Mahaa Daily Exclusive

  బలహీనుడి చేతిలోని ఆయుధం అతని ఆయువుకే ప్రమాదం..!

Share

బలహీనుడి చేతిలోని ఆయుధం అతని ఆయువుకే ప్రమాదాన్ని కొనితెస్తుంది. ‘వేటు వెయ్యనా, వద్దా’ అని వీడు ఆలోచించేలోపే ఎదురుగా ఉన్న బలవంతుడు బలహీనుని చేతి నుండి దాన్ని లాక్కొని వాడ్ని వేసేస్తాడు వేటు!

23/3/25 రాత్రి నాలుగైదు రోజుల క్రితం విడుదలైన – ‘కోర్టు’ సినిమా చూశాను. Protection Of Children from Sexual Offences (POCSO) చట్ట దుర్వినియోగం గూర్చి తీసిన చిత్రమది. ‘చట్ట దుర్వినియోగం’ అనగానే Scheduled Castes &Scheduled Tribes Prevention of Atrocities Act (SCSTPoA Act) దుర్వినియోగం కూడా గుర్తొచ్చి, నా సమీక్షకు లీడ్ గా తొలి పేరా ను అలా మొదలుపెట్టాను.

సినిమాను – టీనేజర్స్ లవ్, కోర్టు స్క్రీన్, విలన్ రోల్ అనే మూడు భాగాలుగా విభజించి చూస్తే; టీనేజర్స్ లవ్ ట్రాక్ ను చాలా సమర్ధవంతంగా, సుందరంగా మలిచాడు దర్శకుడు. ఒక కాలేజ్ + టీనేజ్ అమ్మాయి (హీరోయిన్) యొక్క ఆకతాయి పని వల్ల హీరోతో మొదలైన పరిచయం – నెమ్మదిగా ప్రణయం వరకూ దారితీసిన పరిస్థితిని చాలా సజీవంగా చిత్రించాడు. టీనేజ్ అనగానే – ‘వయస్సు పెట్టే తొందర’ అనే వంకన జోడించే అశ్లీలతకు అసలు చోటివ్వకుండా హీరో, హీరోయిన్ల అమలిన ప్రణయాన్ని చక్కని స్నేహంగా చిత్రించారు. ఇక్కడ మరో విషయం చెప్పి తీరాలి. ‘వారసత్వ నటుల ఎబెట్టు నటన’ కన్నా ఈ టీనేజర్ పిల్లలిద్దరూ చాలా పరిపక్వతతో, చాలా ‘ఈజ్’ తో నటించారు. హీరోయిన్ గా చేసిన అమ్మాయి ఒక్కో ఫ్రేమ్ లో అచ్చం లావణ్య త్రిపాటి లా అనిపించింది. ఈ రెండు కారణాల వల్ల – హీరో హీరోయిన్లకు స్టార్ డం లేదన్న లోటు ఈ పిల్లలిద్దరి వల్లా తీరిపోయింది.

ఇక రెండో ముఖ్యమైన ట్రాక్ – కోర్టుట్రాక్! ప్రాసిక్యూషన్ లాయరు, డిఫెన్స్ లాయరు కూడబలుక్కుంటే, కుమ్మక్కు అయిపోతే – బక్కజీవులు ఎలాంటి విపత్కర పరిణామలు ఎదుర్కోవలసి వస్తోందోననే విషయం వద్ద మొదలైన న్యాయ విచారణ ప్రక్రియ……; అనుభవం లేకున్నా, తాను తీసుకొన్న కేసును కచ్చితంగా గెలిపించాలన్న ఓ యువ న్యాయవాది పడిన తపన వల్ల – అమాయకుడైన హీరో కేసు నుండి బయటపడే సన్నివేశం వరకూ అత్యంత ‘న్యాయరసకందాయం’గా సాగింది. ఈ న్యాయ విచారణ రెండు భాగాలుగా జరుగుతుంది.

రెండో భాగపు విచారణలో డిఫెన్స్ ప్రక్రియను ఆకాశానికెత్తటానికేమో; మొదటి భాగపు డిఫెన్స్ ప్రక్రియను మరీ పేలవం చేసేసారు. మొదటి భాగపు డిఫెన్స్ లో కూడా కొంత డ్రామా నడపొచ్చసలు. కానీ, దాన్ని పూర్తిగా డమ్మీ చేసి వదిలారు. ఆ లోటు స్పష్టంగా తెలిసిపోతుంది.

ఇకపోతే, రెండో భాగపు డిఫెన్స్ ప్రక్రియను పూర్తి స్థాయి ‘కంటెంట్ లోడెడ్ ఎపిసోడ్’ గా తీర్చిదిద్దడంలో దర్శకుని ప్రతిభ స్పష్టంగా కనబడుతుంది. మొదటి భాగపు విచారణ ప్రక్రియలో హర్షవర్ధన్ ప్రేక్షకుల అటెన్షన్ను డ్రా చేయగా; ఈ రెండో ఎపిసోడ్ మొత్తాన్ని – యువ న్యాయవాది పాత్రలో వర్ధమాన యువ నటుడు ప్రియదర్శి ‘హాం ఫట్’ మని మింగేశాడు.

