశం – పాఠశాలల అభివృద్ధి అంశం!
ప్రపంచ ప్రఖ్యాత దేశీయ చమురు సంస్ధ ఓఎన్జీసీ కోనసీమ ప్రాంతం నుండి కొన్ని దశాబ్దాలుగా కొన్ని లక్షల కోట్ల విలువ చేసే చమురు మరియు సహజ వాయువును తవ్వి తీసుకొనిపోతున్న వైనం దేశమంతా తెలుసు. అయితే, ఇలా ఏ సంస్థ అయితే ఇక్కడి సహజ వనరుల్ని కొల్లగొట్టుకొనిపోతుందో, ఆ సంస్థ – బహుళ జాతి సంస్థల సామాజిక బాధ్యత (కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ – CSR) మేరకు తానున్న ప్రాంత అభివృద్ధికి తన వార్షిక లాభాల్లో ఇరవై శాతం ను ఖర్చు పెట్టాల్సి ఉంటుంది.
ఈ విషయం పౌరులందరికీ తెలియకుండా మొదటి నుండీ సంస్థ మరియు రాజకీయ నాయకులు జాగ్రత్తపడ్డారు. రాజకీయనాయకులు, ప్రజాప్రతినిధులు మాత్రమే ప్రత్యక్ష పరోక్ష మార్గాల్లో ఓఎన్జీసీ నుండి చాలాకాలంగా లాభపడుతూ వస్తున్నారు. ఏవో అక్కడక్కడా చిన్నా, చితక రోడ్లు వేయటం, పాఠశాల భవనాలకు అరకొర నిధులిచ్చి చేతులు దులుపుకోవడం వంటి పనులు ఓఎన్జీసీ చేస్తూ వస్తోంది.
ఈ విషయాన్ని పసిగట్టిన పచ్చిమాల బాబ్జీ గారు ఓఎన్జీసీ తో సంప్రదింపులు జరిపి, కోనసీమలో గల ప్రాథమిక పాఠశాలలన్నింటా ఓఎన్జీసీ CSR ఫండ్స్ తో – విద్యార్థులు కూర్చునే బల్లలు, రాత బల్లలు, ఆటపరికారాలు, ప్రహరీ గోడలు నిర్మాణం ఇత్యాది వాటికి నిధులు సమకూర్చేవారు. వైఎస్ఆర్సి ప్రభుత్వం 2019 నుండి ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి ‘నాడు – నేడు’ పేరున ఏవైతే అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిందో అట్టి అభివృద్ధి పనులన్నింటినీ బాబ్జీ గారు 2014 నుండే చేయించటం మొదలెట్టారు.
కొనసీమలో గల పదహారు మండలాల్లో దాదాపు యాభై శాతం మండలాల్లోగల పాఠశాలలకు అందునా యస్సీ కాలనీల్లో గల పాఠశాలలకు ఈ నిధులు సమకూర్చేవారు. అలా ఈయన కృశివల్ల సమకూరిన నిధుల విలువ – అధికారిక లెక్కలు అందుబాటులోకి రాలేదు గానీ – దాదాపు పది నుండి ఇరవై కోట్లకు పై మాటే అని ఆయన మిత్రులు, సన్నిహితులు చెబుతున్నారు. దళితుల విద్యాభివృద్ధి పట్ల ఆయనకున్న ఆసక్తిని ఈ కార్యక్రమాలు మనకు తెలియజేస్తాయి.
పాఠశాలలలే కాక, కమ్యూనిటీ హాళ్ల నిర్మాణం పై కూడా ఆయన దృష్టి సారించారు. ఒక్కొక్క హాలుకు సరాసరిన ఐదు లక్షల నిధులతో జిల్లా పరిధిలో దాదాపు పదిహేను కమ్యూనిటి హాళ్ళకు బాబ్జీ గారు ఓఎన్జీసీ ద్వారా నిధులు సమకూర్చారు. అంటే కేవలం కమ్యూనిటీ హాళ్ళ నిధుల విలువే షుమారు డబ్బై ఐదు లక్షల రూపాయిలు ఉంటుంది.
