_సందర్భం: అంతర్జాతీయ మహిళా దినోత్సవం!_
~~~~~~~~~~~~~
*అంబేడ్కర్ ను అన్వయించుకోని మహిళా ఉద్యమాలేవీ సత్ఫలితాలు ఇవ్వనేరవు.*
*~~~~~~~~~~~~~*
👉🏾 *అబలల ఉద్ధరణలో అంబేడ్కర్ పాత్ర*
👉🏾 *_మహిళా సాధికారత ఉద్యమంలో అంబేడ్కర్ను అన్వయించుకోవవలసిన అవశ్యకత._*
*కార్మిక* మహిళలకు క్లారా జట్కిన్ (Clara Zetkin) సారధ్యంలో సమకూడిన విజయ సంకేతంగా మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం 1910 సం. నుండి ఉనికిలోకి వచ్చి; మొదట్లో కార్మిక కర్షక మహిళలు జరుపుకొనే విజయోత్సవంగా మొదలై; రాన్రాను అది ప్రతి ఏటా కేవలం కార్మిక వర్గ మహిళలే కాక, సకల వర్గాల మహిళలు ఆ ఉత్సవాన్ని కొనియాడుతూ వస్తున్నారు.
వాస్తవానికి ‘అం’తర్జాతీయ ‘మ’హిళా దినోత్సవంను లఘు నామంలో (అం+మ=) ‘అమ్మ’ దినోత్సవంగా వ్యవహరించటం మరింత అర్థవంతంగా ఉంటుందేమో?!
మానవ సృష్టిలో స్త్రీ పురుషులిరువురి పాత్రా సమంగానే ఉన్నదనిపిస్తున్నప్పటికీ; సృష్టంను అండ దశ నుండీ మోసి, కని, పెంచి పోషించుటలో స్త్రీ వహిస్తున్న అపరిమిత బాధ్యత దృష్ట్యా సృష్టి పెంపుదలలో స్త్రీ పాత్రయే ఒకింత ఎక్కువయనే సత్యాన్ని ఏ ఒక్కరూ కాదనలేరు. సమాజంలో ఒక స్త్రీ అమ్మగా, ఆలిగా, అక్కగా, చెల్లిగా ఇలా తాను పోషించే ప్రతి జీవనభాగంలోనూ అమ్మతనం ఉంటుంది. అందువల్ల ఈ రోజును ‘అమ్మ’ దినోత్సవంగా వ్యవహరించటమే మరింత ఆనందదాయకం అనిపిస్తుంది.
ఒక కుటుంబానికి, తద్వారా సమాజానికి ఇంత ఆనంద ప్రదాయినిగా ఉన్న అమ్మ నిజంగానే తన నిత్య జీవితంలో ఆనందదాయకంగా ఉంటుందా అనేది వేల డాలర్ల ప్రశ్న.
_”ఒక జాతి (నేషన్) యొక్క ప్రగతిని లెక్కించాల్సివచ్చినప్పుడు ఆ జాతిలోని స్త్రీ అభివృద్ధిని చూసి లెక్కించాల్సి వస్తుంది”_ అంటారు అణగారిన వర్గాల ఆశాజ్యోతి బాబాసాహెబ్ అంబేద్కర్. స్త్రీ – లింగ, రాజ్య వివక్షతలను ఎదుర్కొంటూ రెండింతల అణచివేతకు నిత్యం గురియవుచూ ఉండటం వల్ల – అణగారిన వర్గాల చిట్టాలో మొదటి వరుసలో ఉంటుంది. సమాజంలో అట్టడుగుకు నెట్టివేయబడిన వర్గాల ‘కీలకమైన సమస్యలకు మౌలికమైన పరిష్కారాలు ‘ సూచించటం ద్వారా అంబేడ్కర్ – విమర్శకుల నుండి సైతం ప్రశంశలు అందుకొన్నారు. అందువల్ల ఈ మహిళా దినోత్సవం నాడు అంబేడ్కర్ అబలల విషయంలో చేసిన కృషిని స్మరించుకోవడం ఎంతైనా అవసరం.
స్త్రీ ఉద్ధరణ విషయంలో కొంత మంది సంఘ, మత సంస్కర్తలు – బాల్య వివాహ రద్దు, సతీసహగమనం రద్దు, వితంతు పునర్వివాహాలు లాంటి కొన్ని సంస్కరణలు ప్రతిపాదించి, వాటి నిర్మూలనకై కృషి చేసిన మాట వాస్తవమే! అయినప్పటికీ పురుషాధిపత్య సమాజంలో *అవి తాత్కాలిక ఉపశమన సంస్కరణలుగా* మాత్రమే మిగిలిపోయిన విషయాన్ని మనం గమనించాలి.
