గ్రూప్-2 ఫలితాలు విడుదల అయ్యాయి. రాష్ట్రంలో 783 గ్రూప్-2 పోస్టుల భర్తీకి గత సంవత్సరం డిసెంబరు 15, 16 తేదీల్లో పరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే. తాజాగా అభ్యర్థుల జనరల్ ర్యాంకింగ్స్ జాబితా, ఫైనల్ ‘కీ’ని టీజీపీఎస్సీ విడుదల చేసింది. అభ్యర్థుల మార్కులతో కూడిన జనరల్ ర్యాంకుల జాబితాను టీజీపీఎస్సీ అధికారిక వెబ్సైట్లో ఉంచింది. టీజీపీఎస్సీ వెబ్సైట్లో గ్రూప్ 2 ఓఎంఆర్ షీట్లు ఉన్నాయి. గ్రూప్-2 టాపరు అత్యధికంగా 447 మార్కులు వచ్చినట్లు కమిషన్ వెల్లడించింది.
ఈ పరీక్ష కోసం 5.51 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా దాదాపు సగం మంది మాత్రమే హాజరు అయ్యారు. గ్రూప్ 2 పరీక్ష2,49,963 మంది అభ్యర్థులు రాశారు. ఇందులో 2,36,649 మంది అభ్యర్థుల ర్యాకింగ్ లిస్టు విడుదల చేశారు. రాష్ట్రంలో గ్రూప్స్ ఫలితాల వెల్లడికి రూపొందించిన షెడ్యూల్ను ఈ నెల 7న తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రకటించింది. మార్చి 10 నుంచి 18 మధ్య గ్రూప్-1, 2, 3 ఫలితాలను వెల్లడించనున్నట్లు టీజీపీఎస్సీ ప్రకటించింది. ఇందులో భాగంగా మార్చి 10న గ్రూప్-1 ఫలితాలు వెల్లడించింది. షెడ్యూల్ ప్రకారం మార్చి 10న గ్రూప్-1 ఫలితాల విడుదల, అదే రోజు అభ్యర్థుల ప్రొవిజినల్ మార్కుల వివరాలనూ టీజీపీఎస్సీ వెల్లడించనుంది. అనంతరం ఆయా అభ్యర్థుల ధ్రువీకరణ పత్రాల పరిశీలన ఉంటుంది. ఈరోజు గ్రూప్-2 జనరల్ ర్యాంకింగ్ జాబితాను ప్రకటించింది. మార్చి 14న గ్రూప్-3 జనరల్ ర్యాంకింగ్ జాబితాను కమిషన్ వెల్లడించనుంది. 17న హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్, 19న ఎక్స్టెన్షన్ ఆఫీసర్ తుది ఫలితాలను టీజీపీఎస్సీ విడుదల చేయనుంది.








