పశ్చిమ బెంగాల్‌లో నెత్తురోడిన రహదారి.
* ఘోర రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మృతి.
* ఆగి ఉన్న ట్రక్కును బలంగా ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.
* మరో 17 మందికి తీవ్ర గాయాలు.. పలువురి పరిస్థితి విషమం
* బురదమయమైన రోడ్లే ప్రమాదానికి కారణమంటున్న స్థానికులు.
జల్పాయ్‌గురి:మహా.
పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న ఓ ఆర్టీసీ బస్సు అదుపుతప్పి రోడ్డు పక్కన ఆగి ఉన్న ట్రక్కును బలంగా ఢీకొట్టడంతో ఐదుగురు అమాయకులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ హృదయ విదారక ఘటనలో మరో 17 మంది ప్రయాణికులు తీవ్ర గాయాలపాలయ్యారు. వర్షాల కారణంగా రోడ్లు బురదమయంగా మారడమే ఈ ఘోర ప్రమాదానికి దారితీసిందని స్థానికులు చెబుతున్నారు. ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలను పోలీసులు వెల్లడించారు.
పోలీసుల కథనం ప్రకారం.. ఆదివారం నార్త్ బెంగాల్ స్టేట్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ కు చెందిన బస్సు మొత్తం 23 మంది ప్రయాణికులతో మైనాగురి నుంచి డోమోహనికి బయలుదేరింది. బస్సు ఉల్లదబారి ప్రాంతానికి చేరుకోగానే ఒక్కసారిగా అదుపుతప్పింది. అదే వేగంతో దూసుకెళ్లి రోడ్డు పక్కన నిలిపి ఉంచిన భారీ ట్రక్కును వెనుక వైపు నుంచి బలంగా ఢీకొట్టింది. ఢీకొట్టిన వేగానికి బస్సు ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జయ్యింది. ఈ భయానక ప్రమాదంలో బస్సు ముందు భాగంలో కూర్చున్న ఐదుగురు ప్రయాణికులు తీవ్ర గాయాలపాలై ఘటనా స్థలంలోనే దుర్మరణం చెందారు. మిగిలిన 17 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు.
ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, రెస్క్యూ సిబ్బంది స్థానికుల సహాయంతో బస్సులో చిక్కుకున్న క్షతగాత్రులను బయటకు తీసి సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారందరినీ తక్షణ వైద్య చికిత్స నిమిత్తం జల్పాయ్‌గురి మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌కు తరలించారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 17 మంది క్షతగాత్రులలో చాలా మంది పరిస్థితి అత్యంత విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. దీంతో ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఈ ఘోర ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు లోతైన దర్యాప్తును ముమ్మరం చేశారు. కాగా, ప్రమాదానికి గల కారణాలను ప్రత్యక్ష సాక్ష్యులు పోలీసులకు వివరించారు. గత కొద్దిరోజుల నుంచి ఈ ప్రాంతంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఆ రోడ్డు మొత్తం తీవ్ర బురదతో నిండిపోయిందని వారు తెలిపారు. రోడ్డుపై పేరుకుపోయిన ఈ బురద కారణంగానే వాహనాలు జారుతున్నాయని, ఈ క్రమంలోనే బస్సు టైర్లు జారి డ్రైవర్ స్టీరింగ్‌పై కంట్రోల్ కోల్పోయాడని సాక్ష్యులు పేర్కొన్నారు. ఆ తర్వాతే బస్సు అదుపుతప్పి నేరుగా వెళ్లి రోడ్డు పక్కన ఆపి ఉన్న ట్రక్కును ఢీకొట్టిందని వారు స్పష్టం చేశారు.







