లిస్ట్-ఎ క్రికెట్‌లో సరికొత్త ప్రపంచ రికార్డు.
* కౌశల్య వీరరత్నే 21 ఏళ్ల నాటి రికార్డును బద్దలు కొట్టిన వైభవ్ సూర్యవంశీ!
* కేవలం 11 బంతుల్లోనే హాఫ్ సెంచరీ.
* లంక బౌలర్లపై టీమిండియా యువ సంచలనం ఊచకోత.
* ఆసియా క్రీడల ఎంపిక వేళ సిరీస్ ఫైనల్లో 29 బంతుల్లో 94 పరుగులతో విధ్వంసం.
ఢిల్లీ, మహా.
భారత క్రికెట్ యువ సంచలనం, టీనేజ్ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ అంతర్జాతీయ క్రికెట్ యవనికపై సరికొత్త చరిత్ర సృష్టించాడు. శ్రీలంక-ఎ జట్టుతో జరిగిన ముక్కోణపు వన్డే సిరీస్ ఫైనల్ మ్యాచ్‌ను ఈ బుడ్డోడు తన రికార్డుల వేటకు వేదికగా మార్చుకున్నాడు. మైదానంలోకి అడుగుపెట్టిన క్షణం నుంచే లంక బౌలర్లపై నిర్దాక్షిణ్యంగా విరుచుకుపడుతూ లిస్ట్-ఎ క్రికెట్ చరిత్రలోనే ఎవరూ ఊహించని సరికొత్త ప్రపంచ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ చారిత్రాత్మక తుదిపోరులో కేవలం 11 బంతుల్లోనే హాఫ్ సెంచరీ (అర్ధశతకం) మార్కును అందుకోవడం ద్వారా.. లిస్ట్-ఎ క్రికెట్‌లో అత్యంత వేగంగా ఈ ఘనత సాధించిన ప్రపంచపు మొట్టమొదటి ఆటగాడిగా వైభవ్ రికార్డు పుటల్లోకి ఎక్కాడు. దీనితో శ్రీలంక ఆటగాడు కౌశల్య వీరరత్నే (12 బంతుల్లో) పేరిట సుమారు 21 ఏళ్లుగా చెక్కుచెదరకుండా ఉన్న ఆల్‌టైమ్ రికార్డును ఈ భారత యువ కిరణం అత్యంత లీలాజాలంగా బద్దలు కొట్టాడు.
**29 బంతుల్లో 94 పరుగులు.. మైదానంలో సిక్సర్ల వర్షం**
ఫైనల్ మ్యాచ్‌లో లంక టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోగా, భారత ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన వైభవ్ సూర్యవంశీ మొదటి బంతి నుంచే టి-20ని మించిన రీతిలో విధ్వంసానికి తెరలేపాడు. లంక బౌలర్లు వేసిన బంతులను బౌండరీలే లక్ష్యంగా బాదుతూ స్టేడియాన్ని హోరెత్తించాడు. ఈ క్రమంలో కేవలం 29 బంతులు మాత్రమే ఎదుర్కొన్న వైభవ్.. ఏకంగా 94 పరుగులు సాధించి లంక శిబిరంలో వణుకు పుట్టించాడు. ఈ మెరుపు ఇన్నింగ్స్‌లో 10 అద్భుతమైన ఫోర్లు, 8 ఆకాశాన్నంటే భారీ సిక్సర్లు ఉండటం విశేషం. స్ట్రైక్ రేట్ పరంగా చూస్తే ప్రత్యర్థి జట్టుకు అసలు కోలుకునే అవకాశమే ఇవ్వకుండా ఒంటిచేత్తో మ్యాచ్‌ను పూర్తిగా భారత వైపు తిప్పేశాడు.
**ఇన్‌స్టాగ్రామ్ ఛాలెంజ్ టు ‘ప్రతీకారం’.. తృటిలో చేజారిన సెంచరీ**
ఈ నమ్మసక్యం కాని ఇన్నింగ్స్ వెనుక ఒక ఆసక్తికరమైన నేపథ్యం ఉంది. ఈ సిరీస్ గత లీగ్ మ్యాచ్‌లో లంక జట్టుతో జరిగిన సూపర్ ఓవర్‌లో భారత్ ఓటమి పాలవడంతో పాటు, ఆ సమయంలో మైదానంలో ఇరు జట్ల ఆటగాళ్ల మధ్య తీవ్ర ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంది. ఆ పరాభవాన్ని, లంక ఆటగాళ్ల ప్రవర్తనను మనసులో ఉంచుకున్న వైభవ్.. ఈ ఫైనల్ మ్యాచ్‌కు కొన్ని గంటల ముందే తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కేవలం ‘100’ అని రాసి లంక జట్టుపై ప్రతీకారానికి సిద్ధమయ్యాడు. ఊహించినట్లుగానే లంక బౌలింగ్ లైన్‌ను చీల్చిచెండాడుతూ కసిగా సెంచరీ దిశగా దూసుకెళ్లాడు. అయితే, ఇన్నింగ్స్ 9వ ఓవర్లో లంక కెప్టెన్ సహన్ అరాచ్చిగే వేసిన బంతికి అవుట్ కావడంతో, కేవలం 6 పరుగుల స్వల్ప దూరంలో చారిత్రాత్మక శతకాన్ని చేజార్చుకున్నాడు. అయినప్పటికీ అతడు సృష్టించిన విధ్వంసం లంక జట్టు ఆత్మవిశ్వాసాన్ని పూర్తిగా దెబ్బతీసింది.
**సెలెక్టర్ల నమ్మకాన్ని నిజం చేస్తూ..**
ఇటీవలే భారత సీనియర్ టి-20 జట్టుతో పాటు ప్రతిష్టాత్మక ‘ఆసియా క్రీడలు 2026’కు తొలిసారిగా ఎంపికై సంచలనం సృష్టించిన వైభవ్ సూర్యవంశీ.. ఈ అద్భుత ఇన్నింగ్స్‌తో తనపై సెలెక్టర్లు ఉంచిన నమ్మకాన్ని వంద శాతం నిజం చేశాడు. దేశవాళీలోనే కాకుండా అంతర్జాతీయ వేదికలపై కూడా ఒత్తిడిని అధిగమించి ఏ రకమైన భయం లేకుండా ఆడగలనని ఈ ఇన్నింగ్స్ ద్వారా నిరూపించాడు. ఇప్పటికే పలు రికార్డులను తన పేరిట లిఖించుకున్న ఈ యంగ్ ఓపెనర్.. భవిష్యత్తులో భారత సీనియర్ జట్టులో మరింత కీలక పాత్ర పోషించనున్నాడనడంలో ఎలాంటి సందేహం లేదని క్రీడా విశ్లేషకులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.