సృష్టి, మరియు స్థితి గమనంలో అపరిమిత బరువు బాధ్యతలను మోస్తున్న స్త్రీ కేవలం *’ఉద్ధరించబడుట మాత్రమే కాదు; ఆమె విముక్తి కాబడాలి’ అని నమ్మిన బాబాసాహెబ్ అంబేడ్కర్ – స్త్రీ పరాధీనత (dependency) ను పోగొట్టే స్వతంత్ర సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు.* ఆ సిద్ధాంతమే – *’స్త్రీకి అస్తి హక్కు సిద్ధాంతం wealth for women)!’*
*_ఎప్పటి వరకూ స్త్రీ- తలలో పెట్టుకొనే జడ క్లిప్పుల నుండి కాళ్ళకు తొడుక్కొనే జత చెప్పుల దాకా తనకు కావాల్సిన నిత్యావసరాలకు, అత్యవసరాలకు ఆర్థికంగా పురుషుని మీద ప్రతి నిత్యం ఆధారపడి ఉంటుందో, అప్పటి వరకూ పురుషుని ఆధిపత్యం చెల్లుబాటు అవుతూనే ఉంటుంది కాబట్టి; ఆమెకు ఆర్థిక స్వాతంత్ర్యము అవసరమని బలంగా ప్రతిపాదించారు డా. బాబాసాహెబ్ అంబేద్కర్._*
ఎప్పుడైతే ఒక స్త్రీ ఆర్థికంగా స్వతంత్రురాలు అవుతుందో అప్పుడే పురుషాధిపత్యం అత్యంత సహజంగా పలచబడుతుందని బలంగా నమ్మి, అందుకు అంతే బలంగా కృషి చేశారు. ఒక బిడ్డను గర్భాన్న మోసి, కని, పెంచిన స్త్రీ – ఆ బిడ్డను ఆరోగ్యవంతమైన పౌరునిగా సమాజానికి అందించే ఈ సుదీర్ఘ ప్రక్రియలో తాను వహించవలసిన అపరిమిత బాధ్యతకు పురుషాధిక్యం లేదా లింగ వివక్ష అనేది అనునిత్యం అడ్డు తగులుతున్నదని నమ్మి, వాదించి, స్త్రీకి అస్తి హక్కు కల్పనకు అనేక సవాళ్ల మధ్య చిత్తశుద్ధితో కృషి చేసారు.
అయితే ఈ కృషికి సనాతన బ్రాహ్మణ వాదులు, వారిచే ప్రేరేపించబడిన సనాతన మహిళలే చట్ట సభల్లోనూ, వీధి పోరాటాల రూపంలోనూ అడ్డు తగలటంతో ఆ కృషి ఆగిపోయింది. స్త్రీకి ఆస్తి హక్కు చట్టం వీగిపోయింది. తాను చేపట్టిన ఈ చారిత్రక మహోత్కృష్ట పనికి స్వార్థపూరిత శక్తులు అడ్డుపడుటతో మనస్థాపం చెంది, తన న్యాయశాఖ మంత్రి పదవిని గడ్డిపోచగా ఎంచి, రాజీనామా చేసి పారేశారు. *బహుశా భారతదేశ స్వతంత్ర పూర్వ, ఉత్తర చరిత్రలో మహిళల విషయంలో ఇంతటి త్యాగానికి ఒడిగట్టిన సంస్కర్త మరొకరు లేరంటే అతిశయోక్తి కాదు.*
అంతటితో – మహిళల విముక్తికి బాబాసాహెబ్ అంబేద్కర్ తన కృషిని ఏమాత్రం ఆపకుండా – తాను కార్మిక శాఖా మంత్రి గానూ, న్యాయ శాఖా మంత్రిగానూ నెహ్రూ కేబినెట్ లో పనిచేసినప్పుడు మహిళలకు పురుషులతో సమాన వేతనం కల్పించుట; సంఘటిత రంగంలోను, ఫ్యాక్టరీల్లో పనిచేసే నిమహిళా కార్మికులకు, మరియు మహిళా ఉద్యోగులకు ప్రసూతి సెలవును మంజూరు చేయుట వంటి కీలకమైన పనులు సాధించి పెట్టారు. ఆయన చేసిన కృషి వల్ల ఈ ప్రయోజనాలను నేటి ఆధునిక మహిళా కార్మిక, ఉద్యోగులు అనుభవించగలుగుతున్నారు.