అసలే మనకు తమిళనాడు కన్నా కూడా మాస్ ఆడియెన్స్ ఎక్కువ. అలాంటి సందర్భంలో – ఎక్కువ మందికి తెలియని న్యాయపరమైన విషయాలతో విచారణ ప్రక్రియను దీర్ఘసమయం సాగదీస్తే ప్రేక్షకులు బోర్ డమ్ ఫీల్ అయ్యే ప్రమాదముంది. అలాంటి ఫీల్ రాకుండా దర్శకుడు – ప్రేక్షకులకు న్యాయ సమాచారమందిస్తూ బహు నేర్పుగా రక్తి కట్టించాడు. ప్రేక్షకులు బహు శ్రద్ధగా స్పెల్ బౌండ్ అయ్యి తెరకు అతుక్కుపోయారు.

ఇక మూడో ముఖ్యమైన ట్రాక్ – విలనీ ట్రాక్!
సినిమా మీద కాస్తోకూస్తో నెగెటివ్ టాక్ వస్తే ఈ ట్రాక్ వల్లనే వచ్చే ప్రమాదముంది. భయంకరమైన అరుపులు అరిపించటం ద్వారా విలన్ను ‘శక్తివంతమైన విలన్’ గా ప్రతిస్టించాలనుకోవటం పొరపాటు. ఇక్కడో ఉదాహరణ గుర్తు చేసుకోవాలి. ఏదో ఓ పాత సినిమాలో సీనియర్ ఎన్టీఆర్ యస్వీఆర్ ల మధ్య సంవాదం ఉంటుంది. ఎన్టీఆర్ ఆరడుగుల డైలాగ్ చెబుతాడు. దానికి బదులుగా యస్వీఆర్ – ‘హు… బానిసలు’ అని ఒక్క అరముక్క డైలాగ్ తో నిరసించి కొట్టిపారేస్తాడు. ఆ డైలాగ్ కే థియేటర్లో చప్పట్లు ఎక్కువ పడ్డాయి, ఎస్వీఆర్ విలనీని మరింత పరిపుష్టం చేసింది ఆ సన్నివేశం. ఇప్పటికీ అప్పటి తరం వారు ఈ సన్నివేశాన్ని గుర్తు చేసుకొంటూంటారు.

ఈ ‘కోర్టు’ సినిమా విషయానికొస్తే – విలన్ ప్రారంభ సన్నివేశంలో తొలి డైలాగ్ గా అరచిన అరుపే ‘అతకని ముక్కలా’, ‘అరగని కక్కులా’ అత్యంత ఎబ్బెట్టుగా వి(క)నబడుతుంది. “ఏంటీ, మటన్ వేసుకోవాలా, మటన్? ఏంటి ఆ పిల్ల డ్రెస్ ఏంటి? ఆ పద్దతేంటి” అని చిన్న పిల్ల డ్రెస్ ను చూపిస్తూ అరచిన అరుపు పరమ కృతకంగా ఉంటుంది. ‘కనుచూపుతో చంపేసే ఫార్ములా’ను దర్శకుడు ఇక్కడెందుకు విలన్ కోసం వాడలేదో అర్థం కాదు.

బహుశా కచ్చితంగా ఇది దర్శకుని దోషం కాకపోవచ్చు. మూడింటా రెండు ట్రాక్లను అత్యంత నేర్పుగా చిత్రించిన దర్శకుడు ఈ మూడో(విలన్) ట్రాక్ విషయంలో తప్పు చేశాడంటే నమ్మబుద్ధికావటం లేదు. ‘సీనియర్ నటులము’ అన్న ట్యాగ్ తగిలించుకొన్న కొంతమంది నటులు – జూనియర్ దర్శకుని మాట వినక, సినిమా నిర్మాణంలో వేలెట్టి, అవసరమైతే కాలెట్టి సినిమాను తమ శక్తి వంచన లేకుండా కెలికి కెలికి పాడుజేసే సీనియర్ హీనియస్ నటులకు మనకు కొదువ లేదు. ఈ ట్రాక్ విషయంలోనూ అదే జరిగి ఉంటుందని నా ఫీలింగ్.

