Mahaa Daily Exclusive

  దిల్లీలో సీఐఎస్ఎఫ్ నూతన ప్రధాన కార్యాలయానికి శంకుస్థాపన…

Share

దిల్లీలో సీఐఎస్ఎఫ్ నూతన ప్రధాన కార్యాలయానికి శంకుస్థాపన.
*రేపు పునాదిరాయి వేయనున్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా.
* అత్యాధునిక హంగులతో కొత్త భవన నిర్మాణం.
ఢిల్లీ, మహా.
దేశ రాజధాని దిల్లీలో సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్ఎఫ్) నూతన ప్రధాన కార్యాలయ భవన నిర్మాణానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా సోమవారం శంకుస్థాపన చేయనున్నారు. దేశవ్యాప్తంగా విమానాశ్రయాలు, మెట్రో రైళ్లు, ఇతర కీలక ప్రభుత్వ, ప్రైవేటు పరిశ్రమలకు అత్యున్నత భద్రత కల్పిస్తున్న సీఐఎస్ఎఫ్ మౌలిక సదుపాయాలను మరింత బలోపేతం చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ కొత్త భవనాన్ని అత్యాధునిక సాంకేతిక హంగులు, విశాలమైన వసతులతో నిర్మించనున్నారు.
జాతీయ భద్రతలో అత్యంత కీలక పాత్ర పోషిస్తున్న కేంద్ర సాయుధ పోలీసు బలగాల (సీఏపీఎఫ్) సంక్షేమం, కార్యాలయాల ఆధునీకరణపై కేంద్ర హోంశాఖ ప్రత్యేక దృష్టి సారించింది. ఇందులో భాగంగానే ఎప్పటికప్పుడు పెరుగుతున్న భద్రతా అవసరాలు, సిబ్బంది పరిపాలనా సౌలభ్యం కోసం సీఐఎస్ఎఫ్ ప్రధాన కార్యాలయానికి ప్రత్యేకంగా ఈ కొత్త భవనాన్ని మంజూరు చేశారు. రేపు లాంఛనంగా జరగనున్న ఈ శంకుస్థాపన కార్యక్రమానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో పాటు హోంశాఖ ఉన్నతాధికారులు, సీఐఎస్ఎఫ్ డైరెక్టర్ జనరల్, ఇతర ఉన్నత స్థాయి భద్రతా అధికారులు హాజరుకానున్నారు. అత్యంత పకడ్బందీ భద్రతా ఏర్పాట్ల నడుమ ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.