Mahaa Daily Exclusive

  మహిళలు తలుచుకుంటే సాధించలేనిది ఏదీ లేదు అవకాశాలు ఇవ్వాలేకానీ అద్భుతాలు సృష్టిస్తారు – నారా భువనేశ్వరి

Share

మహిళలు తలుచుకుంటే సాధించలేనిది ఏమీ లేదని, మహిళలకు అవకాశాలు ఇవ్వాలేకానీ అద్భుతాలు సృష్టిస్తారని నారా భువనేశ్వరి అన్నారు. మహిళలు వారి కాళ్లపై వారు నిలబడి ఆర్థికంగా బలోపేతం అవడం కోసమే సీఎం చంద్రబాబు డ్వాక్రా స్థాపించారని, మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదిగేందుకు కూటమి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని అన్నారు. కుప్పంలో ఎలీప్ ఆధ్వర్యంలో మహిళలకు 6 రోజులపాటు నిర్వహించే శిక్షణా తరగతులను గురువారం నారా భువనేశ్వరి ప్రారంభించారు. ఈ సందర్భంగా మహిళలను ఉద్ధేశించి మాట్లాడారు.

ఎలీప్ నా మనసు దోచుకుంది

మహిళల్లో ఉన్న ప్రతిభను వెలికితీసి, వారికి సరైన శిక్షణ అందించడం ద్వారా పారిశ్రామికవేత్తలుగా తయారు చేయడంలో ఎలీప్ చేస్తున్న కృషి నా మనసును దోచుకుందన్నారు. రమాదేవి ఆమె టీం సభ్యులందరూ ఎలీప్ ద్వారా అనేకమంది మహిళలను ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దారని గుర్తు చేశారు. అందుకోసం వారు హైదరాబాద్ లో ఇన్నాళ్లు చేసిన కృషి అమోఘం. అందుకు వారిని మనస్పూర్తిగా అభినందిస్తున్నానని అన్నారు.

మహిళలు ఉపాధి కల్పించే స్థాయికి ఎదగాలి

చంద్రబాబు హైదరాబాద్ లో ఎలీప్ ఏర్పాటు చేశారని, ఎలీప్ నా కళ్ల ముందు పుట్టి ఎదిగిందని, మహిళా పారిశ్రామిక వేత్తల కోసం కుప్పంలో ఎలీప్ ఏర్పాటు కాబోతోందన్నారు. దీని ద్వారా మహిళలు పారిశ్రామికవేత్తలుగా తయారై మరో పదిమందికి ఉద్యోగాలు కల్పించే స్థాయికి చేరుకుంటారన్నారు. స్త్రీలు శక్తిమంతులు. మగవారిని మించి పనిచేయగలరు, నేను ఇది చేయలేను అనే భయం లేకుండా ముందడుగు వేయాలని, అప్పుడే అద్భుతాలు సాధించగలరన్నారు. సాధారణ గృహిణిగా ఉన్న నాకు చంద్రబాబు హెరిటేజ్ బాధ్యతలు అప్పగించారని, అన్నీ స్వయంగా నేర్చుకున్నానని చెప్పారు. ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా మేము కూడా మహిళల ఆర్థిక స్వావలంబనకు పాటుబడుతున్నామని, వారి స్వయం ఉపాధికి చేయూత అందిస్తున్నామని పేర్కొన్నారు. ఎలీప్ ఏర్పాటు విషయంపై ఐఏఎస్ అధికారి వికాస్ తో ఎప్పటికప్పుడు మాట్లాడుతున్నానని, కుప్పం పరిధిలో పెద్ద పరిశ్రమలతో పాటు చిన్న తరహా పరిశ్రమలు కూడా రాబోతున్నాయన్నారు. వాటిలో పని చేయడం ద్వారా మహిళలకు ఆర్థిక వెసులుబాటు కలుగుతుందని నారా భువనేశ్వరి అన్నారు.