వాస్తవానికి – తమ కుటుంబ పరువు నిలబెట్టుకోవడానికి మాత్రమే విలన్ హీరో మీద అక్రమ కేసులు బనాయిస్తాడనేది సినిమా థీమ్ అయినప్పటికీ; దానికి భిన్నంగా – శివాజీ అనే – ‘పార్ట్ టైం పొలిటీషియన్ turned చోటా నటుడు’ చేసిన ‘అతి నటన’ వల్ల…… ‘తన సోదరి కుటుంబంపై తన కక్షను తీర్చుకొంటున్నాడా’ అనే అనవసరపు కొత్త సందేహం ప్రేక్షకుడికి కలగక మానదు. ఈ ట్రాక్ లో శివాజీ చేసిన ఈ అతి ఒక్కటీ తప్పితే సినిమా ఆద్యంతం ప్రేక్షకుల్ని కట్టిపడేసే ఉంచుతుంది. అయితే – ఈ ఎపిసోడ్ చివ్వరిలో విలన్ శివాజీని తన సోదరి పాత్ర చాచి చెంప మీద కొట్టే సన్నివేశం ఈ ట్రాక్ మొత్తానికి చెంపపెట్టుగా సింబాలిక్ గా కుదిరింది.

సినిమా రివ్యూలు రాయటం నా ఉద్యోగం కాదు. కానీ, ఇంత శ్రమ తీసుకొని ఎందుకు రాయాల్సి వస్తుందంటే – ఇది ఒక సామాజిక ప్రయోజనమున్న చిత్రం. సమాజంలో బలహీన వర్గాల రక్షణ కోసం రూపొందించబడ్డ చట్టాలు ఎలా దుర్వినియోగం అవుతున్నాయో కళ్ళకు కట్టినట్టు చూపించే చిత్రం.

‘ప్రయోగాత్మక చిత్రాలకు పైసలు రావు’ అనే సంప్రదాయ ఆలోచన్ను సవాలు చేస్తూ నిర్మించబడిన సందేశాత్మక, విద్యాయుత సినిమా. చిన్న నిర్మాతలు, చిన్న దర్శకులతో శ్రద్ధాపూర్వకంగా నిర్మించబడిన చిత్రంను పదిమందికీ పరిచయం చేయాలన్న దృష్టి కోణంతోనే ఈ పరిచయం లేదా రివ్యూ రాయటం జరిగింది.

సినిమాలో – కేసు విచారణ అంతా పూర్తయ్యాక చాలా ముఖ్యమైన విషయాన్ని ప్రస్తావిస్తాడు యువ న్యాయవాది. “ఎవరిని లక్ష్యించి చట్టం చేసామో, ఆ చట్టం మీద ఆ లక్ష్యిత సమూహానికి కూడా అవగాహన కల్పించకపోతే ఎలా మిలార్డ్?” అంటూ…. పరోక్షంగా; – “అందుకే బలహీన వర్గాల కోసం రూపొందించబడిన చట్టాలు అలక్ష్యిత దుష్ట శక్తులు దుర్వినియోగ పరుస్తున్నాయి” అనే విషయాన్ని చెబుతాడు.

ఒక్క POCSO చట్టం విషయంలో మాత్రమే కాదు; SCSTPOA విషయంలో కూడా ఈ దుర్వినియోగం అనేది తరచూ కనబడుతూ ఉంటుంది. అందుకే ‘ఒక బలమైన ఆయుధాన్ని కలిగిన వాడు, దాన్ని సక్రమంగా వాడుకోవటంలో కూడా నేర్పు సాధించాలి. లేకుంటే బలహీన్యుని చేతిలో ఉన్న అట్టి పదునైన ఆయుధాన్ని బలవంతుడు అతి లాఘవంగా లాక్కొని, బలహీనునిపై ఎక్కుపెట్టే ప్రమాదముంది’ అనే సందేశాన్ని అన్యాపదేశంగా చెబుతాడు దర్శకుడు.

దర్శకుడు కొత్తవాడో పాత వాడో నాకు తెలియదు గానీ; సినిమాను ఆద్యంతం ఆకర్షణీయంగా తీర్చిదిద్దుటలో అతని నేర్పు అణువణువు కనిపిస్తుంది. సినిమాకు శుభం కార్డు పడిన తర్వాత ప్రేక్షకులు స్పెల్ బౌండ్ అయ్యి, భారమైన మనస్సుతో హాలు బయట వచ్చే సన్నివేశమే దీనికి సాక్ష్యం! ఇలాంటి మంచి సినిమాను సినీ కథానాయకుడు నానీ నిర్మించటం బహు అభినందనీయం, ఆనందదాయకం!! వినోదానికే విజ్ఞానం కోసం కూడ ఈ చిత్రాన్ని కుటుంబ సమేతంగా చూడ్డం అవసరం!!!

 

గమనిక: ఈ సమీక్ష 25వ తేదీన ప్రచురించడానికి 24వ తేదీనే రాసినా; పాస్టర్ పగడాల ప్రవీణ్ మరణ దురంతం దృష్ట్యా 25,26 తేదీల్లో ప్రచురించటం భావ్యం కాదని ఆపి; ఈ వ్యాసాన్ని ఆయనకే అంకితమిస్తూ నేడు అనగా 27/3/’25 ప్రచురిస్తున్నాను.
//మారాజ్//