Mahaa Daily Exclusive

  రైతుల ఖాతాల్లోకి ‘పీఎం కిసాన్’ నిధులు…

Share

రైతుల ఖాతాల్లోకి ‘పీఎం కిసాన్’ నిధులు.
* 23వ విడత కింద రూ. 18,880 కోట్లు విడుదల చేసిన ప్రధాని మోదీ.
* పశ్చిమ బెంగాల్‌లోని తారకేశ్వర్ వేదికగా బటన్ నొక్కిన ప్రధానమంత్రి.
ఢిల్లీ, మహా.
దేశవ్యాప్తంగా ఉన్న అన్నదాతలకు కేంద్ర ప్రభుత్వం మరోసారి తీపికబురు అందించింది. ప్రతిష్టాత్మక ‘ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి’ (పీఎం కిసాన్) యోజన కింద 23వ విడత నిధులను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధికారికంగా విడుదల చేశారు. పశ్చిమ బెంగాల్‌లోని హుగ్లీ జిల్లా తారకేశ్వర్ వేదికగా జరిగిన సభలో ఆయన బటన్ నొక్కి రైతుల బ్యాంకు ఖాతాల్లోకి నేరుగా నగదును బదిలీ చేశారు. ఈ తాజా విడత ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న అర్హులైన 9.44 కోట్ల మందికి పైగా రైతుల ఖాతాల్లో రూ. 2,000 చొప్పున మొత్తం రూ. 18,880 కోట్లు జమయ్యాయి.
తాజాగా విడుదల చేసిన ఈ 23వ విడత నిధుల్లో మహిళా రైతులకు విశేష ప్రాధాన్యం దక్కడం గమనార్హం. దేశవ్యాప్తంగా సుమారు 2.18 కోట్ల మంది మహిళా రైతులకు ఈ దఫాలో నేరుగా ఆర్థిక లబ్ధి చేకూరింది. వ్యవసాయ రంగంలో పెట్టుబడి సాయం కింద అన్నదాతలకు అండగా నిలిచేందుకు కేంద్ర ప్రభుత్వం 2019 ఫిబ్రవరిలో ఈ పీఎం కిసాన్ పథకాన్ని ప్రారంభించిన విషయం విదితమే. ఈ పథకం ఆవిర్భావం నుంచి ఇప్పటివరకు దేశవ్యాప్తంగా ఉన్న రైతులకు కేంద్రం అందించిన మొత్తం ఆర్థిక సాయం ఏకంగా రూ. 4.46 లక్షల కోట్లు దాటడం విశేషం.
రైతుల ఖాతాల్లోకి నేరుగా నగదు బదిలీ చేయడంతో పాటు, వ్యవసాయ రంగాన్ని మరింత బలోపేతం చేసే దిశగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పలు కీలక అడుగులు వేశారు. పశ్చిమ బెంగాల్ రాష్ట్ర వ్యవసాయ రంగానికి ఊతమిచ్చేలా పలు నూతన ప్రాజెక్టులకు, కీలక పథకాలకు ఈ సందర్భంగా ఆయన శ్రీకారం చుట్టారు. ముఖ్యంగా వ్యవసాయంలో ఆధునిక సాంకేతికతను జోడించి, డిజిటల్ విప్లవాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో పలు అభివృద్ధి కార్యక్రమాలను మోదీ లాంఛనంగా ప్రారంభించారు.