Mahaa Daily Exclusive

  సన్నబియ్యం పథకం చరిత్రలో నిలిచిపోతుంది పేదలు సన్నబియ్యం తెచ్చే రోజులు తెచ్చాం హుజూర్ నగర్ లో పథకం ప్రారంభించిన సీఎం రేవంత్‌రెడ్డి…!

Share

ఉగాది రోజున సన్నబియ్యం పంపిణీని ప్రారంభించడం సంతోషకరంగా ఉందని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌లో ఏర్పాటు చేసిన సభలో మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో కలిసి సీఎం రేవంత్‌రెడ్డి సన్నబియ్యం పథకాన్ని ప్రారంభించారు. స్పీకర్ గడ్డం ప్రసాద్, మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మంత్రులు కోమటిరెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, శ్రీధర్ బాబు, సీతక్క, ఎంపీలు మల్లురవి, రఘువీర్ రెడ్డి, చామలకిరణ్, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి ఇందులో పాల్గొన్నారు. అనంతరం సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. శ్రీమంతులు తినే సన్నబియ్యం పేదలు కూడా తినే రోజులు వచ్చాయని అన్నారు. ‘‘రూ.1.90కే పేదలకు కిలో బియ్యం ఇవ్వాలని మొదట కోట్ల విజయ్‌భాస్కర్‌రెడ్డి భావించారు. ఎన్నికల తర్వాత ప్రభుత్వం మారడంతో రూ.2 కిలో బియ్యం పథకాన్ని ఎన్టీఆర్‌ ప్రారంభించారు. పేదలకు బియ్యం ఇచ్చేందుకు 1957లోనే రేషన్‌కార్డు దుకాణాలు ప్రారంభించింది కాంగ్రెస్‌ పార్టీ. ప్రస్తుతం ప్రభుత్వం ఉచితంగా ప్రజలకు సన్నబియ్యం ఇస్తోంది. అయితే, ఉచితంగా వచ్చిన బియ్యాన్ని ప్రజలు రూ.10కి అమ్ముకుంటున్నారు. మిల్లర్లు వాటిని కొని రీసైక్లింగ్‌ చేసి మళ్లీ రూ.50కి అమ్ముతున్నారు. పేదల నుంచి రేషన్‌బియ్యాన్ని కొన్న మిల్లర్లు రూ. కోట్లలో దందా చేస్తున్నారు. ఆర్థిక పరిస్థితి మెరుగవడంతో రాష్ట్ర ప్రజలు సన్న బియ్యానికి మొగ్గు చూపుతున్నారు. అందుకే ప్రజల ఆకాంక్ష మేరకు రేషన్‌కార్డులపై సన్నబియ్యం పథకానికి శ్రీకారం చుట్టాం’’అని అన్నారు. ‘‘ ప్రజలకు సన్నబియ్యం ఇవ్వాలనే ఆలోచన గత సీఎంకు ఎప్పుడూ రాలేదు. వరి వేస్తే ఉరే అని.. గత సీఎం వరి పండించనివ్వకుండా రైతులను బెదిరించారు. ఈ ప్రభుత్వం మాత్రం సన్న వడ్లపై క్వింటాల్‌కు రూ.500 బోనస్‌ ఇస్తోంది. సన్నబియ్యం పథకాన్ని భవిష్యత్‌లో రద్దు చేసే సాహసం ఎవరూ చేయరు. ప్రభుత్వాలు మారినా ఈ పథకం కొనసాగుతుంది. రాష్ట్రంలో 3.10 కోట్ల మందికి సన్నబియ్యం ఇస్తాం.

కాళేశ్వరం కూలేశ్వరం అయ్యింది

పదేళ్లు అధికారంలో ఉన్న కేసీఆర్‌ ఎస్‌ఎల్‌బీసీని పూర్తి చేయలేదు. నల్గొండ జిల్లాపై పగతో ఆ ప్రాజెక్టును పక్కన పెట్టారు. ఏడాదికొక కిలోమీటర్‌ తవ్వినా పదేళ్లలో పూర్తయ్యేది. ఎస్‌ఎల్‌బీసీ పూర్తయితే.. నల్గొండ జిల్లాలో లక్షల ఎకరాలకు సాగునీరు వచ్చేది. రూ. లక్ష కోట్లు పెట్టి కాళేశ్వరం నిర్మిస్తే.. అది మూడేళ్లకే కూలింది. ప్రపంచంలో ఏడోవింత అని చెప్పుకున్న కాళేశ్వరం.. కూలేశ్వరం అయ్యింది’’ అని రేవంత్‌రెడ్డి విమర్శించారు. సభలో , ఎమ్మెల్యేలు ఉత్తమ్ పద్మావతి, బిఎల్ ఆర్, వేముల వీరేశం, మందుల సామేలు తదితరులు పాల్గొన్నారు.

సన్న బియ్యం ఇస్తున్న తొలి రాష్ట్రం తెలంగాణ: ఉత్తమ్‌
ఏ రాష్ట్రంలోనూ రేషన్‌ కార్డులపై సన్నబియ్యం పంపిణీ లేదని, తొలిసారిగా తెలంగాణ రాష్ట్రమే ఇస్తోందని మంత్రి ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి అన్నారు. ప్రస్తుతం ఇస్తున్న దొడ్డు బియ్యాన్ని ప్రజలు తినడం లేదన్న ఆయన.. వీటిపై ప్రభుత్వం రూ.10,600 కోట్లు ఖర్చు చేస్తోందని చెప్పారు. ‘‘ దొడ్డు బియ్యంపై ప్రభుత్వం కిలోకు రూ.40 ఖర్చు చేస్తోంది. అయినా ప్రజలు వాటిని తినడం లేదు. దీంతో అవి పక్కదారి పడుతున్నాయి. ఇంకొంచెం అధికధరకు కొనుగోలు చేసి సన్నబియ్యం ఇస్తున్నాం. గత ప్రభుత్వం పదేళ్లపాటు రేషన్‌కార్డులు ఇవ్వలేదు.ఈ ప్రభుత్వం త్వరలోనే కొత్త రేషన్‌ కార్డులు ఇవ్వనుంది. ఆహార భద్రత చట్టాన్ని చేసింది కాంగ్రెస్ ప్రభుత్వమే’’ అని ఉత్తమ్‌ తెలిపారు.