Mahaa Daily Exclusive

  కాంగ్రెస్ పాలనలో తూర్పు భారతం తీవ్ర నిర్లక్ష్యం.

Share

కాంగ్రెస్ పాలనలో తూర్పు భారతం తీవ్ర నిర్లక్ష్యం.
* ఒడిశాలో రూ.47,600 కోట్ల అభివృద్ధి పనులకు ప్రధాని శ్రీకారం.
* రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మోదీ.
ఢిల్లీ, మహా.
తూర్పు భారతదేశం కాంగ్రెస్ పాలనలో తీవ్ర నిర్లక్ష్యానికి గురైందని, కానీ నేడు అదే ప్రాంతం దేశ ప్రగతికి ప్రధాన ద్వారంగా మారుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. ఒడిశా రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా మయూర్‌భంజ్ జిల్లా రైరంగ్‌పుర్‌లో నిర్వహించిన ‘వికాస్ రా ధారా ఒడిశా సారా’సభలో ఆయన పాల్గొన్నారు. ఈ వేదికగా రాష్ట్రవ్యాప్తంగా వివిధ రంగాలకు చెందిన సుమారు రూ.47,600 కోట్లకు పైగా విలువైన అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రధాని మోదీ ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. ఈ ప్రతిష్ఠాత్మక కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ఒడిశా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ కూడా పాల్గొన్నారు. తూర్పు భారత అభివృద్ధే దేశ ప్రగతికి పునాదిగా భావించి కేంద్ర ప్రభుత్వం ‘పూర్వోదయ’ విధానాన్ని సమర్థవంతంగా అమలు చేస్తోందని ప్రధాని ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
**రూ.20 లక్షల కోట్ల పెట్టుబడి ప్రతిపాదనలు**
ఒడిశా రాష్ట్రం శరవేగంగా అభివృద్ధి చెందుతోందని ప్రధాని మోదీ ప్రశంసించారు. రాష్ట్రంలోని అపారమైన సహజ వనరులను అభివృద్ధికి అవకాశాలుగా మారుస్తున్నామని, దీనివల్ల కొత్త పరిశ్రమలు పుట్టుకొస్తున్నాయని తెలిపారు. ‘ఉత్కర్ష్ ఒడిశా’ లాంటి అద్భుతమైన కార్యక్రమాల ద్వారా దేశ, విదేశీ పెట్టుబడులను విశేషంగా ఆకర్షిస్తున్నామని, ఇప్పటికే దాదాపు రూ.20 లక్షల కోట్ల విలువైన పెట్టుబడి ప్రతిపాదనలు రాష్ట్రానికి వచ్చాయని ఆయన వెల్లడించారు. ఇటీవల గణ్ పర్బా ఉత్సవాలు ఘనంగా జరిగాయని, త్వరలో జరగనున్న జగన్నాథుడి రథయాత్ర, బారిపడ రథయాత్రల ఏర్పాట్లతో ఒడిశా పండుగల శోభను సంతరించుకుందని ఆయన గుర్తుచేశారు. ఈ ఆధ్యాత్మిక పండుగల వాతావరణంలోనే, అభివృద్ధి అనే ప్రజాస్వామ్య ఉత్సవం కూడా సమాంతరంగా కొనసాగుతోందని ఆయన అభివర్ణించారు.
**’సోలార్ విలేజ్’గా పహాడ్‌పుర్**
ఇదే వేదికపై నుంచి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు ప్రధాని మోదీ హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఒక సాధారణ ఒడిశా ముద్దుబిడ్డగా ప్రారంభమైన ఆమె ప్రస్థానం దేశ అత్యున్నత పదవికి చేరడం గర్వకారణమన్నారు. ముర్ము సేవా భావం, అంకితభావం యావత్ ఒడిశా రాష్ట్రానికే వన్నె తెచ్చాయని కొనియాడారు. రాష్ట్రపతి జన్మదినం నాడు ఆమె సొంతూరు పహాడ్‌పుర్ గ్రామాన్ని ఆమెతో పాటే కలిసి సందర్శించే అదృష్టం తనకు దక్కిందని మోదీ సంతోషం వ్యక్తం చేశారు. పహాడ్‌పుర్ గ్రామాన్ని త్వరలోనే పూర్తిస్థాయి ‘సోలార్ విలేజ్’గా తీర్చిదిద్దుతామని, గ్రామంలోని ప్రతి ఇంటికీ సౌర విద్యుత్ అందిస్తామని ఆయన ప్రకటించారు. కోణార్క్ సూర్య దేవాలయానికి ఉన్నంతటి అంతర్జాతీయ స్థాయి గుర్తింపు భవిష్యత్తులో పహాడ్‌పుర్ కూడా సొంతం చేసుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
**గిరిజనాభివృద్ధికి పెద్దపీట**
గిరిజన సమాజ అభ్యున్నతికే కేంద్ర ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇస్తోందని ప్రధాని స్పష్టం చేశారు. గిరిజన యువతకు నాణ్యమైన విద్య, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు దేశవ్యాప్తంగా ఇప్పటికే సుమారు 500 ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలలను ఏర్పాటు చేశామన్నారు. మయూర్‌భంజ్ ప్రజలతో తనకున్న ప్రత్యేక అనుబంధాన్ని ఆయన గుర్తుచేసుకున్నారు. కాగా, ఈ సభకు ముందు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ కలిసి పహాడ్‌పుర్ గ్రామంలోని గిరిజనుల పవిత్ర ఆరాధనా స్థలాలైన సంతాలి జాహిరా, హో జాహిరా వద్ద అత్యంత భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేశ శ్రేయస్సు, యావత్ భారత ప్రజల సుఖసంతోషాల కోసం వారు ఆకాంక్షించారు.