*ముగింపు: * మనం ప్రస్తావించుకొన్న విషయాలు బహు స్వల్పం మాత్రమే! ఆయన చేసిన కార్యక్రమాలు ఇలా చెప్పుకొంటూ పోతే లెక్కకు మిక్కిలి వస్తాయి. *ఆ లెక్కల్ని కరెన్సీ రూపంలో చూస్తే దాని విలువంతా కలిపి ఎంత లేదన్నా వంద కోట్ల పై మాటే!
ఇవన్నీ ఆయన చేయగలిగారంటే , ఆయన పరిపూర్ణ ఆరోగ్యవంతుడైనందుననూ, లెక్కకు మిక్కిలి ఆస్తులున్నందుననూ చేసారనుకోవటం పొరపాటే! 2004 లో అనగా రెండు దశాబ్దాల క్రితమే జరిగిన భయంకరమైన రోడ్డు ప్రమాదంలో తన కుడి కాలు విరిగిపోయింది. హైదరాబాద్లో ప్రఖ్యాత వైద్యుడు డా. గురవారెడ్డి చేత కూడా వైద్యం చేయించుకున్నారు. అయినప్పటికీ తన కాలు పర్ఫెక్ట్ గా సెట్ కాలేదు. దాన్ని సరిజేసేందుకు రెండు మూడు ప్రయత్నాలు జరిగినప్పటికీ అది సరిగ్గా అమరలేదు. ఫలితంగా ఆయన సవ్యంగా నడవలేని స్థితి ఏర్పడి; కొత్తగా చేతికి ఊతకర్ర వచ్చి చేరింది.
సహకరించని కాళ్ళను ఆయనెన్నడూ సమస్యగా చూళ్ళేదు. “ఊతకర్రే తన వాహనం కాగా; సంకల్పబలాన్ని దానికి ఇంధనంగా సమకూర్చుకొని, అదే ‘ఊతకర్ర వాహన’ సాయంతో ఆయన ఊళ్ళన్నీ కుంటుకొంటూనే తిరుగుతూ వందకోట్ల కిమ్మత్తు పనులు చేయించగలిగారు. అందుకే ఆయన ఊతకర్ర విలువ వందకోట్లంటున్నాం!” ఇది కోనసీమ చరిత్రలోనే ఏ ఒక్క రాజకీయ నాయకుని వల్ల కూడా కాని పని. ఉద్ధండులు, మహోద్ధండులు అనిపించుకొన్న ప్రజాప్రతినిధులు కూడా ఇంతటి విలువైన పనులు మునుపెన్నడూ చేయలేదేమో?!
“అందరూ బాగుండాలి అందులో నేనుండాలి” అని ప్రతి సామాన్యుడు అనుకొంటాడు. కారణం – ‘అందులో నేనుండాలి’ అనుకోవటంలో ఆ వ్యక్తి స్వార్థం కూడా నిబిడీకృతమై ఉంది కాబట్టి. కానీ;
“అందరూ బాగుండాలి అందుకే నేనుండాలి” అనే సూత్రాన్ని పచ్చిమాల బాబ్జీ గారిలాంటి కొంతమంది మహానుభావులే పాటించగలరు – వారు నిర్మల, నిరాపేక్షాయోగులు కాబట్టి!
సమాజాభివృద్ధిి పథంలో ఆయన నెలకొల్పిన ఈ రికార్డును భవిష్యత్తులో ఎవరూ కూడా అందుకోలేరేమో?! నేడాయన లేరు. ఆయన చూపిన మహోన్నత మార్గం మన ముందుంది. దాన్ని విస్తరిస్తూ ఆయన సాధించిన కీర్తికి అమరత్వాన్ని సిద్ధింపజేయటం ఒకటే మనం చేయగలిగిన పని; మనమాయనకిచ్చే నివాళి!
నీల్ సలాం!
విషాదాశ్రు తుషారాలతో,
మాకా రాజేంద్రన్ 9966 306 555
27/02/2025.
(01/04/2025 న జరగనున్న సంస్మరణ సభ సందర్భంగా)
గమనిక: సమయాభావం వల్ల బాబ్జీ గారి కార్యక్రమాలకు సంబంధించిన ఫస్ట్ హాండ్ ఇన్ఫర్మేషన్ సంపాయించలేకపోయాము. అందువల్ల అధీకృత అంకెలు, సంఖ్యలు ఇవ్వలేకపోయాము. వివరాల్ని విస్మరించి విషయం పై దృష్టి సారించాల్సిందిగా మనవి!







