Mahaa Daily Exclusive

  విత్తనాలను అందుబాటులో ఉంచాలి వానాకాలం పంటలపై మంత్రి తుమ్మల సమీక్ష…!

Share

వానాకాలం 2025కు సంబంధించి విత్తనాల అవసరం, లభ్యత, సరఫరాపై రాష్ట్రస్థాయి వ్యవసాయాధికారులతో విత్తన కంపెనీ ప్రతినిధులతో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమీక్ష నిర్వహించారు. వానాకాలం 2025 లో 66.80 లక్షల ఎకరాలలో వరి, 6 లక్షల ఎకరాలలో మొక్కజొన్న, 50 లక్షల ఎకరాలలో ప్రత్తి, 9 లక్షల ఎకరాలలో సోయా చిక్కుడు సాగు అవుతుందని సమీక్షలో అధికారులు అంచనా వేశారు. దానికి తగ్గట్లుగా 16.70 లక్షల క్వింటాళ్ళ వరి విత్తనాలు, 0.48 లక్షల మొక్కజొన్న, 89 లక్షల ప్రత్తి ప్యాకేట్లు, 1.35 లక్షల క్వింటాళ్ళ సోయాచిక్కుడు విత్తనాలు అవసరమవుతాయని, వరిలో సన్న బియ్యం సాగు ఈ సారి ఇంకా పెరిగే అవకాశమున్నందున సన్నరకాల విత్తనాలను అధికమొత్తంలో అందుబాటులో ఉంచడానికి ఏర్పాట్లు చేశామని ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ డైరెక్టర్ గోపి చెప్పారు. 2.4 కోట్ల ప్రత్తి విత్తన ప్యాకేట్లు అందుబాటులో ఉంచడం జరుగుతుందని, జిల్లాల వారిగా, ప్రాంతాల వారిగా డిమాండ్ ఉన్న ప్రత్తి రకాలను అవసరం కంటే అధికమొత్తంలో తెప్పించి రైతులకు అందుబాటులో ఉంచడానికి కంపెనీలకు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగిందన్నారు. పచ్చిరొట్ట విత్తనాలకు సంబంధించి ఈ వానాకాలం కంటే ముందుగా ఎప్రిల్ మాసములోనే విత్తనాలు తెప్పించి అందుబాటులో ఉంచే విధంగా ఇప్పటికే టీజీ సీడ్స్ కు 1.94 లక్షల క్వింటాళ్ల పచ్చిరొట్ట విత్తనాల సరఫరాకు ప్రతిపాదనలు పంపించడం జరిగిందని, వీటి సరఫరాలో ఎక్కడా లోపాలు తలెత్తకుండా పకడ్బంది చర్యలు తీసుకుంటున్నామన్నారు.

మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ, గత అనుభవాల దృష్ట్యా డిమాండ్ ఉన్న రకాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, వరిపంట సాగుచేస్తున్న రైతుల నుండి బెరుకులు ఎక్కువగా రావడం, తొందరగా కంకి వెయ్యడం లాంటి ఫిర్యాదులు వస్తున్నాయని, వీటిని సరిదిద్ధి, నాణ్యమైన విత్తనాన్ని రైతులకు అందుబాటులో ఉంచేందుకు కావాల్సిన అన్ని చర్యలు చేపట్టాలన్నారు. విత్తనోత్పత్తి చేస్తున్న రైతులు నష్టపోయిన సందర్భాలు ప్రభుత్వం దృష్టికి వస్తున్నాయని, విత్తన కంపెనీలకు రైతులకు మధ్య వారధిగా ఉన్న ఆర్గనైజర్లలో కొంతమంది రైతులకు దక్కాల్సిన ధరను కాని, చెల్లించాల్సిన డబ్బుల విషయంలో కానీ వారిని ఇబ్బందులకు గురిచేస్తున్నారని మంత్రి పేర్కొన్నారు. సత్వరమే సీడ్ మెన్ అసోసియేషన్ మరియు కంపెనీ ప్రతినిధులు కూర్చొని విత్తనోత్పత్తి ఒప్పందాలు కంపెనీలకు, రైతులకు మధ్య కుదిరేలా, పండించిన విత్తనానికి చెల్లించే మొత్తం కానీ, సరిగ్గా పంటరాని సందర్భంలో చెల్లించే పరిహారం కానీ రైతులకే చెల్లించే విధంగా చూడాలని, ఇకముందు ఎక్కడైనా ఇటువంటి ఫిర్యాదులు వస్తే ప్రభుత్వం ఆయా కంపెనీల పట్ల కఠినంగా వ్యవహరిస్తుందని స్పష్టం చేశారు. వ్యవసాయాధికారులు వారివారి పరిధిలో ఉన్న విత్తన కంపెనీలను తరుచూ పర్యవేక్షించి, రైతులకు నాణ్యమైన విత్తనం అందేలా చూడాలని, అలసత్వం ప్రదర్శిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. రైతులకు విత్తన ఎంపికలో, కొనుగోళ్లలో పాటించాల్సిన విషయాలపై అవగాహన కార్యక్రమాలు రైతు వేదికలలో చేపట్టాలన్నారు. పోలిస్ శాఖతో సమన్వయం చేసుకుంటు గ్రామాలలో లేబుల్ లేకుండా విత్తనాలు అమ్మే వారిని నియంత్రించే విధంగా చూడాలని ఆదేశించారు. ఇదే సందర్భంలో రాష్ట్రంలో కూరగాయల విత్తనాల లభ్యత, దిగుబడులపై కూడా కంపెనీ ప్రతినిధులతో ఆరా తీసి, కూరగాయల విస్తీర్ణాన్ని పెంచడానికి నాణ్యమైన విత్తనాలు అందుబాటులో ఉంచాలన్నారు. ఈ సమావేశంలో వ్యవసాయశాఖ సెక్రటరి రఘునందన్ రావు, టి.జి సీడ్స్ చైర్మన్ అన్వేష్ రెడ్డి, వ్యవసాయశాఖ డైరెక్టర్ గోపి, సీడ్స్ డైరెక్టర్ యాస్మిన్ బాషా, సీడ్ మెన్ అసోసియేషన్ ప్రతినిధులు, వివిధ కంపెనీ ప్రతినిధులు పాల్గొన్నారు.