ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ప్రధాన నిందితుడు, స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ (ఎస్ఐబీ) మాజీ ఓఎస్డీ ప్రభాకర్‌రావు, మరో ముఖ్య నిందితుడు అరువెల శ్రవణ్‌రావును విదేశాల నుంచి రప్పించేందుకు మార్గం సుగమమైంది. వారిద్దరిపై రెడ్‌కార్నర్ నోటీసు జారీ అయింది. ఈ మేరకు ఇంటర్నేషనల్ పోలీస్ (ఇంటర్‌పోల్) నుంచి సీబీఐ ద్వారా తెలంగాణ సీఐడీకి తాజాగా సమాచారం అందింది. ఈ నేపథ్యంలో వారిద్దరిని వీలైనంత తొందరగా తీసుకొచ్చే విషయమై హైదరాబాద్ పోలీసులు కేంద్ర హోం, విదేశీ వ్యవహారాల శాఖల ద్వారా సంప్రదింపులను ముమ్మరం చేశారు. రెడ్‌కార్నర్ నోటీసుల జారీ అంశాన్ని యునైటెడ్ స్టేట్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ హోంల్యాండ్ సెక్యూరిటీకి సమాచారం అందించే పనిలో నిమగ్నమయ్యారు. ఈ సమాచారం డీహెచ్ఎస్కు చేరితే వారిద్దరిని అమెరికాలో ప్రొవిజినల్ (తాత్కాలిక) అరెస్ట్ చేయొచ్చు. అనంతరం డిపోర్టేషన్ ప్రక్రియ ద్వారా భారత్‌కు పంపించే అవకాశముంది. అయితే ప్రొవిజినల్ అరెస్ట్‌ను అక్కడి న్యాయస్థానంలో వారు సవాల్ చేసే అవకాశం లేకపోలేదు. రాజకీయ కక్ష సాధింపులో భాగంగా తమను వేధిస్తున్నారని నిందితులు పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో అక్కడి న్యాయస్థానం ఆ అంశాన్ని పరిగణనలోకి తీసుకోవచ్చని భావిస్తున్నారు. అక్కడ ఊరట లభించకపోతే డిపోర్ట్ చేయడం ఖాయమనిపిస్తోంది.







