పాక్‌లో నెత్తురోడిన రహదారి.
* ఉగ్ర ఘాతుకానికి ఏడుగురు బలి.
* ఖైబర్ పఖ్తూన్‌ఖ్వా ప్రావిన్స్‌లో వరుస పేలుళ్లు.
* ప్రయాణికులు, సహాయకులే లక్ష్యంగా దారుణం.
ఢిల్లీ, మహా.
పాకిస్థాన్‌లోని ఖైబర్ పఖ్తూన్‌ఖ్వా ప్రావిన్స్‌లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. శనివారం మధ్యాహ్నం బన్నూ జిల్లా పరిధిలోని మార్కా బేరా ప్రాంతంలో జరిగిన రెండు భారీ పేలుళ్లలో ఏడుగురు ప్రాణాలు కోల్పోగా ,మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. అత్యంత పాశవికంగా అమాయక ప్రయాణికులను, ఆపదలో ఉన్నవారికి సహాయం చేసేందుకు వచ్చిన స్థానికులను లక్ష్యంగా చేసుకుని దుండగులు ఈ మారణకాండకు ఒడిగట్టారు.
బన్నూ జిల్లా పోలీసు అధికారి (డీపీవో) యాసిర్ అఫ్రిది తెలిపిన వివరాల ప్రకారం.. హతి ఖేల్ గ్రామం నుంచి బన్నూ నగరానికి ప్రయాణికులతో వెళ్తున్న ఓ వాహనం మార్కా బేరా వద్దకు రాగానే, రోడ్డు పక్కన ముందుగానే అమర్చిన ఐఈడీ (ఇంప్రూవైజ్డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైస్) ఒక్కసారిగా పేలిపోయింది. ఈ భీకర పేలుడు ధాటికి వాహనంలో ఉన్న ఐదుగురు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. ఈ దుర్ఘటన జరిగిన వెంటనే క్షతగాత్రులను కాపాడే ఉద్దేశంతో పెద్ద ఎత్తున స్థానికులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. సరిగ్గా అదే సమయంలో అక్కడే ఉన్న మరో బాంబును ఉగ్రవాదులు పేల్చారు. ఈ రెండో దాడిలో సహాయక చర్యల్లో పాల్గొంటున్న మరో ఇద్దరు మృతి చెందారు. మొత్తంగా ఈ రెండు పేలుళ్లలో ఏడుగురు బలయ్యారు.
సమాచారం అందుకున్న వెంటనే భద్రతా దళాలు, పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను, గాయపడిన వారిని సమీప ఆసుపత్రికి తరలించారు. బాంబు పేలుళ్లపై కేసు నమోదు చేసి ముమ్మర దర్యాప్తు ప్రారంభించారు. అనంతరం మార్కా బేరా ప్రాంతాన్ని పూర్తిస్థాయిలో తమ ఆధీనంలోకి తీసుకుని జల్లెడ పడుతున్నారు. ఫోరెన్సిక్ బృందాలు రంగంలోకి దిగి పేలుడుకు సంబంధించిన కీలక సాక్ష్యాధారాలను సేకరిస్తున్నాయి. కాగా, ఈ అమానుష దాడికి ఇప్పటివరకు ఏ ఉగ్రవాద సంస్థా బాధ్యత వహించలేదు.
ఈ దారుణ ఘటనను ఖైబర్ పఖ్తూన్‌ఖ్వా ముఖ్యమంత్రి సోహైల్ అఫ్రిది తీవ్రంగా ఖండించారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులకు మెరుగైన వైద్య సహాయం అందేలా చూడాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. బాధితుల కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉండి ఆదుకుంటుందని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. ఈ ఉగ్ర దాడికి దారితీసిన పరిస్థితులు, భద్రతా వైఫల్యాలపై సమగ్ర దర్యాప్తు జరిపి, తక్షణమే పూర్తి నివేదికను సమర్పించాలని ఉన్నతాధికారులకు ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు.






