సీనియర్ ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ చిక్కుల్లో పడ్డారు. ఆమెకు నోటీసు జారీకి జయశంకర్ యూనివర్సిటీ రంగం సిద్ధం చేసింది. యూనివర్సిటీ నుంచి వాహన అద్దెకు నిధులు తీసుకోవడంపై ఆడిట్ విభాగం అభ్యంతరం తెలిపింది. ఆడిట్ అభ్యంతరంతో స్మితా సబర్వాల్‌కు నోటీసులు ఇవ్వాలని జయశంకర్ యూనివర్సిటీ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. వాహన అద్దె కింద తీసుకున్న నిధులు తిరిగి చెల్లించాలంటూ వర్సిటీ ఒకటి రెండు రోజుల్లో స్మితా సబర్వాల్‌కు నోటీసులు జారీ చేయనున్నట్లు తెలిసింది. వాహన అద్దె కింద తీసుకున్న రూ. 61 లక్షలపై ఆడిట్ విభాగం అభ్యంతరం తెలిపింది. 2016 – 2024 మధ్య 90 నెలలపాటు సీఎంవో అదనపు కార్యదర్శి హోదాలో స్మితా సబర్వాల్ వాహన అద్దె తీసుకున్నారు. అద్దె చెల్లింపు కింద నెలకు రూ. 63 వేలు తీసుకున్నారు. వాహన అద్దెపై ఆడిట్ అభ్యంతరం వ్యక్తం చేయడం నిజమేనని ప్రొఫెసర్ జయశంకర్ యూనివర్సిటీ స్పష్టం చేసింది. న్యాయ నిపుణుల సూచనల మేరకు చర్యలు తీసుకుంటామని వర్సిటీ వీసీ వెల్లడించారు. కాగా, స్మితా సభర్వాల్ అద్దెకు తీసుకున్న టీఎస్ 08 ఈసీ 6345 వాహనం నాన్ టాక్స్ కాదు, ఎల్లో ప్లేట్ కాకపోవడం గమనార్హం. ప్రైవేట్ వ్యక్తిగత వాహనం. ఆ వాహనం పవన్ కుమార్ పేరిట ఉన్నట్లు ఆడిట్ విచారణలో తేలింది. సీఎంవోలోని స్మితా సబర్వాల్ కార్యాలయం నుంచి ప్రతినెలా వాహనం అద్దే రశీదులు రావడంతో యూనివర్సిటీ యాజమాన్యం డబ్బులు చెల్లించినట్లు వెల్లడైంది. ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ యూనివర్సిటీ పనితీరుపై ఇటీవలే ఏజీ జరిపిన విచారణలో కొన్ని అవకతవకలు జరిగినట్లు తేలాయి. ఈ విషయం నిజమేనని వీసీ అల్తాస్ జానయ్య తెలిపారు. ఈ విషయంపై సమగ్ర నివేదిక రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించనున్నట్లు చెప్పారు. ప్రభుత్వ పెద్దలు, న్యాయ నిపుణుల సూచనల మేరకు తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు.








