తమిళనాడు సీం స్టాలిన్ చేస్తున్న హిందీ భాష వివాదంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మరోసారి స్పందించారు. దక్షిణ భారతదేశంలో హిందీని ఎవరిమీదా రుద్దలేదని స్పష్టం చేశారు. హిందీ నేర్చుకోవడం అవకాశం, తప్పనిసరి కాదని వివరించారు. గత పదేళ్లలో హిందీని తప్పనిసరి చేయలేదని అన్నారు. నేను దక్షిణ భారతదేశానికి చెందినవాడిని కానీ హిందీ మాట్లాడటానికి ప్రయత్నిస్తాను. తాను హిందీ చదవలేదని, కానీ హిందీ నేర్చుకున్నానని చెప్పారు. గత 10 సంవత్సరాల మోడీ ప్రభుత్వంలో, ప్రతి ఒక్కరూ హిందీ నేర్చుకోవాలని ఎప్పుడూ తప్పనిసరి చేయలేదనే విషయాన్ని, స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండి నేటి వరకు హిందీని వ్యతిరేకిస్తున్న వారు అర్థం చేసుకోవాల్సిందిగా కిషన్ రెడ్డి సూచించారు. కాగా హిందీని తమపై బలవంతంగా రుద్దుతున్నారంటూ తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ విమర్శలు చేసిన విషయం తెలిసిందే. తమిళనాడుతో పాటు మరికొన్ని సౌత్ స్టేట్స్ కూడా హిందీపై తమ వ్యతిరేకతను కొన్ని సందర్భాల్లో వెల్లడించాయి. కొత్త విద్యా విధానాన్ని తమిళనాడుకు చెందిన కస్తూరి రంగన్ నేతృత్వం వహించారని, ఆయన సూచనల మేరకే 2022లో కేంద్ర ప్రభుత్వం ఈ కొత్త విద్యా విధానం తీసుకొచ్చిందన్నారు. ఇన్నేళ్ల తర్వాత స్టాలిన్‌కు కొత్త ఎడ్యుకేషన్ పాలసీ గుర్తుకొచ్చిందని ఎద్దేవా చేశారు. ఎన్నికలు వస్తున్నాయనగానే ఎక్కడ లేని సమస్యలు ఆయనకు గుర్తొస్తాయని మండిపడ్డారు. నాలుగేళ్లలో తమిళనాడులో ఏం జరిగిందో అందరికీ తెలుసని, అవినీతి, లిక్కర్ స్కామ్ నుంచి తమిళనాడు ప్రజలను పక్కదారి పట్టించేందుకు సీఎం స్టాలిన్ కొత్త నాటకాలకు తెరలేపారన్నారు. ప్రధాని నరేంద్రమోదీ ఏ రాష్ట్రానికి వెళ్లినా అక్కడి భాషతోనే ఆయన ప్రసంగం ప్రారంభిస్తారంటూ ప్రాంతీయ భాషలకు ఆయన అంతలా గౌరవం ఇస్తారన్నారు. ఉన్నత పాఠశాల విద్య వరకు మాతృభాషలోనే చదువుకోవాలని కొత్త విద్యా విధానం చెబుతోందని, తమిళనాడు నుంచి ఆలిండియా సర్వీసులకు ఎవరైనా ఎంపికై ఉత్తరప్రదేశ్ లో పనిచేయాల్సి వస్తే ఎలా పని చేస్తారన్నారు. హిందీ నేర్చుకుంటే ఉత్తరాదిలో పనిచేయడం సులభమన్నారు. తమిళనాడు డీఎంకే నేతల పిల్లలందరూ ఢిల్లీలో, ఉత్తరాదిన చదువుకుంటున్నారని, డీఎంకే నేతలు నిర్వహించే విద్యాసంస్థల్లో హిందీ బోధన ఉందన్నారు. తమిళనాడులో సీబీఎస్ఈ సహా ప్రైవేట్ విద్యాసంస్థల్లో హిందీ బోధన జరుగుతుందని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. వ్యాపారాలు చేసుకునేందుకు హిందీ అవసరం కానీ, రాజకీయాల వచ్చే సరికి హిందీ వద్దా..? అని ప్రశ్నించారు. తమిళనాడు ప్రజల్లోనూ హిందీ విషయంలో ఎలాంటి అభ్యంతరం లేదని, కేవలం రాజకీయాల కోసమే డీఎంకే నేతలు, కాంగ్రెస్ నాయకులు ఈ నాటకాలు చేస్తున్నారని మండిపడ్డారు.
