Mahaa Daily Exclusive

  హైదరాబాద్ కు పెద్ద పీట వేసిన ఆర్థిక మంత్రి భట్టి మూసీ, హైడ్రాలపై ప్రత్యేక దృష్టి…!

Share

బడ్జెట్‌లో తెలంగాణ గుండెకాయ హైదరాబాద్ నగరాభివృద్ధికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిచ్చింది. ఎన్నడూ లేని విధంగా ఈ బడ్జెట్​లో భారీగా నిధులు కేటాయించింది. జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, జలమండలి, మెట్రో రైల్​తో పాటు మూసీ ప్రక్షాళన, హెచ్​-సిటీ, ఫోర్త్‌ సిటీల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టిసారించింది. మూసీ రివర్‌ ఫ్రంట్‌తో పాటు హెచ్​-సిటీ, నగరవాసుల దాహర్తి తీర్చేందుకు సుంకిశాల నీటి తరలింపునకు ప్రభుత్వం బడ్జెట్‌లో గణనీయంగా నిధులు కేటాయించింది. ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణానికి కూడా భారీగా నిధులను బడ్జెట్‌లో పొందుపరిచారు. హైదరాబాద్ మహానగరాభివృద్ధి కోసం ఎప్పుడు లేని విధంగా 10 వేల కోట్లకు పైగా కేటాయించింది. దేశంలోని ప్రధాన నగరాల్లో ఒకటైన హైదరాబాద్ అన్ని రంగాల్లో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న దృష్ట్యా ప్రజలకు మెరుగైన సేవలను అందించేందుకు నిధుల కేటాయింపుపై ప్రత్యేక దృష్టి సారించింది. పారిశుద్ధ్యం, మురుగు నీరు, తాగునీటి వ్యవస్థలు గత పదేళ్లలో అత్యంత నిర్లక్ష్యానికి గురైనట్లు విమర్శించిన ప్రభుత్వం మితి మీరిన కాలుష్యంతో మూసీ, హుస్సేన్ సాగర్ విషతుల్యంగా మారాయని తెలిపింది.

హైడ్రాకు రూ.218కోట్లు

ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు జీహెచ్ఎంసీ పరిధిలో మౌలిక వసతుల కల్పనకు 2 వేల 65 కోట్లు, హెచ్ఎండీఏ కు 700 కోట్లు, తాగునీరు, మురుగునీటి వ్యవస్థను మెరుగుపర్చడానికి జలమండలికి 3 వేల50 కోట్లను ఈ బడ్జెట్​లో ప్రతిపాదించింది. అలాగే ప్రభుత్వ ఆస్తులు, భూములు పరిరక్షణతో పాటు విపత్తుల నిర్వహణ కోసం ఏర్పాటు చేసిన హైడ్రాకు కూడా ప్రత్యేకంగా రూ.218 కోట్లు కేటాయించింది. మెట్రో రైలు రెండో దశ విస్తరణలో భాగంగా ఎయిర్ పోర్టు వరకు మెట్రో విస్తరణకు 100 కోట్లు, హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టుకు 500 కోట్లు, ఓల్డ్ సిటీలో మెట్రో విస్తరణకు 500 కోట్లు, మల్టీ మోడల్ సబర్బన్ రైలు ట్రాన్స్ పోర్టు సిస్టమ్ కోసం 50 కోట్లతో పాటు ఔటర్ రింగు రోడ్డు అభివృద్ధి కోసం 200 కోట్ల రూపాయల నిధులను కేటాయించింది.

మూసీ ప్రక్షాళనకు రూ.1500 కోట్లు

మూసీ ప్రక్షాళనకు తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని పదే పదే చెబుతున్న సర్కార్, మూసీ రివర్ ఫ్రంట్ డెవల్మెంట్ ప్రాజెక్టు కోసం రూ.1500 కోట్లు కేటాయించింది. ఈ ప్రాజెక్టు వల్ల సుమారు 110 చదరపు కిలోమీటర్ల పట్టణ ప్రాంతం పునరుజ్జీవం అవుతుందని, అలాగే నదీ తీర ప్రాంతంలో కొత్త వాణిజ్య, నివాస కేంద్రాలు వెలిసి పాత చారిత్రక ప్రాంతాలు కొత్తదనాన్ని సంతరించుకుంటాయని ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేస్తోంది. రాష్ట్రంలో పేదల దవాఖానగా గుర్తింపు పొందిన ఉస్మానియా ఆసుపత్రి భవనాల నిర్మాణానికి ప్రభుత్వం బడ్జెట్‌లో ప్రత్యేక కేటాయింపులు చేసింది. ఇటీవలే గోషామహల్‌ స్టేడియంలో భవనాల నిర్మాణానికి గాను రూ.2700 కోట్లు ఖర్చు చేస్తున్నామని ఆర్ధికమంత్రి భట్టి విక్రమార్క బడ్జెట్‌ ప్రసంగంలో వెల్లడించారు. హెచ్​-సిటీ ఏర్పాటుకు రూ. రూ.2654 కోట్లు : నగరంలో ట్రాఫిక్ నియంత్రణ, మౌలిక సదుపాయాల కల్పనకు హెచ్-​సిటీ ఏర్పాటు చేయనున్నారు. ఇందులో భాగంగా 31 ఫ్లై ఓవర్లు, 17 అండర్‌పాస్‌లు నిర్మించనున్నారు. ఆ పనులకు గాను బడ్జెట్‌లో రూ.2654 కోట్లు కేటాయించారు. అదేవిధంగా రూ.150 కోట్లతో సుందరీకరణ పనులు చేపట్టనున్నారు. నగరంలోని శివారు ప్రాంతాల్లో సోలార్, విండ్ ఎనర్జీ ప్రాజెక్టులను నెలకొల్పనున్నారు. ముచ్చర్లలో యంగ్ ఇండియా టెక్నికల్ యూనివర్సిటీ ఏర్పాటు, 200 ఎకరాలలో ఏఐ సిటీ ఏర్పాటుకు ప్రణాళిక రూపొందించినట్లు భట్టి వివరించారు.