కుమ్మక్కై నామినేషన్ తిరస్కరించాయి.
* సొంత పార్టీ నేతల ప్రమేయం లేదు.
* ఇదంతా కమలనాథుల కుట్రే.
* ప్రజాక్షేత్రంలోనే ఈ అన్యాయంపై తేల్చుకుంటానన్న మీనాక్షి నటరాజన్.
ఢిల్లీ, మహా.
తన రాజ్యసభ నామినేషన్ అకస్మాత్తుగా తిరస్కరణకు గురికావడంపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు, తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్ తీవ్ర అగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ, కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) రెండూ లాలూచీ పడి, అత్యంత కుట్రపూరితంగానే తన నామినేషన్‌ను తిరస్కరించాయని ఆమె తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. తనపై ఉద్దేశపూర్వకంగా తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడిన ఆమె.. చట్టబద్ధంగా తనకు దక్కాల్సిన రాజ్యసభ సీటును అక్రమంగా చోరీ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. నైతిక విలువలకు కట్టుబడి రాజకీయాలు చేసే తాను.. కేవలం పదవి కోసం వేరొకరితో బలవంతంగా రాజీనామా చేయించి తెలంగాణ నుంచి రాజ్యసభ సీటును దక్కించుకోలేనని, తాను మధ్యప్రదేశ్‌కు చెందిన వ్యక్తిని కాబట్టే అక్కడి నుంచే ప్రాతినిధ్యం వహించాలని కోరుకుంటానని ఆమె కుండబద్దలు కొట్టారు.
**నాపై ఎలాంటి లీగల్ కేసులు లేవు**
నామినేషన్ పత్రాల్లో ఉద్దేశపూర్వకంగానే తప్పుడు సమాచారం ఇచ్చానంటూ తనపై జరుగుతున్న దుష్ప్రచారంపై మీనాక్షి నటరాజన్ స్పష్టతనిచ్చారు. తనపై ఎలాంటి లీగల్ కేసులు లేవని ఆమె ఖరాఖండిగా చెప్పారు. అసలు ఎన్నికల సంఘం జారీ చేసిన నామినేషన్ పత్రంలో ‘లీగల్ నోటీస్’కు సంబంధించిన ప్రత్యేక కాలమ్ ఎక్కడా లేనేలేదని, అసలు ఫామ్‌లో లేని కాలమ్‌ను సాకుగా చూపి, కేవలం సాంకేతిక కారణాల పేరుతో తన నామినేషన్‌ను ఏకపక్షంగా తిరస్కరించడం పూర్తిగా రాజ్యాంగ విరుద్ధమని ఆమె మండిపడ్డారు. రాజకీయంగా ధైర్యంగా ఎదుర్కోలేక, ఉద్దేశపూర్వకంగానే బీజేపీ తనపై అబద్ధాలను సృష్టిస్తూ, తప్పుడు ప్రచారాలతో ప్రజలను పక్కదారి పట్టిస్తోందని ఆమె తీవ్రంగా విమర్శించారు.
**ఇదంతా బీజేపీ ఆడిన నాటకమే.. కాంగ్రెస్ నేతల పాత్ర లేదు**
తన నామినేషన్ తిరస్కరణ వెనుక సొంత పార్టీ నేతల హస్తం ఉందంటూ వస్తున్న పుకార్లను మీనాక్షి నటరాజన్ పూర్తిగా తోసిపుచ్చారు. తన నామినేషన్ తిరస్కరణలో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఏ ఒక్క నేత పాత్ర ఏమాత్రం లేదని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీలో ఎలాంటి వర్గపోరు లేదని, తమ పార్టీ అంతా ఏకతాటిపైనే బలంగా నిలబడిందని ఆమె ధీమా వ్యక్తం చేశారు. ఇదంతా కేవలం ప్రతిపక్షాల గొంతు నొక్కేందుకు బీజేపీ ఆడిన వికృత నాటకమని విమర్శించారు. స్వతంత్రంగా వ్యవహరించాల్సిన రాజ్యాంగ, ప్రజాస్వామ్య వ్యవస్థలను తమ గుప్పిట్లో పెట్టుకుని బీజేపీ చేస్తున్న కుట్రలను, సాగిస్తున్న అక్రమాలను ప్రజల ముందుకు తీసుకువెళ్లి ఎండగట్టడమే తన ప్రస్తుత పోరాట లక్ష్యమని మీనాక్షి స్పష్టం చేశారు.
**ప్రజా క్షేత్రంలోనే తేల్చుకుంటాం**
కేంద్ర ప్రభుత్వ అప్రజాస్వామిక ఒత్తిడికి పూర్తిగా లొంగిపోయిన ఎన్నికల సంఘం అత్యంత పక్షపాతంగా వ్యవహరించిందని మీనాక్షి నటరాజన్ ఆరోపించారు. కేవలం ప్రతిపక్ష నాయకులను లక్ష్యంగా చేసుకుని వేధించడమే అధికార పక్షం ఏకైక అజెండాగా పెట్టుకుందని ఆమె విమర్శించారు. అత్యంత ప్రజాస్వామికంగా, చట్టబద్ధంగా తనకు దక్కాల్సిన రాజ్యసభ స్థానాన్ని కుతంత్రాలతో, అధికార దుర్వినియోగంతో లాక్కున్నారని ఆమె దుయ్యబట్టారు. తనకు జరిగిన ఈ ఘోర అన్యాయంపై వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని, ఈ వ్యవహారాన్ని ఇంతటితో వదిలిపెట్టనని స్పష్టం చేశారు. ప్రజల మద్దతు కూడగట్టి, బీజేపీ అనుసరిస్తున్న ప్రజాస్వామ్య వ్యతిరేక, నిరంకుశ విధానాలపై అలుపెరగని పోరాటం కొనసాగిస్తానని, రాబోయే రోజుల్లో ప్రజా క్షేత్రంలోనే ఈ కుట్రలన్నింటినీ తేల్చుకుంటానని మీనాక్షి నటరాజన్ తేల్చిచెప్పారు.