ఇప్పటికిప్పుడు తెలంగాణ, కర్ణాటకలో ఎన్నికలు జరిగితే బీజేపీ అధికారంలోకి వస్తుందన్నారు. ఎన్నికల సమయంలో బీజేపీ ఇచ్చిన హామీలపై కూడా కిషన్ రెడ్డి స్పందించారు. మేం ఇచ్చిన హామీలను అమలు చేసే బాధ్యత మాదే అని అన్నారు. అలాగే కొన్ని రాష్ట్రాల్లో ఇతర పార్టీ ప్రభుత్వాలు గ్యారంటీలు ఇచ్చి, నిధులు కేంద్రం ఇవ్వాలంటే ఎలా అని ప్రశ్నించారు. కాగా, ఇతర పార్టీల్లో తదుపరి అధ్యక్షుడు ఎవరో చెప్పొచ్చని, కానీ బీజేపీలో అలా కాదు.. జేపీ నడ్డా తర్వాత.. అధ్యక్షుడు ఎవరో దేవుడు కూడా చెప్పలేడన్నారు. ఇటీవల తెలంగాణలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ రెండు సీట్లు గెలుచుకుందన్నారు. తెలంగాణ రాష్ట్రానికి హైదరాబాద్ నుంచే 60% ఆదాయం వస్తోందని, అలాంటప్పుడు హైదరాబాద్‌ను వదిలి ఆదిలాబాద్‌లో ఎలా ఖర్చు చేస్తారని ప్రశ్నిస్తే ఎలా ఉంటుందన్నారు. దేశంలో కూడా ఇదే సూత్రం వర్తిస్తుందని, దేశాభివృద్ధి కోసం వివిధ ప్రాంతాల్లో ఖర్చు పెట్టాల్సి ఉంటుందన్నారు. కొన్ని పార్టీలు రాష్ట్రాల్లో గ్యారంటీల పేరుతో ఏవేవో హామీలు ఇస్తున్నాయి, వాటిని అమలు చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిది ఎలా అవుతుందని నిలదీశారు. – మీరు గ్యారంటీలు ఇచ్చి, అందుకు నిధులు మేం ఇవ్వాలంటే ఎలా? అఇని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను వంద శాతం. తప్పకుండా అమలు చేస్తున్నామన్నారు. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి మోదీ ప్రధాని అయ్యే వరకు ఎన్ని జాతీయ రహదారులు ఉన్నాయో, ఈ పదేళ్లలో అన్ని రహదారులు కొత్తగా ఏర్పడ్డాయో తెలుసుకోవాలన్నారు. బీజేపీలో ప్రజాస్వామ్యం ఉంటుంది. కేసీఆర్ తర్వాత పార్టీ అధ్యక్షుడు ఎవరో చెప్పొచ్చు కానీ బీజేపీలో అలా కాదు. జేపీ నడ్డా తర్వాత అధ్యక్షుడు ఎవరో ఆ దేవుడు కూడా చెప్పలేడన్నారు. బీజేపీ అధికారంలోకి రాకపోతే, మోదీ ప్రధాని కాకపోతే ఆర్టికల్ 370 రద్దు సాధ్యపడేది కాదు, అయోధ్యలో రామాలయం నిర్మాణం జరిగి ఉండేది కాదన్నారు. పాకిస్తాన్ ఐఎస్ఐ కుట్రలు, సీమాంతర ఉగ్రవాద దాడులు కొనసాగుతూ ఉండేవన్నారు. బీజేపీకి అన్ని పార్టీలు భయపడుతున్నాయని, అందుకే కొన్ని పార్టీలు ఏకమవుతున్నాయన్నారు. వారసత్వ పార్టీలన్నీ ప్రైవేటు కంపెనీలుగా మారి డబ్బులు దండుకోవడమే పనిగా పనిచేస్తున్నాయని వ్యాఖ్యానించారు. గతంలో డబ్బులు తెచ్చి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడికి ఇచ్చిన వారికే గనుల కేటాయింపులు జరిగేవని, ఇప్పుడు పూర్తి పారదర్శకంగా సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం వేలం ప్రక్రియ ద్వారా గనుల కేటాయింపు జరుగుతోందన్నారు.