అయితే *మహిళా విముక్తి కి శాశ్వత పరిష్కారం ఇవ్వగలదన్న అస్తి హక్కు* చట్టం ఏదైతే ఉందో అది కేవలం ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్ర స్థాయిలో యన్టీఆర్ హయాంలో చట్టంగా వచ్చిందే కానీ, ఇంకా అది కేంద్ర స్థాయిలో ఇప్పటికీ చట్ట రూపాన్ని సంతరించుకోలేదు. ఇది చాలా విచారించదగిన విషయం. మహిళా విముక్తికి ఎవరైతే నిరంతరం కృషి చేస్తున్నామని చెప్పుకొంటున్నారో, అట్టి మహిళావాదులు (ఫెమినిస్ట్లు) ఎప్పుడూ తాత్కాలిక అంశాలపైనే పోరాడుతున్నారే తప్ప; అంబేడ్కర్ కాలంలో వీగిపోయి, మహిళలకు శాశ్వత పరిష్కారాన్ని అందించగలదన్న అస్తిహక్కు చట్టం గూర్చి అంతగా పట్టించుకున్న దాఖలా లేదు. బహుశా ఇప్పటికీ ఫెమినిస్ట్ ఉద్యమ నాయకత్వం అత్యధికంగా బ్రాహ్మణ మరియు కమ్యూనిస్ట్ ప్రభావిత మహిళల చేతుల్లోనే ఉన్న కారణంగానో మరే కారణంతోనో మహిళా విముక్తి దాత అయిన అంబేడ్కర్ ను ఆ ఉద్యమం స్వంతం చేసుకోలేదు సరికదా, ఆయన ప్రస్తావన కూడా ఎప్పుడూ చేసినట్టు కనబడదు. *అంబేడ్కర్ తదనంతర కాలంలో ఫెమినిస్ట్ ఉద్యమకారులు – అస్థిహక్కు చట్టం కావాలన్న డిమాండును ఏకైక సాధనాంశంగా చేసుకొని ఉద్యమించి ఉంటే; ఈ సరికి కేంద్ర ప్రభుత్వం మహిళలకు సమాన అస్తి హక్కు చట్టం తెచ్చి ఉండేది; దాని ఫలితంగా మహిళా స్వావలంబన (self reliance of woman)ఎప్పుడో సాకారమై ఉండేది.*
నేడు మహిళా దినోత్సవ సంబరాలు మొదట్లో శ్రామిక వర్గ స్త్రీల వద్ద నుండి మొదలైనా; *రాన్రాను ప్రభుత్వ, ప్రభుత్వేతర సంస్థల హయాంలో ఆ సంబరాలు చేయటం మొదలెట్టిన దగ్గరి నుండీ దానికి అక్కరలేని గ్లామర్ అద్దబడి, అది ఓ కృతక క్రతువులా మొదలయ్యి, చివరకు యాంత్రిక క్రతువులా బలపడింది.* మహిళా దినోత్సవాన్ని ఓ విముక్త సంకేతంలా కాక; ఆయా ప్రభుత్వ, ప్రభుత్వేతర సంస్థల ప్రచార కార్యక్రమాల స్థాయికి దిగజారిపోవుటతో మహిళా దినోత్సవ మూల ఉద్దేశ్యం దెబ్బతిని పోతూ ఉంది. దీన్ని గ్రహించి, అభ్యుదయ మహిళా, ప్రజా సంఘాలు – ‘మహిళా విముక్తి పోరు’ ప్రధానాంశంగా ఉద్యమిస్తే ఆకాశంలో సగంగా ఉన్న వారికి రాజకీయ అవకాశాల్లో అనగా చట్ట సభల్లో యాభై శాతం సీట్లు; కేంద్ర స్థాయిలో స్త్రీలకు అస్తి హక్కు లాంటి కీలకమైన డిమాండ్లను ఎప్పుడో సాధించుకొని ఉండేవారు. మహిళా ఉద్యమం, మరియు పలు ప్రజా, మహిళా సంఘాలు ఆ దిశగా ఆలోచించి ప్రయాణిస్తాయని ఆశిద్దాం. మహిళలంతా అట్టి విజయోత్సవాలు చేసుకోవాలని కాంక్షిద్దాం.
*//మాకా రాజేంద్రన్//* అడ్వకేట్, 08/03/2025
సామాజిక విశ్లేషకుడు.
94 9151 8909;
9966 306 555







